జెట్టి లేక తీరంలో ఉన్న పడవలు
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్ (శ్రీకాకుళం): ఎన్నికల్లో హామీ ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక విస్మరించడం పరిపాటిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీ నేటికీ అమలుచేయలేదని పలువురు విమర్శిస్తున్నారు. నియోజకవర్గంలోని ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చే పార్టీకే తమ మద్దతు ఉంటుందని బాహాటంగా చెబుతున్నారు.
పూర్తికాని తోటపల్లి
ఎచ్చెర్ల నియోజకవర్గంలో ప్రధాన సాగునీటి ఆయకట్టు తోటపల్లి ప్రాజెక్టు, రణస్థలం, లావేరు, జి.సిగడాం మండలాల్లో 57 ఎకరాలకు సాగునీరు అందించాలి. 2015 ఖరీఫ్ నాటికీ సాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ సమస్యకు పరిష్కారం చూపలేదు . నియోజకవర్గంలో సాగునీటి సమస్య ఉంది. పిల్ల కాల్వలు నిర్మాణం పూర్తి కాకపోవడం, కాల్వల భూసేకరణ సైతం ముందుకు సాగకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. దీంతో రైతులు సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నారాయణపురం ఆయకట్టు కుడికాలువ కింద ఎచ్చెర్ల మండలంలో సుమారు 7500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 2014లో అధికారంలో వచ్చిన వెంటనే అధునికీకరిస్తామని హామీ ఇచ్చారు. నేటి వరకు పనులు ప్రారంభానికి నోచుకోలేదు. రైతుల సమ్యలు గాలికొదిలేశారు. సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు.
కలగానే డిగ్రీ కళాశాల ఏర్పాటు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాయం ఎచ్చెర్లలో ఉంది. జిల్లాలోని డిగ్రీ కళాశాలను పర్యవేక్షిస్తోంది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో మాత్రం డిగ్రీ కళాశాల లేదు. 2015లో ఎచ్చెర్ల, రణస్థలం ప్రాంతాల్లో కళాశాల ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన హామీ మాటలకే పరిమితమైందని పలువురు చెబుతున్నారు. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల నిర్వహణకు అనుమతులు ఇవ్వడం విడ్డూరం.
రైతుల పాట్లు
జి.సిగడాం మండలంలో ముడ్డువలస ప్రాజెక్టు కింద సుమారు 6000 ఎకరాల ఆయకట్టు ఉంది. చిన్న కాలువల నిర్మాణం జరగక, పూడికలు తొలగించక శివారు భూములు కావడంతో సాగునీరు సక్రమంగా అందడం లేదు.
అటకెక్కిన మినీ రిజర్వాయర్ హామీ
లావేరు మండలంలోని బుడుమూరు గ్రామంలోని నారాయణ సాగరం మినీ రిజర్వాయర్‌గా తీర్చిదిద్ది సాగునీరు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లయినా హామీ అమలుకాలేదు. ఈ ప్రాంతంలో రైతులు జలాశయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎస్.ఎం. పెద్దచెరువు ఎచ్చెర్ల మండలంలో ప్రధాన సాగునీటి వనరు. ఈ చెరువుకు మడ్డువలస మిగులు జలాలు అందజేస్తామన్న హామీ కలగానే మిగిలిపోయిందని రైతులు చెబుతున్నారు.
ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నా...
ఎచ్చెర్ల నియోజకవర్గంలో రెండు ప్రతిష్టాత్మక వర్సిటీలు ఉన్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీలో సమస్యలు వెంటాడుతున్నాయి. అధ్యాపకుల కొరత, మౌలిక వసతుల సమస్య ఉంది. రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ) 2016లో ఏర్పాటైంది. 2016–17 బ్యాచ్, 2018– 19 బ్యాచ్‌లు కృష్ణా జిల్లా నూజివీడులో కొనసాగుతున్నాయి. 2017–18 బ్యాచ్ ఒక్కటి మత్రమే స్థానికంగా కొనసాగుతోంది. అద్దె భవనాల్లో ప్రస్తుతం తరగతులు నిర్వహిస్తున్నారు.
నిర్మాణానికి నోచుకోని జెట్టీలు
ఎచ్చెర్ల, రణస్థలం ప్రాంతాల్లోని సుమారు 12 పంచాయతీల్లో ప్రజలు సముద్ర వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కోల్డ్ స్టోరేజీలు లేక చేపలు వంటి ఆరబెట్టుకునేందుకు స్థలాలు లేక , బోట్లు, పడవలు సురక్షింగా ఉంచుకునేందుకు జెట్టీలు లేక నానా అవస్థలు పడుతున్నారు. తుపాన్లు ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు పడవలు, బోట్లు సముద్రంలో కొట్టుకుపోతున్నాయని, జెట్టీ నిర్మిస్తే సురక్షితంగా ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. గతంలో జెట్టీ నిర్మిస్తామని హామీ ఇచ్చి నేటి వరకు అమలుచేయలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment