Echerla
-
శ్రీకాకుళం: రేపే సీఎం జగన్ జిల్లా పర్యటన
సాక్షి, శ్రీకాకుళం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (శుక్రవారం) శ్రీకాకుళం జిల్లా పర్యటించనున్నారు. ఆయన పలాస– కాశీబుగ్గలో పలు అభివృద్ది పథకాలకు శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడ నుంచి ఎచ్చెర్లలో ట్రిపుల్ ఐటీలోని పలు భవనాలను ప్రారంభించిన అనంతరం శ్రీకాకుళం రూరల్ సింగుపురం వద్ద గల అక్షయ పాత్ర వంటశాలను ప్రారంభిస్తారు. సవివరమైన టూర్ షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి ఓఎస్డీ విడుదల చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో ఉదయం 9.30 గంటలకు విమానంలో బయలుదేరి 10.15 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు కాశీబుగ్గ చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయం దగ్గర గల పోలీస్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. 11.05కు కాశీబుగ్గ పోలీస్ గ్రౌండ్ నుంచి రోడ్డు మార్గంలో కాశీబుగ్గ రైల్వే గ్రౌండ్‌కు బయలుదేరి 11.10కి చేరుకుంటారు. 11.10 గంటల నుంచి 1 గంట వరకు.. ఉద్దానం తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు, వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట వద్ద గల ఫిషింగ్ జెట్టీ నిర్మాణానికి, పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, రిసెర్చి సెంటర్ భవనాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. నాణ్యమైన బియ్యాన్ని ఇంటింటికీ సరఫరా చేసే పథకాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు కాశీబుగ్గ రైల్వే గ్రౌండు నుంచి కాశీబుగ్గ పోలీస్ గ్రౌండుకు వచ్చి హెలికాప్టర్లో బయలుదేరుతారు. 1.40కు హెలికాప్టర్లో ఎచ్చెర్ల ఏఆర్ పోలీస్ గ్రౌండ్‌కి చేరుకుంటారు. 1.45కు బయలుదేరి ఎస్ఎం పురం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు 1.50కు చేరుకుంటారు. 1.50 నుంచి 2. 40 వరకు మధ్యాహ్న భోజన విరామం ఆ తర్వాత 2.40 నుంచి 3.40 వరకు.. ట్రిపుల్ ఐటీలోని అకడమిక్, వసతి గృహ బ్లాక్‌ను ప్రారంభిస్తారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. 3.40కు రోడ్డు మార్గంలో శ్రీకాకుళం మండలంలోని సింగుపురం వద్ద గల అక్షయపాత్ర వంట కేంద్రానికి బయిలుదేరుతారు. 3.55 నుంచి 4.30 గంటల వరకు సింగుపురంలోని అక్షయపాత్ర సెంట్రల్ కిచెన్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 4.30కు సింగుపురం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో ఎచ్చెర్లలోని ఏఆర్ పోలీస్ క్వార్టర్సు గ్రౌండ్‌కు చేరుకుంటారు. 4.50 గంటలకి హెలికాప్టర్లో విశాఖపట్నం తిరుగుపయనమవుతారు. అక్కడి నుంచి విమానంలో విజయవాడ వెళతారు. -
అన్నీ అపరిష్కృతంగానే...
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్ (శ్రీకాకుళం): ఎన్నికల్లో హామీ ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక విస్మరించడం పరిపాటిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీ నేటికీ అమలుచేయలేదని పలువురు విమర్శిస్తున్నారు. నియోజకవర్గంలోని ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చే పార్టీకే తమ మద్దతు ఉంటుందని బాహాటంగా చెబుతున్నారు. పూర్తికాని తోటపల్లి ఎచ్చెర్ల నియోజకవర్గంలో ప్రధాన సాగునీటి ఆయకట్టు తోటపల్లి ప్రాజెక్టు, రణస్థలం, లావేరు, జి.సిగడాం మండలాల్లో 57 ఎకరాలకు సాగునీరు అందించాలి. 2015 ఖరీఫ్ నాటికీ సాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ సమస్యకు పరిష్కారం చూపలేదు . నియోజకవర్గంలో సాగునీటి సమస్య ఉంది. పిల్ల కాల్వలు నిర్మాణం పూర్తి కాకపోవడం, కాల్వల భూసేకరణ సైతం ముందుకు సాగకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. దీంతో రైతులు సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నారాయణపురం ఆయకట్టు కుడికాలువ కింద ఎచ్చెర్ల మండలంలో సుమారు 7500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 2014లో అధికారంలో వచ్చిన వెంటనే అధునికీకరిస్తామని హామీ ఇచ్చారు. నేటి వరకు పనులు ప్రారంభానికి నోచుకోలేదు. రైతుల సమ్యలు గాలికొదిలేశారు. సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. కలగానే డిగ్రీ కళాశాల ఏర్పాటు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాయం ఎచ్చెర్లలో ఉంది. జిల్లాలోని డిగ్రీ కళాశాలను పర్యవేక్షిస్తోంది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో మాత్రం డిగ్రీ కళాశాల లేదు. 2015లో ఎచ్చెర్ల, రణస్థలం ప్రాంతాల్లో కళాశాల ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన హామీ మాటలకే పరిమితమైందని పలువురు చెబుతున్నారు. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల నిర్వహణకు అనుమతులు ఇవ్వడం విడ్డూరం. రైతుల పాట్లు జి.సిగడాం మండలంలో ముడ్డువలస ప్రాజెక్టు కింద సుమారు 6000 ఎకరాల ఆయకట్టు ఉంది. చిన్న కాలువల నిర్మాణం జరగక, పూడికలు తొలగించక శివారు భూములు కావడంతో సాగునీరు సక్రమంగా అందడం లేదు. అటకెక్కిన మినీ రిజర్వాయర్ హామీ లావేరు మండలంలోని బుడుమూరు గ్రామంలోని నారాయణ సాగరం మినీ రిజర్వాయర్‌గా తీర్చిదిద్ది సాగునీరు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లయినా హామీ అమలుకాలేదు. ఈ ప్రాంతంలో రైతులు జలాశయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎస్.ఎం. పెద్దచెరువు ఎచ్చెర్ల మండలంలో ప్రధాన సాగునీటి వనరు. ఈ చెరువుకు మడ్డువలస మిగులు జలాలు అందజేస్తామన్న హామీ కలగానే మిగిలిపోయిందని రైతులు చెబుతున్నారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నా... ఎచ్చెర్ల నియోజకవర్గంలో రెండు ప్రతిష్టాత్మక వర్సిటీలు ఉన్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీలో సమస్యలు వెంటాడుతున్నాయి. అధ్యాపకుల కొరత, మౌలిక వసతుల సమస్య ఉంది. రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ) 2016లో ఏర్పాటైంది. 2016–17 బ్యాచ్, 2018– 19 బ్యాచ్‌లు కృష్ణా జిల్లా నూజివీడులో కొనసాగుతున్నాయి. 2017–18 బ్యాచ్ ఒక్కటి మత్రమే స్థానికంగా కొనసాగుతోంది. అద్దె భవనాల్లో ప్రస్తుతం తరగతులు నిర్వహిస్తున్నారు. నిర్మాణానికి నోచుకోని జెట్టీలు ఎచ్చెర్ల, రణస్థలం ప్రాంతాల్లోని సుమారు 12 పంచాయతీల్లో ప్రజలు సముద్ర వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కోల్డ్ స్టోరేజీలు లేక చేపలు వంటి ఆరబెట్టుకునేందుకు స్థలాలు లేక , బోట్లు, పడవలు సురక్షింగా ఉంచుకునేందుకు జెట్టీలు లేక నానా అవస్థలు పడుతున్నారు. తుపాన్లు ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు పడవలు, బోట్లు సముద్రంలో కొట్టుకుపోతున్నాయని, జెట్టీ నిర్మిస్తే సురక్షితంగా ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. గతంలో జెట్టీ నిర్మిస్తామని హామీ ఇచ్చి నేటి వరకు అమలుచేయలేదన్నారు. -
ఎచ్చెర్లలో.. ‘కళా’విహీనం
సాక్షి, శ్రీకాకుళం: స్థానికుడు కాకపోయినా అభివృద్ధి చేస్తారని ఆశించారు. అందరికీ అందుబాటులో ఉంటారని ఓట్లేసి గెలిపించారు. గెలిచాక ప్రజలకు అందనంత దూరంగా ఉన్నారు. పేదలు, సామాన్యులను చెంతకు చేరనీయరు. వారి సమస్యలు వినడానికే చిరాకు పడిపోతుంటారు. తనకు బదులు ఇద్దరు పీఏల (ఒకరు పీఏ, మరొకరు ఓఎస్డీ)ను నియమించుకున్నారు. వారిద్దరూ షాడో ఎమ్మెల్యేలుగా చలామణి అయ్యారు. ఈ ఐదేళ్లూ నియోజకవర్గంలో వారిద్దరే చక్రం తిప్పారు. ఇప్పుడు మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ మంత్రి కళా వెంకట్రావు ఎచ్చెర్ల ఎన్నికల బరిలోకి దిగారు. గత ఐదేళ్ల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని నియోజక వర్గ ప్రజలు ‘నీ సేవలు చాలు..’ అంటూ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..! కళా వెంకటరావు ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన వారు కాదు. ఆయన సొంత నియోజకవర్గం రాజాం పునర్విభజనలో ఎస్సీలకు రిజర్వ్ కావడంతో 2014 ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో వచ్చి వాలారు. అప్పటి వైఎస్సార్సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌పై 4,741 ఓట్ల స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. స్థానికేతరుడైనా కళా వెంకటరావును నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత అక్కడి ప్రజలకు ఆయన ఎమ్మెల్యేగా కాకుండా అప్పుడప్పుడూ వచ్చే అతిథి అయ్యారు. నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవడం మానేశారు. అక్కడి వారు తమ సమస్యను చెప్పుకోవాలంటే 80 కిలోమీటర్ల దూరంలోని రాజాంలో ఏర్పాటు చేసిన క్యాంప్ ఆఫీసుకు వెళ్లాలి. వయసు మీరిన వారికి అంత దూరం వెళ్లడం ఎంతో కష్టమయ్యేది. ఇక తప్పనిసరి అయిన వారు వెళ్లినా ఎమ్మెల్యే దర్శన భాగ్యం గగనమయ్యేది. వచ్చిన వారిలో పేరున్న వారో, స్థితిమంతులో అయితేనే కలిసేందుకు అనుమతిస్తారన్న పేరు మూటగట్టుకున్నారు. దీంతో ఈ నాలుగేళ్లలో ఆ స్థాయి ఉన్న వారే రాజాం వెళ్లేవారు. అప్పుడప్పుడు ఎమ్మెల్యే ఎచ్చెర్లకు వచ్చినప్పుడూ సామాన్యుల గోడు వినే పరిస్థితి లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అంతేకాదు ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఏ కష్టమొచ్చినా కళా వెంకటరావు పరామర్శకు కూడా రారని, ధనికుల ఇంట్లో పెళ్లి, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు మాత్రమే హాజరవుతారన్న పేరుంది. పర్సంటేజీలు, కమీషన్లు.. మరోపక్క ఆయన ఒక పీఏ (వెంకటనాయుడు)ను, మరో ఓఎస్డీ (కిమిడి కృష్ణంనాయుడు)ను ఏరికోరి నియమించుకున్నారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన పథకం (సెర్ప్)లో కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన కృష్ణంనాయుడుకు ఓఎస్డీ నియామకమే నిబంధనలకు విరుద్ధమంటూ అభ్యంతరాలు వ్యక్తమైనా పట్టించుకోలేదు. మంత్రి తన పనుల్లో బిజీగా ఉంటే వీరిద్దరూ షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తారని నియోజకవర్గ ప్రజలు కోడై కూస్తున్నారు. నియోజకవర్గంలో జరిగే పనుల్లోను, ఉద్యోగుల బదిలీల్లోనూ పర్సంటేజీలు వసూలు చేయడం వీరి విధిగా చెబుతుంటారు. వివిధ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకాల్లో రూ.లక్షల్లో వసూలు చేయడంపై పెద్ద దుమారమే రేగింది. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల రేషన్ డీలర్‌షిప్‌లను తప్పుడు ఫిర్యాదులతో రద్దు చేయించి, టీడీపీ వారికి అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. ఇంకా ప్రభుత్వ భూములకు పట్టాలు చేయించుకోవడంలోనూ వీరిది అందెవేసిన చేయిగా చెబుతారు. ‘విష్ణుమూర్తి’ మాయ..! వీరిద్దరు చాలదన్నట్టు..మంత్రి మేనల్లుడు విష్ణుమూర్తి కూడా తోడయ్యారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో చేపట్టిన నీరు–చెట్టు పథకం పనుల్లో చాలావరకు బినామీ పేర్లతో ఆయనే చేశారు. ఒక్కో చెరువు పనులకు రూ.15–30 లక్షల వరకు మంజూరవుతాయి. తూతూమంత్రంగా పనులు చేసి పూర్తయినట్టు చూపించి బిల్లులు చేయించుకుంటారు. ఈ విషయం సంబంధిత అధికారులకు తెలిసినా బిల్లులు నిలుపుదల చేసే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇలా మంత్రి కళా వెంకట్రావు నియోజవర్గ ప్రజలకు దూరంగా ఉంటే.. ఆయన పీఏలు, మేనల్లుడు అవినీతికి దగ్గరగా ఉంటున్నారు. వీటన్నిటినీ ఐదేళ్లూ ఎంతో సహనంతో భరిస్తూ వచ్చిన ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో కళాకు ఓటుతో బుద్ధి చెప్పాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలై ఈ సారి బరిలో ఉన్న వైఎస్సార్సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌ను గెలిపించాలన్న తపన ఆ నియోజకవర్గ ప్రజల్లో కనిపిస్తోంది. -
ఎచ్చెర్ల బహిరంగ సభలో వైఎస్ విజయమ్మ
-
శ్రీకాకుళానికి చంద్రబాబు చేసిందేమీ లేదు: విజయమ్మ
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాకు చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు. దివంగత మహానేత వైఎస్సార్ ఈ జిల్లాకు చేసిన అభివృద్ధి చూసిన ప్రజలు 2009లో తొమ్మిది సీట్లలో గెలిపించారని గుర్తుచేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయిందని మండిపడ్డారు. జిల్లాలోని 34 ప్రభుత్వ పాఠశాలలను, 5 ఎస్సీ హాస్టల్స్‌ను చంద్రబాబు మూసివేశారని తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే జిల్లాను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. జిల్లాలోని ప్రతి చిన్న ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. మత్య్సకారులను వైఎస్ జగన్ అన్ని రకాలుగా ఆదుకుంటారని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిలా ఎచ్చెర్ల నియోజవర్గం జి సిగడాంలో జరిగిన బహిరంగ సభలో విజయమ్మ ప్రసంగించారు. ఎండను సైతం లెక్కచేయకుండా అక్కడకు వచ్చిన వారికి విజయమ్మ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలతో వైఎస్ కుటుంబానికి 40 ఏళ్ల అనుంబంధం.. ఇంకా విజయమ్మ మాట్లాడుతూ.. ‘ఈ సారి జరగుతున్న ఎన్నికలు న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్నవి. విలువలు, విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టాలి. మీ అందరికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితో ఉన్న అనుబంధం కారణంగానే నేను ఇక్కడికి వచ్చాను. 30 ఏళ్ల పాటు రాజశేఖరరెడ్డి గారిని మీ భుజాలపై మోశారు. ప్రజలతో రాజశేఖరరెడ్డి గారి కటుంబానికి 40 ఏళ్ల అనుబంధం ఉంది. రాజశేఖరరెడ్డి గారి పాలన ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు. రాజశేఖరరెడ్డి గారి పాలనలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. వైఎస్సార్, షర్మిల, జగన్ పాదయాత్రలు ఇదే జిల్లాలో ముగిశాయి. వైఎస్సార్‌ను ఎంతగానో ప్రేమించే మీకు వచ్చిన కష్టం చూస్తే బాధ కలుగుతుంది. రాజశేఖరరెడ్డి గారి మరణం తరువాత వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేపడితే మీరు అక్కున చేర్చుకున్నారు. అది నచ్చని టీడీపీ, కాంగ్రెస్‌లు కుట్రల చేసి వైఎస్ జగన్‌ను ఇబ్బందులకు గురిచేశారు. వైఎస్ జగన్ ఏదైనా అనుకుంటే సాధించి తీరుతారు. ఓదార్పు యాత్రతో నా బిడ్డను ప్రజల చేతుల్లో పెట్టాను. రాజశేఖరరెడ్డిగారు ఇచ్చిన కుటుంబం కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్ పోరాడుతూనే ఉన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం, ఏపీకి ప్రత్యేక హోదా కోసం జగన్ ఢిలీ వేదికగా ధర్నాలు, దీక్షలు చేశారు. మా నాన్న నన్ను ఒంటరి చేసి పోలేదని జగన్ గర్వంగా చెప్తారు. మేము ఏదైనా జవాబు చెప్పాలంటే అది ప్రజలకు మాత్రమే. ఈ రోజు ఎవరెన్ని ప్రశ్నలు వేసినా మీకు మాకు అనుబంధాన్ని ఎవరు వేరు చేయలేరు. మీ ఆశీర్వాదం, ప్రార్థనలు జగన్‌ను గండం నుంచి తప్పించాయి. మా కుటుంబం మీకు ఎప్పుడు రుణపడి ఉంటుంది. రాజశేఖర్రెడ్డిలాగానే జగన్ కూడా మీకు అన్ని పనులు చేస్తారు. రాజన్న భార్యగా మీకు నేను మాటిస్తున్నాను. రాష్ట్రం ముక్కలై.. ఏమి లేకుండా మిగిలిపోయాం. అలాంటింది చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు ప్రభుత్వ సందను అమ్ముకుని తింటున్నారు. రాజధాని భూములు, విశాఖలో భూములు, దళితుల భూములు దోచుకుంటున్నారు. ప్రజలను మేల్కొమని కోరుతున్నా. జిల్లాకు చంద్రబాబు చేసిందేమి లేదు.. ఈ జిల్లాకు వంశధార ప్రాజెక్టు, తోటపల్లి రిజర్వాయర్, రిమ్స్ హాస్పిటల్, అంబేడ్కర్ యూనివర్సిటీలను వైఎస్సార్ తీసుకువచ్చారు. వంశధారకు 900 కోట్లు మంజూరు చేసిన వైఎస్సార్ 70 శాతం పనులు పూర్తి చేశారు. 2.74లక్షల ఇళ్లు ఈ ఒక్క జిల్లాలోనే కట్టించారు. ఈ ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఏం చేశారు?. ప్రాజెక్టులు ఒక్క అంగుళం కదలేదు. అంబేడ్కర్ యూనివర్సిటీని నాశనం చేశారు. 34 ప్రభుత్వ పాఠశాలలను, 5 ఎస్సీ హాస్టల్స్‌ను మూసివేశారు. ఇలా అయితే పేద పిల్లలు ఏ విధంగా చదువుకుంటారు?. కొత్త పరిశ్రమలు తీసుకురావాల్సిన ప్రభుత్వం.. ఉన్న పరిశ్రమలను మూసివేస్తుంది. స్థానికులకు పరిశ్రమల్లో ఉపాధి కలిపించడం లేదు. శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటీ కట్టలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. చేనేత పరిశ్రమకు రావాల్సిన బకాయిలు చెల్లించలేదు. చంద్రబాబు పాలనలో జిల్లాలోని మత్స్యకారులకు ఉపాధి లేదు. వలస పోయిన 22 మంది మత్య్సకారులను పాకిస్తాన్ వారు అరెస్ట్ చేస్తే ఐదు నెలలు గడిచిన వారిని విడిపించలేని ముఖ్యమంత్రి మనకు ఎందుకు?. ప్రభుత్వ పథకాలన్ని టీడీపీ వారికే ఇస్తున్నారు. పరిశ్రమల కాలుష్యం పెరిగిపోగవడంతో మత్య్సకారులు ఉపాధి దెబ్బతింటుంది. మత్య్సకారులను ఎస్టీల్లో చేర్చలేదు. ఇక్కడ ఉన్న టీడీపీ మంత్రి ఏమైనా అభివృద్ధి చేశారా?. నారాయణపురం ఆనకట్ట, ప్రభుత్వ కాలేజ్, ఈఎస్ఐ 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని హామీలు ఇచ్చారు. అందులో ఏ ఒక్కటైనా చేపట్టారా?. నీరు చెట్టు పథకం కింద దోపిడికి పాల్పడ్డారు. పరిశ్రమల పేరిట చంద్రబాబు కుమారుడు లోకేశ్‌కు కోట్ల రూపాయలు ముట్టజెప్పారు. ప్రభుత్వ భూములు తమవిగా చూపించి కళా వెంకట్రావు 30 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి కొనుగోలు చేశారు. మత్య్సకారులను అన్నివిధాలా ఆదుకుంటాం.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ప్రతి చిన్న ప్రాజెక్టును కూడా పూర్తి చేసుకుందాం. వ్యవసాయాన్ని పండుగగా చేసుకుందాం. మత్య్సకారులకు జెట్టిలు ఇస్తాం. జగన్ చెప్పినట్టు వేటకు వెళ్లలేని సమయంలో మత్స్యకారులకు పది వేల రూపాయలు అందజేస్తారు. చనిపోయిన మత్య్సకారుడి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను ఆదుకోవడం కోసం 4వేల కోట్ల రూపాయలు కేటాయిస్తారు. వలసలకు పోయిన వారు సైతం తిరిగి వచ్చేలా ఇక్కడ పాలన చేసకుందాం. నవరత్నాలతో వైఎస్ జగన్ అందరి జీవితాల్లో వెలుగులు నింపుతారు. ఆనాడు వైఎస్సార్ చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకున్నారు. వ్యవసాయానికి ఖర్చు దండుగా అన్న చంద్రబాబును చూశాం. చనిపోయిన రైతుల కుటంబాలకు పరిహారం ఇస్తే మరణాలు పెరుగుతాయని ఆనాడు చంద్రబాబు ఎగతాళి చేశారు. కేంద్రం కట్టాల్సిన పోలవరం జాతీయ ప్రాజెక్టును.. తన బినామీలకు లాభం చేకూర్చేందుకు చంద్రబాబు తీసుకున్నారు. పోలవరం పేరుతో రోజుకో డ్రామా ఆడుతారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఉద్యోగాలకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ జగన్ అధికారంలోకి రావాలి. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తారు. గిరిజనులు భూములకు పట్టాలు ఇస్తారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తారు. అంతేకాకుండా గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తారు. పెట్టుబడి సాయంగా రూ. 12, 500 అందిస్తారు. విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తారు. అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడంతో పాటుగా ఎన్నికల నాటికి ఉన్న బకాయిలను నాలుగు దఫాలుగా మాఫీ చేస్తారు. గ్రామా సచివాలయాల ద్వారా ఏ పని కావాలన్నా 72 గంటల్లోనే అయిపోతుంది. సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా డోర్‌డెలివరీ చేస్తాం. రైతు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి 7లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిరణ్‌కుమార్, ఎంపీ అభ్యర్థి బెల్లాని చంద్రశేఖర్‌ను అత్యధిక మోజారిటీతో గెలిపించండి. జిల్లాలో పదికి పది సీట్లలో వైఎస్సార్సీపీని గెలిపించాల’ని కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రావాలి జగన్... కావాలి కిరణ్
