ఎంపీ రామ్మోహన్‌నాయుడు, దువ్వాడ శ్రీనివాస్
మా తాతలు నేతులు తాగారు. మా మూతులు వాసన చూడండి అన్నట్లుగా ఉంది శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడి పరిస్థితి అని జిల్లా ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ఆయన తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు మరణానంతరం సానుభూతితో వారసత్వంగా రాజకీయాలకు కొత్తవ్యక్తి అయినా తొలిసారే ఎంపీగా అవకాశమిచ్చిన జిల్లా ప్రజలకు ఆయన ఇచ్చిన బహుమానం ప్రజలకు దూరంగా ఎక్కడో ఉండడమేనని ఆరోపిస్తున్నారు.
సాక్షి, టెక్కలి (శ్రీకాకుళం): సార్వత్రిక ఎన్నికల ఘట్టం తుదిదశకు వచ్చేసింది. రాష్ట్రానికి చిట్టచివర్లో ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా గ్రామాలన్నీ వలస బాట పడుతూ..నిరుద్యోగ యువతకు ఎటువంటి ఉపాధి అవకాశాలు లేక వెనుకబడిన జిల్లాగా గుర్తింపు పొందిన శ్రీకాకుళం కోటలో ఈ సారి ఎన్నికల వార్ వన్‌సైడ్‌గా కనిపిస్తోంది. దివంగత ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు తనయుడిగా జిల్లా ప్రజల సెంటిమెంట్‌ను అనుకూలంగా చేసుకుని రాజకీయాల్లోకి వచ్చి మొదటి చాన్స్‌గా ఎంపీగా గెలిచిన రామ్మోహన్‌నాయుడు ఐదేళ్లలో జిల్లాకు చేసిన అభివృద్ధి శూన్యమనే ఆరోపణలు ఉన్నాయి. ఎంపీగా గెలిచిన తరువాత జిల్లా అభివృద్ధిని పట్టించుకునే విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు పూర్తిగా ప్రజల్లో లేరనే విమర్శలు ఉన్నాయి.
ఆయన బాబాయ్ అచ్చిన్నాయుడు పెద్దరికం ముందు రామ్మోహన్‌నాయుడు ఎంపీ పదవి ఎందుకూ పనికిరాకుండా పోవడమే కాకుండా కేవలం ఎంజాయ్ చేయడానికే ఎంపీ పదవిని అలంకరించారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఈ సారి ఎన్నికల్లో ఎంపీ రామ్మోహన్‌నాయుడిని పక్కన పెట్టడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీకి వస్తున్న ప్రభంజనంతో శ్రీకాకుళం జిల్లా ఎంపీ స్థానాన్ని సైతం వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌కు కట్టబెట్టే ఆలోచనలో సిక్కోలు ప్రజలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడుల అనుకూల, ప్రతికూలాంశాలను ఓసారి గమనిస్తే ఇలా ఉన్నాయి.
వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడకు అనుకూలాంశాలు
♦ ప్రజలతో మమేకమయ్యే తత్వం. సమస్యలపై తక్షణమే స్పందించే గుణం.
♦ గతంలో కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ప్రజల తరఫున ఉద్యమం చేసి, సుమారు నెలరోజులకు పైగా జైలు జీవితం గడపడం.
♦ నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న అనుభవం, నేడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కూడా సాన్నిహిత్యంగా ఉండడం.
♦ ప్రజలు, కార్యకర్తలకు ఏ రాత్రి కష్టమొచ్చినా స్థానికంగా అందుబాటులో ఉండడం. ఆర్థికంగా సహకారం అందించడం.
♦ నీతి నిజాయితీగా రాజకీయాలు చేసే కుటుంబంగా ప్రజల్లో గుర్తింపు
♦ జిల్లా సమస్యలపై పూర్తి అవగాహన ఉండడం.
♦ ముఖ్యంగా కాళింగ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా గుర్తింపు
♦ గ్రామగ్రామాల్లో కార్యకర్తలు, అభిమానులకు పేరుపెట్టి పిలిచే చనువు ఉండడం
ప్రతికూలాంశాలు
♦ దూకుడు తత్వం
టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌నాయుడు ప్రతికూలాంశాలు
♦ దివంగత ఎంపీ ఎర్రన్నాయుడు తనయుడిగా రాజకీయాల్లోకి అరంగ్రేటం చేసి ఎంపీగా గెలిచినప్పటికీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం.
♦ జిల్లాలో వలసల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం.
♦ ఎంపీగా జిల్లా సమస్యలపై డిల్లీస్థాయిలో పోరాటాలు చేయకపోవడం.
♦ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు చూపకపోవడం.
♦ జిల్లాలో మూతపడిన పరిశ్రమలను తెరిపించలేకపోవడం.
♦ రైతులకు ఉపయోగపడే విధంగా నదుల అనుసంధానం చేయడంలో ఘోరంగా వైఫల్యం.
♦ జిల్లాలో ఉన్న రైల్వేస్టేషన్ల అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం.
♦ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఆసరాగా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకపోవడం.
♦ జీడి, కొబ్బరి రైతులకు ఆసరాగా అనుసంధానమైన పరిశ్రమలు నెలకొల్పలేకపోవడం.
♦ మత్స్యకారుల అభివృద్ధికి చర్యలు తీసుకోకపోవడం.
♦ జిల్లాలో సమస్యలను పూర్తిగా విస్మరించడం.
అనుకూల అంశం
దివంగత ఎంపీ కె.ఎర్రన్నాయుడు తనయుడిగా పూర్తికాలం ఎంపీగా కొనసాగడం
Comments
Please login to add a commentAdd a comment