కిరణ్ కింకర్తవ్యం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన దరిమిలా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం చేయనున్నారు? బిల్లు భవితవ్యం సోమ, మంగళవారాల్లో తేలిపోయేలా కన్పిస్తుండటంతో వారంతా భావి కార్యాచరణపై దృష్టి సారించారు. రెండు రోజులుగా తనను కలుస్తున్న వారికి కిరణ్ ఇదే మాట చెబుతున్నారు. ‘ఇంకా పదవిలో ఉండాలని నాకు లేదు. రాజీనామా చేయాలనే ఉంది. కానీ అందరం కలిసే నిర్ణయం తీసుకుందాం. సమష్టిగా ముందుకు వెళ్దాం’ అంటున్నారు. గురువారం ఉదయం నుంచి రాత్రి చాలా పొద్దుపోయే దాకా పలువురు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కిరణ్ దఫదఫాలుగా మంతనాలు జరిపారు. కిరణ్ రాజీనామాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘‘లోక్‌సభలో బిల్లు పెట్టిందీ లేనిదీ సందిగ్ధంగానే ఉన్నందున అది తేలాక రాజీనామా అంశం చూడొచ్చు. ఆలోగా బిల్లును మళ్లీ పార్లమెంటులో ప్రవేశపెడతారా, చర్చను ఎప్పుడు చేపడతారు వంటివాటిని బట్టి రాజీనామాలపై ముందుకెళ్దాం’’ అని నిర్ణయించారు.
కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుతో పాటు బహిష్కృత కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, సాయిప్రతాప్, సబ్బం హరి, హర్షకుమార్, ఉండవల్లి అరుణ్‌కుమార్, రాయపాటి సాంబశివరావు విడతలవారీగా కిరణ్‌తో భేటీ అయ్యారు. మంత్రులు పితాని సత్యనారాయణ, సాకే శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేశ్, కాసు కృష్ణారెడ్డి, బాలరాజు, శత్రుచర్ల విజయరామరాజు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వీటిలో పాల్గొన్నారు. లోక్‌సభ ఉదంతం చర్చకు వచ్చింది. రాజీనామా ప్రస్తావన రాగా, తానందుకు ఎప్పుడో సిద్ధంగా ఉన్నానని, అంతా ఒకేసారి చేయాల్సిన అవసరముంది గనుక ఆలోచిస్తున్నానని కిరణ్ అన్నారు. లోక్‌సభలో బిల్లు పెట్టాక కూడా మనం తీవ్రంగా స్పందించకపోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న వాదనతో ఏకీభవించారు. ఎంపీలు, కేంద్రమంత్రులతో చర్చించి త్వరలో తుది నిర్ణయం తీసుకుందామన్నారు.
వారంతా ఢిల్లీ నుంచి రాగానే ఆదివారం ప్రత్యేక సమావేశం పెట్టి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. బహిష్కృత ఎంపీలు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నా దాంతో లాభం లేకపోవచ్చని, కేంద్ర మంత్రులు కూడా ముందుకొస్తేనే ఫలితముంటుందని అభిప్రాయపడ్డారు. అందుకు వారెంతవరకు ముందుకొస్తారో తేలితే ఆ మరునాడో, బిల్లు పెట్టిన రోజో అంతా ఒకేసారి రాజీనామాలు చేసేలా వ్యూహం నిర ్ణయించవచ్చన్నారు. ఇక్కడ గవర్నర్‌కు సీఎం రాజీనామా లేఖ ఇచ్చేలా, అక్కడ పార్లమెంటులో కేంద్రమంత్రులు రాజీనామాలు ప్రకటించేలా చేస్తే దాని ప్రభావం కేంద్రంపై పడే అవకాశముంటుందన్న సూచన వచ్చింది. అందరితో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని కిరణ్ అన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం అనుమానంగా ఉన్నందున భేటీలు ముగిసే 21వ తేదీ దాకా ఆగితే మేలని కొందరు మంత్రులన్నారు. కొత్త పార్టీ పెట్టాలా, వద్దా అన్నదీ చర్చకు వచ్చింది. అది ఏ మేరకు సక్సెస్ అవుతుంది, జనం నమ్ముతారా, అసలు కొత్త పార్టీకి అవకాశాలు ఉన్నాయా అంటూ చర్చించారు. కానీ, మనం డ్రామాలాడుతున్నామన్న అభిప్రాయం ఒక్కసారి జనాల్లోకి వెళ్లాక రాజీనామాలు చేసినా లాభముండదని ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే ఒకరు వాదించారు. కొత్త పార్టీపై జనాభిప్రాయం ఎలా ఉందో నియోజకవర్గాల్లో అక్కడి తిరిగి తనకు చెప్పాలని ఎమ్మెల్యేలకు కిరణ్ సూచించారు. మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి ముందుకెళ్దామన్నారు.
కిరణ్‌పై ఎమ్మెల్యేల్లో అసంతృప్తి: అయితే, రాజీనామాకు వేర్వేరు అంశాలను కిరణ్ ముడిపెడుతుండడంతో ఎమ్మెల్యేలు ఒకింత అసంతృప్తికి లోనయ్యారు. కొత్తపార్టీ పెట్టినా, పెట్టకపోయినా పర్లేదు గానీ రాజీనామా చేయకపోతే మాత్రం రాష్ట్ర విభజనను మనమే తెర వెనకుండి నడిపించామన్న అపకీర్తి తప్పదని వారిలో కొందరు కిరణ్‌కు నిష్కర్షగా చెప్పారు. మరికొందరు ఆవేశంగా మాట్లాడారు. అయితే వారంతా ఇతర పార్టీల్లో కర్చీఫ్‌లు వేసుకున్న వారేనని అనంతరం కిరణ్, మంత్రులు అభిప్రాయపడ్డారు.
కొందరికే పిలుపు: తన సమావేశాలకు కేవలం కోటరీ నేతలే వచ్చేలా కిరణ్ జాగ్రత్తపడుతున్నారు. కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ భేటీలకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీనియర్ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ దూరంగా ఉంటున్నారు. వారికి కనీసం సీఎం నుంచి పిలుపు కూడా ఉండటం లేదు. శుక్రవారం భేటీ గురించి తమకు తెలియదని తెలిపారు. మంత్రులను, ఎమ్మెల్యేలను పిలిచే బాధ్యతను శైలజానాథ్‌కు అప్పగించారని, ఆయన కేవలం సీఎం వర్గీయులనే పిలుస్తున్నారని మండలిలో సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు.
సోనియాతో మంతనాలు: కిరణ్ సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులతో ఒకవైపు చర్చిస్తూనే మరోవైపు ఢిల్లీ పెద్దలతోనూ మంతనాలు జరుపుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభలో బిల్లు పెట్టాక ఇక్కడ నెలకొన్న పరిణామాలు, రాజకీయ వాతావరణం గురించి ఢిల్లీ పెద్దలకు ఆయన వివరిస్తున్నట్టు తెలుస్తోంది. బిల్లు పెట్టాక కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో పాటు పలువురు ఢిల్లీ పెద్దలు కిరణ్‌తో మాట్లాడినట్టు చెబుతున్నారు. వారి సూచన మేరకు సోనియాగాంధీతో కూడా కిరణ్ చర్చించారని ఆయనకు సన్నిహితుడైన తెలంగాణ ఎమ్మెల్యే ఒకరు తెలిపారు.
బిల్లు ఆమోదం సాఫీగా జరిగేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది గనుక రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందీ తలెత్తకుండా చూడాలని కిరణ్‌ను పెద్దలు ఆదేశించినట్టు తెలుస్తోంది. ‘‘బిల్లు ఆమోదం పొందేదాకా రాజీనామాలు తదితరాల జోలికి పోకండి. లేదంటే పార్లమెంటులో విపక్షాలు పార్టీపై విరుచుకుపడతాయి’’ అంటూ కర్తవ్య బోధ చేసినట్టు సమాచారం. లోక్‌సభలో బిల్లు పెట్టాక కిరణ్ మీడియాతో మాట్లాడిన మాటల్లో ఢిల్లీ పెద్దల ఆదేశాల ప్రభావం అడుగడుగునా ధ్వనించిందని పీసీసీ నేతలే అంటున్నారు. గతంలో సీడబ్ల్యూసీ నిర్ణయం తరవాత మీడియాను పిలిచి మరీ ఆవేశంగా మాట్లాడి, కేంద్రంపై ‘తీవ్రంగా విరుచుకుపడ్డ’ కిరణ్... దానికన్నా అతి కీలకమైన లోక్‌సభ అంకం తర్వాత కేవలం మీడియాతో ఇష్టాగోష్ఠికి పరిమితమయ్యారు. పైగా ప్రతి అంశాన్నీ నవ్వులు, చలోక్తులతో తేలిగ్గా తీసుకున్నారు. రాజీనామా ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ దాటవే యడం, అందరి రాజీనామాలతో ముడిపెట్టడం కూడా అధిష్టానం సూచనల మేరకేనని సీమాంధ్ర నేతలు భావిస్తున్నారు.
సభను 10-జన్‌పథ్‌గా మార్చిన స్పీకర్: ఎంపీలు
లోక్‌సభను సోనియా నివాసమైన 10, జన్‌పథ్‌గా స్పీకర్ మీరాకుమార్ మార్చారని.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని లగడపాటి, సబ్బం విమర్శించారు. తమపై జరిగిన దాడితో జాతీయ స్థాయిలో తమకు మరింత మద్దతు పెరిగిందన్నారు. సభలో తాము లేకుండా బిల్లుపై చర్చ జరగొద్దని విపక్షాలే అంటాయని, తమ అభిప్రాయాలనూ రికార్డు చేయాలని అడుగుతామని తెలిపారు. తమ సమైక్య రథసారథి కిరణేనని, ఆయన రాజీనామా చేయకుండా యుద్ధభూమిలో కొనసాగుతారని లగడపాటి అన్నారు.
జాతీయస్థాయిలో
నిరసన గళం
17, 18ల్లో ఢిల్లీలో మోహరింపు
సీమాంధ్ర ఎంపీలపై ఇతర రాష్ట్రాల ఎంపీలతో దాడులు చేయించారంటూ విషయాన్ని జాతీయ స్థాయిలో అందరి దృష్టికీ తీసుకెళ్లాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. విభజన బిల్లును అడ్డుకోవడానికి ఫిబ్రవరి 17 నుంచి సీమాంధ్ర నేతలు, ఎంపీలు ఢిల్లీ వెళ్లనున్నారు. కిరణ్ కూడా ఆ తేదీల్లో ఢిల్లీలోనే ఉండి ఏపీ ఎన్జీఓల నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించారు. 21వ తేదీ దాకా పార్లమెంటు సమావేశాలున్నందున అప్పటిదాకా తెలంగాణ బిల్లును ఆపేలా అన్ని ప్రయత్నాలు చేయాలని, అన్ని పార్టీల జాతీయ నేతలతోనూ మంతనాలు జరపాలని నిర్ణయించారు. సస్పెండైన 14 మంది సీమాంధ్ర ఎంపీలు ఎలాగైనా మళ్లీ లోక్‌సభలో అడుగు పెట్టేలా చూడాలన్న భావన వ్యక్తమైంది.