సాక్షి, రణస్థలం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా గొర్లె కిరణ్‌కుమార్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.గణపతిరావుకు ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. కిరణ్‌కుమార్ సతీమణి గొర్లె పరిమళ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం 10.10 గంటలకు నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. షనంతరం ఆయన సతీమణి గొర్లె పరిమళ నుదుట విజయ తిలకం దిద్దారు. పార్టీ కార్యాలయం నుంచి బయటకు రాగానే భారీ ఎత్తున మహిళలు నిండు నీళ్ల బిందులతో ఎదురువచ్చి హారతులిచ్చారు. అనంతరం జాతీయ సర్వీ సు రహదారిపై ఊరేగింపుగా తహసీల్దార్ కార్యాలయానికి చే రుకున్నారు. తీన్మార్ డ్యాన్సులతో యువత నృత్యాలు చేస్తూ ‘రావాలి జగన్.. కావాలి కిరణ్’ అని కేకలు వేస్తూ జాతీయ రహదారిని హోరెత్తించారు. మూడు కిలోమేటర్ల మేర వైఎస్సార్సీపీ జెండాల రెపరెపలతో కోలాహలం నెలకొంది. ప్రచార రథంపై తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోవడానికి సుమా రు గంటన్నరకుపైగా సమయం పట్టింది. రోజంతా ఎచ్చెర్ల నియోజకవర్గంలో కిరణ్ నామినేషన్ సందడి గురించే చర్చించుకున్నారు. టీడీపీ హయాం.. అవినీతి, అక్రమాల మయం నామినేషన్ వేసిన అనంతరం ప్రచార రథంపై నుంచి పార్టీ శ్రేణులనుద్దేశించి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ అవినీతి, అక్రమాలలో టీడీపీ పూర్తిగా మునిగిపోయిందని.. జగనన్న వస్తేనే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందని తెలిపారు. కల్లబొల్లి మాటలతో చివరి రెండు నెలల ప్రభుత్వ నాటకాన్ని చూసి మోసపోతే కష్టాల పాలు కావలసివస్తుందన్నారు. స్థానిక పరిశ్రమలలో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాజన్నా రాజ్యం కావాలంటే ఫ్యాను గుర్తుకు ఓటు వేసి జగనన్నను గెలిపించాలని కోరారు. విజయనగరం పార్లమెంటు అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ పాలనంతా అరచేతిలో స్వర్గం చూపించినట్లు ఉందని, రైతు పరిపాలన, ప్రజా పరిపాలన రావాలంటే రాజన్నా రాజ్యం రావాలని.. అది జగనన్నతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జె డ్పీటీసీ గొర్లె రాజగోపాల్, వైఎస్సార్సీపీ నాయకులు నాయిని సూర్యనారాయణరెడ్డి, మొదలవలస చిరంజీవి, టోంపల సీతారాం, బల్లాడ జనార్దన్‌రెడ్డి, గొర్లె అప్పలనాయుడు, సనపల నారాయణరావు, దన్నాన రాజీనాయుడు, మీసాల వెంకటరమణ, పైడి శ్రీనివాసరావు, నాలుగు మండలాల పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. -
మహాయజ్ఞానికి సర్వం సిద్ధం
