నీలవేణి (ఫైల్)
శ్రీకాకుళం రూరల్: రూరల్ మండలంలోని పొన్నాం పంచాయతీ గొల్లపేటకు చెందిన కోరాడ నీలవేణిని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని నీలవేణి అన్నయ్యలు తాన్ని వెంకట్రావు, తాన్ని రమేష్, మేనమామ దుండు అప్పారావు ఆరోపించారు. శ్రీకాకుళంలోని ‘సాక్షి’ కార్యాలయానికి శుక్రవారం వచ్చి తమ గోడును వెల్లబోసుకున్నారు. వారు ఇచ్చిన వివరాలు ప్రకారం... గార మండలం కొత్తవెలంపేటకు చెందిన కన్నయ్యతో నీలవేణికి 2010లో వివాహం జరిగిందన్నారు. వివాహ సమయంలో లక్షలకొద్ది కట్నంతో పాటు సారీ ముట్టచెప్పినట్టు తెలిపారు. నీలవేణి భర్త కన్నయ్య మద్యంకు బానిసై అదనపు కట్నం కావాలంటూ నిత్యం తన చెల్లెలపై దాడిచేసేవాడని చెప్పారు.
అతనితో పాటు అతని తమ్ముళ్లు కోరాడ బుచ్చిబాబు, కోరాడ రమేష్, కోరాడ విష్ణు కలిసి అదనపు కట్నం కావాలంటూ దెప్పిపొడుస్తూ, ఇంటిలోని సామాన్లు బయటకు విసిరేస్తూ చావుదెబ్బలు కొట్టడంతోనే ఆమె మృతిచెందిందని ఆరోపించారు. ఈ నెల 25వ తేదీన కన్నయ్యతో పాటు అతని బంధువులు కలిసి మూకుమ్మడిగా నీలవేణిని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తెలిపారు. తన చెల్లెలు మరణవార్త తెలుసుకొని వారి ఇంటికి వెళ్లేసరికి మృతదేహాన్ని ఆరుబయట పెట్టేసి ఆత్మహత్యచేసుకున్నట్టుగా వారు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. మృతదేహంపై రక్తపు గాయాలు, వీపుపై పదునైన దెబ్బలు కనిపించడంతో హత్యచేసి ఆత్మహత్యగా కన్నయ్య కుటుంబ సభ్యులు చిత్రీకరించారని వారు పేర్కొన్నారు. తల్లి మృతిచెందడంతో పిల్లలు చరణ్, సాత్విక్ దిక్కులేనివారయ్యారని కన్నీంటి పర్యంతమయ్యారు. ఈ విషయంలో పోలీసులు, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment