సాక్షి, శ్రీకాకుళం: స్థానికుడు కాకపోయినా అభివృద్ధి చేస్తారని ఆశించారు. అందరికీ అందుబాటులో ఉంటారని ఓట్లేసి గెలిపించారు. గెలిచాక ప్రజలకు అందనంత దూరంగా ఉన్నారు. పేదలు, సామాన్యులను చెంతకు చేరనీయరు. వారి సమస్యలు వినడానికే చిరాకు పడిపోతుంటారు. తనకు బదులు ఇద్దరు పీఏల (ఒకరు పీఏ, మరొకరు ఓఎస్‌డీ)ను నియమించుకున్నారు. వారిద్దరూ షాడో ఎమ్మెల్యేలుగా చలామణి అయ్యారు. ఈ ఐదేళ్లూ నియోజకవర్గంలో వారిద్దరే చక్రం తిప్పారు. ఇప్పుడు మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ మంత్రి కళా వెంకట్రావు ఎచ్చెర్ల ఎన్నికల బరిలోకి దిగారు. గత ఐదేళ్ల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని నియోజక వర్గ ప్రజలు ‘నీ సేవలు చాలు..’ అంటూ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..!
కళా వెంకటరావు ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన వారు కాదు. ఆయన సొంత నియోజకవర్గం రాజాం పునర్విభజనలో ఎస్సీలకు రిజర్వ్ కావడంతో 2014 ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో వచ్చి వాలారు. అప్పటి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌పై 4,741 ఓట్ల స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. స్థానికేతరుడైనా కళా వెంకటరావును నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత అక్కడి ప్రజలకు ఆయన ఎమ్మెల్యేగా కాకుండా అప్పుడప్పుడూ వచ్చే అతిథి అయ్యారు. నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవడం మానేశారు. అక్కడి వారు తమ సమస్యను చెప్పుకోవాలంటే 80 కిలోమీటర్ల దూరంలోని రాజాంలో ఏర్పాటు చేసిన క్యాంప్ ఆఫీసుకు వెళ్లాలి.
వయసు మీరిన వారికి అంత దూరం వెళ్లడం ఎంతో కష్టమయ్యేది. ఇక తప్పనిసరి అయిన వారు వెళ్లినా ఎమ్మెల్యే దర్శన భాగ్యం గగనమయ్యేది. వచ్చిన వారిలో పేరున్న వారో, స్థితిమంతులో అయితేనే కలిసేందుకు అనుమతిస్తారన్న పేరు మూటగట్టుకున్నారు. దీంతో ఈ నాలుగేళ్లలో ఆ స్థాయి ఉన్న వారే రాజాం వెళ్లేవారు. అప్పుడప్పుడు ఎమ్మెల్యే ఎచ్చెర్లకు వచ్చినప్పుడూ సామాన్యుల గోడు వినే పరిస్థితి లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అంతేకాదు ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఏ కష్టమొచ్చినా కళా వెంకటరావు పరామర్శకు కూడా రారని, ధనికుల ఇంట్లో పెళ్లి, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు మాత్రమే హాజరవుతారన్న పేరుంది.
పర్సంటేజీలు, కమీషన్లు..
మరోపక్క ఆయన ఒక పీఏ (వెంకటనాయుడు)ను, మరో ఓఎస్డీ (కిమిడి కృష్ణంనాయుడు)ను ఏరికోరి నియమించుకున్నారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన పథకం (సెర్ప్)లో కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన కృష్ణంనాయుడుకు ఓఎస్డీ నియామకమే నిబంధనలకు విరుద్ధమంటూ అభ్యంతరాలు వ్యక్తమైనా పట్టించుకోలేదు. మంత్రి తన పనుల్లో బిజీగా ఉంటే వీరిద్దరూ షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తారని నియోజకవర్గ ప్రజలు కోడై కూస్తున్నారు. నియోజకవర్గంలో జరిగే పనుల్లోను, ఉద్యోగుల బదిలీల్లోనూ పర్సంటేజీలు వసూలు చేయడం వీరి విధిగా చెబుతుంటారు. వివిధ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకాల్లో రూ.లక్షల్లో వసూలు చేయడంపై పెద్ద దుమారమే రేగింది. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల రేషన్ డీలర్‌షిప్‌లను తప్పుడు ఫిర్యాదులతో రద్దు చేయించి, టీడీపీ వారికి అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. ఇంకా ప్రభుత్వ భూములకు పట్టాలు చేయించుకోవడంలోనూ వీరిది అందెవేసిన చేయిగా చెబుతారు.
‘విష్ణుమూర్తి’ మాయ..!
వీరిద్దరు చాలదన్నట్టు..మంత్రి మేనల్లుడు విష్ణుమూర్తి కూడా తోడయ్యారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో చేపట్టిన నీరు–చెట్టు పథకం పనుల్లో చాలావరకు బినామీ పేర్లతో ఆయనే చేశారు. ఒక్కో చెరువు పనులకు రూ.15–30 లక్షల వరకు మంజూరవుతాయి. తూతూమంత్రంగా పనులు చేసి పూర్తయినట్టు చూపించి బిల్లులు చేయించుకుంటారు. ఈ విషయం సంబంధిత అధికారులకు తెలిసినా బిల్లులు నిలుపుదల చేసే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇలా మంత్రి కళా వెంకట్రావు నియోజవర్గ ప్రజలకు దూరంగా ఉంటే.. ఆయన పీఏలు, మేనల్లుడు అవినీతికి దగ్గరగా ఉంటున్నారు. వీటన్నిటినీ ఐదేళ్లూ ఎంతో సహనంతో భరిస్తూ వచ్చిన ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో కళాకు ఓటుతో బుద్ధి చెప్పాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలై ఈ సారి బరిలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌ను గెలిపించాలన్న తపన ఆ నియోజకవర్గ ప్రజల్లో కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment