విలేకరులతో మాట్లాడుతున్న బాధిత కార్యకర్తలు
సాక్షి, కంచిలి/కవిటి (శ్రీకాకుళం): ఎన్నికల వేళ ఇచ్ఛాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్, ఆయన అనుచరవర్గం వ్యవహరించే తీరును పరిశీలిస్తే .. రౌడీ రాజ్యమా లేక ప్రజాస్వామ్యం ఇక్కడ నడుస్తుందా అనే అనుమానం కలుగుతోంది. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ వ్యవహర శైలిపై స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. మంగళవారం రాత్రి కవిటిలో అనుమానస్పదంగా రాత్రి సంచరిస్తున్న టీడీపీ నాయకుల వాహనాలపై వీడియో షూట్ చేసి ఎన్నికల కమిషన్ సివిజల్ యాప్‌లో పంపించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని తీవ్రంగా గాయపర్చిన సంఘటన నియోజకవర్గ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
సోంపేటకు చెందిన జనసేన పార్టీ కార్యకర్త మణిసంతోష్‌ను టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్, అనుచరులు స్పృహతప్పేలా చితక్కొట్టారని, స్పృహ వచ్చాక బెదిరించి వారికి అనుకూలంగా మొబైల్‌లో వీడియో షూట్‌చేసి, కవిటి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఎస్‌ఐ పి.పారినాయుడుతో తప్పుడు కేసు నమోదు చేస్తామని బెదిరించి, తెల్లకాగితం మీద సంతకాలు తీసుకొన్నారని ఆరోపించారు. ఈ సంఘటన వివరాలను బాధితులైన జనసేన పార్టీ కార్యకర్తలు బుధవారం మధ్యాహ్నం కుసుంపురం వద్ద విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
అశోక్ తీరుపై ధ్వజం
కవిటిలో మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో అనుమానాస్పదంగా నంబర్‌లేని కారు, మరికొన్ని మోటారు సైకిళ్లు సంచరిస్తుండడాన్ని సోంపేట, కవిటి మండలాలకు చెందిన జనసేన కార్యకర్తలు గమనించినట్టు బాధితుడు మణిసంతోష్, కార్యకర్తలు కె.ప్రశాంత్, మిన్నారావు, బి.కృష్ణారావు తెలిపారు. పట్టణంలో శివాలయం వద్ద గల ఒక ఇంట్లో ఈ తతంగమంతా జరుగుతుండడడంతో బాధ్యతగల ఒక పౌరుడిగా సాక్ష్యాధారాలతో వీడియో తీసి, ఎన్నికల కమీషన్‌కు సివిజిల్ యాప్‌లో పొందుపరిచేందుకు ప్రయత్నించానని సోంపేటకు చెందిన జనసేన కార్యకర్త మణిసంతోష్ చెప్పారు. దీన్ని గమనించిన స్థానికులు తనను ఈడ్చుకొని ఒక ఇంట్లో బంధించి, టీడీపీ అభ్యర్థి అశోక్, అనుచరులు సుమారు 15 మంది కలిసి ఎందుకొచ్చావంటూ చితక్కొట్టడంతో స్పృహ కోల్పోయానన్నారు.
స్పృహ వచ్చిన తర్వాత తమకు అనుకూలంగా తనతో కొన్ని మాటలు చెప్పించే వీడియోను షూట్ చేశారని వాపోయాడు. తర్వాత మిగిలిన జనసేన పార్టీ కార్యకర్తల్ని కవిటి స్టేషన్‌కు తీసుకెళ్లారన్నారు. ఎస్‌ఐ పారినాయుడు తమను ఆ ప్రాంతానికి ఎందుకెళ్లారని ప్రశ్నించారన్నారు. దీనిపై వారు మాట్లాడుతూ పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు మద్యం, నగదు పంపిణీని అడ్డుకోవడమే ధ్యేయంగా సివిజల్ యాప్‌లో అక్కడ జరుగుతున్న తతంగాన్ని అధికారులకు చేరవేసేందుకు ప్రయత్నించామని, మా ప్రయత్నాన్ని ఆదిలోనే గండికొట్టారని ఎస్‌ఐతో చెప్పినట్టు మీడియా ముందు వెల్లడించారు. ఇకపై ఇటువంటి పనులు చేయకుండా ఉండాలని హెచ్చరిస్తూ తెల్ల కాగితంపై సంతకాలు తీసుకున్నారని, వీడియోలో బంధించడం తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.
రక్షణ కల్పించాలి
పత్రికల్లో రాయడానికి వీల్లేని పదజాలంతో తమ ను దూషించి, ఎన్నికలైన తరువాత మా ఆరుగురు తలలు నరికి తన ఇంటి గుమ్మానికి వేలాడదీస్తానని తీవ్ర స్వరంతో టీడీపీ అభ్యర్థి అశోక్ హెచ్చరికలు జారీచేశారని, దీంతో తమకు ప్రాణ హాని ఉందని, ప్రభుత్వమే రక్షణ కల్పించాలని బాధితులు మీడియాకు వివరించారు. ఈ విషయమై కవిటి ఎస్‌ఐ. పారినాయుడు ‘సాక్షి’తో మాట్లాడుతూ మంగళవారం రాత్రి టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ నుంచి అనుమానాస్పదంగా కొందరు యువకులు తిరుగుతున్నారని ఫిర్యాదు చేయడంతో , సోంపేటకు చెందిన మణిసంతోష్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించామన్నారు. తీరా ఆ యువకుడు సోంపేటకు చెందిన వ్యక్తిగా తేలిందని, తర్వాత కొందరు యువకులు వచ్చి తమకు తెలుసునని చెప్పడంతో పూచీకత్తుగా తెల్లకాగితాలు మీద సంతకాలు తీసుకొని విడిచిపెట్టామని ఎస్‌ఐ.పారినాయుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment