ఇరికించబోయారు.. ఇరుక్కున్నారు!
► తండ్రిని చంపి ప్రత్యర్థులపై ఫిర్యాదు
► పోలీసుల విచారణలో నిజాలు ఒప్పుకున్న ఫిర్యాదుదారులు
► నేడో రేపో అరెస్టుకు రంగం సిద్ధం
జమ్మలమడుగు/ పెద్దముడియం: తన తండ్రిని చంపి ఆ కేసులో తమ ప్రత్యర్థులను ఇరికించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో మొత్తం కేసు రివర్స్ అయిపోయింది. వివరాలిలా ఉన్నాయి. గతనెల 17వతేదీ రాత్రి పెద్దముడియం మండలం డి.కల్వటాల గ్రామంలో పెద్దసుబ్బరాయుడు(64) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. రాత్రి నిద్రిస్తున్న వ్యక్తిని ఎవరో చంపి వెళ్లారని, స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలపై తమకు అనుమానం ఉందంటూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే వైఎస్సార్‌సీపీ నాయకులు తమకు ఎలాంటి సంబంధంలేదని ఎలాంటి విచారణకైనా సిద్ధమంటూ పోలీసు స్టేషన్‌కు వచ్చారు.
దీంతో పోలీసులు కేసు చిక్కుముడి ఎలా విప్పాలో అర్థంకాక అవస్థలు పడ్డారు. హత్య జరిగిన ప్రదేశంలో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా డాగ్‌స్క్వాడ్ మృతుని ఇంట్లోకి వెళ్లింది. అయినా పోలీసులకు మృతుడి కుటుంబ సభ్యులపై ఎలాంటి అనుమానం రాలేదు. ఈ నేపథ్యంలో ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ ఇది ఫ్యాక్షన్ హత్య కాదని ఎవరో చంపి ఇక్కడ పడుకోబెట్టారంటూ అనుమానం వ్యక్తం చేశారు.
డీఎస్పీ వ్యక్తం చేసిన అనుమానం ఆధారంగా..
మృతుడు పెద్ద సుబ్బరాయుడుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో రెండో కుమారుడు వెంకటేశ్వర్లుకు అప్పులు ఎక్కువగా ఉండటంతో పాటు భార్య రెండు నెలలపాటు పుట్టింటికి వెళ్లిపోయింది. తన భార్యను తిరిగి కాపురానికి తెచ్చుకున్నాడు. అయితే వేంకటేశ్వర్లు తనకు అప్పులు ఎక్కువగా ఉన్నాయని 50వేల రూపాయలు ఇవ్వాలని లేదా పట్టాదారు పుస్తకాలు పెట్టి బ్యాంక్‌లో రుణం తెచ్చుకుంటానని తండ్రి సుబ్బరాయుడిని కోరాడు. తన వద్ద డబ్బులేదని తండ్రి చెప్పాడు. దీంతో కుమారుడు వెంకటేశ్వర్లు, తండ్రి సుబ్బరాయుడు మధ్య గొడవ పెరిగింది. దీంతో కోపంలో ఇంట్లో ఉన్న ఇనుపరాడ్‌తో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.
భయపడిపోయిన కుమారుడు వెంటనే తల్లిని పిలిచి జరిగిన విషయాన్ని చెప్పి తల్లి కాళ్లుపట్టుకున్నాడు. దీంతో కొడుకును కాపాడుకునేందుకు ఇంట్లో పడిఉన్న రక్తాన్ని పూర్తిగా తుడిచి ఇంటిని శుభ్రం చేశారు. రాత్రి పదిగంటల ప్రాంతంలో మరణించిన పెద్దసుబ్బరాయుడుని ఎవరికి అనుమానం రాకుండా ఇంటి ఆరుబయట మంచం వేసి పడుకోబెట్టారు. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడైన ప్రకాష్‌రెడ్డి మరో నలుగురు చంపి ఉంటారంటూ ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో వెంకటేశ్వర్లు నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. ఎస్పీనుంచి ఆదేశాలు రాగానే వీరిని అరెస్టు చూపిం^è నున్నారు.