రామ్మోహన్‌నాయుడు స్వస్థలం కోటబొమ్మాళి మండలంలో అభివృద్ధికి నోచుకోని హరిశ్చంద్రపురం రైల్వే హాల్ట్
వేదికలెక్కి ఉపన్యాసాలు దంచుతారు. అనర్గళంగా మాట్లాడతారు. అది చూసిన వారెవరైనా ఆహా! అనుకుంటారు. ఆ జిల్లాకు ఎంతో అభివృద్ధి చేస్తున్నారని భ్రమ పడతారు. కానీ వాస్తవాన్ని పరిశీలించిన వారు ఆయన మాటల మాంత్రికుడే తప్ప అభివృద్ధి చోదకుడు కాదని ఇట్టే పసిగట్టేస్తారు. మాటలు కోటలు దాటించే ఆ కోతల రాయుడు.. కింజరాపు రామ్మోహన్‌నాయుడు..! శ్రీకాకుళం లోక్‌సభ సభ్యుడు. ఇప్పుడు టీడీపీ తరఫున రెండోసారి బరిలో ఉన్నారు. ఫ్యాన్ గాలికి ఎదురీదుతున్నారు.
సాక్షి, శ్రీకాకుళం: గత ఎన్నికల్లో గెలవడానికి ఎన్నెన్నో హామీలు గుప్పించిన రామ్మోహన్‌నాయుడు గెలిచాక నియోజకవర్గ ప్రజలను తన పరుగు కలుసుకోమన్నారు. ఓడలో ఉన్నంతసేపు ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడి మల్లన్న అన్న చందంగా వ్యవహరించారు. ఉంటే ఢిల్లీలోను.. లేదంటే శ్రీకాకుళంలోనే తప్ప తనను గెలిపించిన పల్లెలకు వెళ్లే ప్రయత్నమే చేయడం మానేశారు. ఐదేళ్లలో ఎంపీ తమ ఊళ్లకు వస్తారని, ఎంతో అభివృద్ధి చేస్తారని ఓట్లేసి గెలిపిం చిన వారికి నిరాశనే మిగిల్చారు. రామ్మోహన్‌నాయుడికి స్థానిక సంస్థలంటే చిన్నచూపు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు కూడా హాజరు కాలేదు. దీంతో అక్కడ చర్చకొచ్చే ప్రధాన సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించే వీలు లేకుండా పోయింది.
వచ్చిన నిధులనూ ఖర్చు చేయలేదు..
ఏ ఎంపీ అయినా నియోజకవర్గం అభివృద్ధికి నిధుల కోసం పోరాటం చేసి తెచ్చుకుంటారు. కానీ ఈయన పోరాటం చేయడం మాట అటుంచి కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా సక్రమంగా వినియోగించలేకపోయారు. ఒక్కో ఎంపీకి ఎంపీ ల్యాడ్స్ కింద ఏటా రూ.5 కోట్ల నిధులు వస్తాయి. ఇలా రూ.20 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో నాలుగో వంతు నిధులు ఇంకా ఖర్చు చేయలేదు. ఐదో విడత రావలసిన రూ.5 కోట్లకు ప్రతిపాదనలు పంపకపోవడంతో అవి కూడా విడుదల కాలేదు. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద శ్రీకాకుళం జిల్లాకు ఏటా రూ.50 కోట్లు చొప్పున మూడేళ్లకు రూ.150 కోట్లు విడుదల చేసింది.
దీనికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.50 కోట్లు మంజూరు చేసింది. ఈ రూ.200 కోట్లలో ఇప్పటిదాకా రూ.150 కోట్లు ఖర్చు చేశారు. ఇవి కేంద్రం నిర్దేశించిన వాటికి కాకుండా ఇతర పనులకు వెచ్చించడంతో యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీలు) సమర్పించలేక పోయారు. దీంతో మరో రెండు విడతల్లో రావలసిన రూ.100 కోట్లు వెనక్కి పోయాయి. కనీసం కేంద్రం నుంచి వచ్చే నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపే ప్రయత్నం కూడా చేయకపోవడం రామ్మోహన్‌నాయుడికి ఈ జిల్లాపై ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది.
చెట్టుపేరు చెప్పుకుని..
ఇన్నాళ్లూ వేదికలెక్కి ఉపన్యాసాలు దంచుతుంటే ఆహా.. ఓహో అనుకున్న జిల్లావాసులు ఇప్పుడు రామ్మోహన్‌నాయుడు మాటలపోగే తప్ప చేతల నేత కాదని గ్రహించారు. ఇప్పుడు మళ్లీ మరోసారి తనను గెలిపించాలని తిరుగుతుంటే ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐదేళ్లలో తాను ఈ అభివృద్ధి చేశానని గట్టిగా చెప్పుకోలేకపోతున్నారు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్నట్టు తండ్రి ఎర్రన్నాయుడి హయాంలో జరిగిన కాస్త అభివృద్ధినే చెప్పుకుంటున్నారు. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వీస్తున్న ఫ్యాన్ గాలి ధాటికి మాటల నాయుడిగా పేరు తెచ్చుకున్న రామ్మోహన్‌నాయుడు వెన్నులో వణుకు మొదలైంది.
హామీలూ గాలికే..!
రామ్మోహన్‌నాయుడు ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో ఇచ్చిన హామీలనూ గాలికొదిలేశారు. వాటిలో మచ్చుకు కొన్ని..
హామీ: శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వే స్టేషన్‌లో 22 వరకు ప్రధాన రైళ్లకు హాల్ట్ ఇచ్చేలా కృషి చేస్తానన్నారు.
వాస్తవం: ఈ ఐదేళ్లలో ఈ రైళ్లకు హాల్ట్ ఇప్పించలేకపోయారు. ఈయన నిర్వాకంతో ఈ స్టేషన్ మీదుగా ఎన్నో ఎక్స్‌ప్రెస్ రైళ్లు రయ్‌మంటూ వెళ్లిపోతున్నాయి. వీటిలో తిరుపతి, తిరుచ్చి–హౌరా, హౌరా–యశ్వంత్‌పూర్, విల్లుపురం, కన్యాకుమారి, దురంతో, హిరాకుడ్, పూనే–భువనేశ్వర్, దిబ్రూగఢ్–చెన్నై, యశ్వంతపూర్ ఏసీ ఎక్స్‌ప్రెస్, భాగల్పూర్–యశ్వంత్‌పూర్, మైసూర్, డిఘా–విశాఖపట్నం, హల్దియా–చెన్నై, హమ్‌సఫర్, గౌహతి–చెన్నై, బెంగళూర్, రామేశ్వరం, సువిధ వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లున్నాయి.
హామీ: ఇచ్ఛాపురం, పలాస, నౌపడా, హరిశ్చంద్రపురం, కోటబొమ్మాళి, ఆమదాలవలస రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
వాస్తవం: ఆ హామీకీ తిలోదకాలిచ్చారు. రైళ్ల హా ల్ట్‌పై గాని, ఈ స్టేషన్ల ఆధునికీకరణపై గాని పార్లమెంట్‌లో గట్టిగా మాట్లాడిన సందర్భాలే లేవు.
హామీ: తనను గెలిపిస్తే పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసి జిల్లాలో యువతకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు.
వాస్తవం: ఎంపీ అయ్యాక రామ్మోహన్‌నాయుడు ఆ హామీని మరిచారు. పరిశ్రమల గురించి, ఉపాధి గురించి పట్టించుకున్నదే లేదు.
హామీ: ఎంపీగా గెలిచాక 32 గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానన్నారు.
వాస్తవం: గెలిచాక ఆ దత్తత గ్రామాలను సైతం పట్టించుకున్న పాపాన పోలేదు. వాటి వైపు కన్నెత్తి చూడలేదు.
Comments
Please login to add a commentAdd a comment