ఎచ్చెర్ల క్యాంపస్ : ఎచ్చెర్ల మండలం కొంచాల కూర్మయ్యపేట సమీపంలోని శ్రీచక్రపురం పీఠంలో శుక్రవారం నుంచి ఈ నెల 23 వరకు 1001 మేరువుల కోటి శివలింగాల సంస్థాన మహాయజ్ఞం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం ఏడు గంటల నుంచి మహాయాగ పూజలు ప్రారంభం కానున్నాయి. శ్రీచక్రపురం పీఠాధిపతి తేజోమూర్తుల బాలభాస్కరశర్మ, కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మహాయజ్ఞం అనంతరం కోటి శివలింగాల మహాక్షేత్రం నిర్మాణం చేపట్టనున్నారు. రోజుకు ఆరువేల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు, అన్న సంతర్పణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే స్పటిక లింగాన్ని ఊరేగించి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. జిల్లా స్థాయిలో భారీగా నిర్వహిస్తున్న పూజా కార్యక్రమం కావడంతో నిర్వాహకులు ప్రత్యేక దృష్టి సారించారు. శుక్రవారం ఉదయం ఏడు గంటలకు కోటి రుద్రాక్షలతో రుద్రాభిషేకం, కోటి కుంకుమార్చన కార్యక్రమాలతో పూజ ప్రారంభం కానుంది. టస్ట్రు కమిటీ సభ్యులు హనుమంతు కృష్ణారావు, కోరాడ రమేష్, టి.నాగేశ్వరరావు, దుప్పల వెంటకరావు, పప్పల రాధాకృష్ణ, రమేష్, పైడి చంద్, అంధవరపు వరహా నర్సింహం, పొన్నాల జయరాం, గీతా శ్రీకాంత్ గురువారం యాగస్థలాన్ని పరిశీలించారు. ఏర్పాట్లు పూర్తి చేశాం.. మహాయజ్ఞానికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశాం. రోజుకు ఆరు వేల మంది భక్తులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నాం. రుద్రాక్ష యాగం, స్పటిక లింగానికి నిరంతరం క్షీరాభిషేకం చేయడంతతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. రోజుకు 300 దంపతులు పూజల్లో పాల్గొంటారు. సంప్రదాయ దుస్తులు ధరించి భక్తులు హాజరుకావాలి. – తేజోమూర్తుల బాలభాస్కరశర్మ,శ్రీచక్రపురం పీఠాధిపతి -
ఎం‘సెట్’ అయ్యింది..!
ఎచ్చెర్ల క్యాంపస్: ఎన్నో అంతరాయాలు..వివాదాల నడుమ ఎట్టకేలకు ఎంసెట్-2014 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు మార్గం సుగమమైంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎట్టకేలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పందించాయి. వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పాలిటెక్నిక్ పురుషుల కళాశాలలో కౌన్సెలింగ్ హెల్ప్‌లైన్ సెంటర్(సహాయ కేంద్రాన్ని) ప్రకటించారు. గురువారం నుంచి ధ్రువీకరణ పత్రాలను పరిశీలన ప్రారంభం కానుంది. తొలి రోజున 1 నుంచి 5 వేల ర్యాంకు వరకు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరగనుంది. విద్యార్థులకు ఊరట ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి గతంలో ప్రకటించిన షెడ్యూల్ మేరకే కౌన్సెలింగ్ జరుగుతుందని ప్రకటించడంతో..విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం యూనిట్‌గానే ప్రవేశాలు ఉంటాయని ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఈనెల 23 నాటికి పూర్తి చేసి, సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించే చర్యలపై ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. అంతా సజావుగా సాగితే..ఒకటి నుంచి తరగతులు సైతం ప్రారంభం కానున్నాయి. ఇక్కడ మరో సమస్య కూడా తోడవుతోంది. పాలీసెట్, ఈసెట్-2014 ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయి..నెలలు గడుస్తున్నా..ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్థానికతపై స్పష్టత లేకపోవడంతో..అలాట్ మెంట్లు ప్రకటించలేదు. ఈ కోర్సుకు సంబంధించి.. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారం భం కావాల్సి ఉన్నా..ఇంకా పరిష్కారం కావడం లేదు.