విభజనకు ‘కీ’రణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి నుంచి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 గురువారం అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి చేరడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాత్ర చాలా కీలకంగా మారింది. గురువారం ప్రారంభమైన శాసనసభ సమావేశాలు ఈ నెల 20తో ముగుస్తుండగా, ఈ సమావేశాల్లోనే అభిప్రాయం కోసం బిల్లును శాసనసభ ముందు ఉంచుతారా? లేక ప్రస్తుతానికి అలాంటిదేమీ జరక్కుండా మరోసారి సమావేశాలు పెడదామని చెబుతారా? అన్నది ఇప్పుడు ఆయన చేతిలో ఉంది. శాసనసభ నాయకుడిగా ఆయన అభిప్రాయం తీసుకున్న తర్వాతే స్పీకర్ బిల్లు అంశంపై బీఏసీ సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బిల్లుకు సంబంధించిన ఫైలును ఇప్పటికే సీఎంకు పంపించారు.
ఇప్పుడు సీఎం దాన్ని గవర్నర్‌కు పంపాలి. గవర్నర్ నుంచి తిరిగి మళ్లీ ముఖ్యమంత్రికే చేరుతుందని, ఆ ఫైలు సీఎం నుంచి స్పీకర్‌కు చేరిన తర్వాతే దానిపై సభాపతిగా స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆ ఫైలును కిరణ్ వెనువెంటనే స్పీకర్ కార్యాలయానికి పంపిస్తారా? లేక కొంత గడువు తీసుకుంటారా? అన్న అంశంపై పార్టీలో చర్చసాగుతోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పైకి మాట్లాడుతున్నప్పటికీ అంతర్గతంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఎప్పటికప్పుడు హైకమాండ్‌కు సహకరిస్తున్నారని సొంత పార్టీ నేతల నుంచి విమర్శలున్నాయి.
తెలంగాణ ఏర్పాటుకు జూలై 30న కాంగ్రెస్ వ ర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీర్మానం చేసింది మొదలు విభజన అంశం అనేక దశలు దాటుకుంటూ ఇప్పుడు అసెంబ్లీ అభిప్రాయం వరకు వచ్చింది. జూలై 30న సీడబ్ల్యూసీ తీర్మానం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు గడిచిన నాలుగు మాసాలకు పైగా కేంద్రం విభజన బిల్లుపై కసరత్తు చేస్తుండగా, ప్రతి దశలోనూ కిరణ్ ఆపుతాం... అడ్డుకుంటాం... అని చెబుతూ వచ్చారే తప్ప ఆచరణలో ఏఒక్కటీ చేసి చూపించలేదు. అసెంబ్లీలో తీర్మానం చేయకుండా కేంద్రం ముందుకుపోదని, 371 (డీ)ని సవరించకుండా నిర్ణయం తీసుకోలేరని, అసెంబ్లీలో బిల్లును అడ్డుకుంటామని.. ఇలా ఒక్కో దశలో ఒక్కో కారణాన్ని చూపిస్తూ 4 నెలలు గడిపారు. ఈ దశల్లో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా రాజీనామాలు చేయకుండా చూశారు.
రాజీనామా చేసుంటే.. ఇంతదాకా వచ్చేదికాదు..
సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన రోజునే సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేసి ఉంటే ప్రక్రియ ఎప్పుడో ఆగిపోయేదనీ, కనీసం సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన వెనువెంటనే అసెంబ్లీని సమావేశపరిచి సమైక్యం కోసం తీర్మానం చేసినా దేశవ్యాప్తంగా యావత్తు ఈరోజు చర్చ జరిగేదని, కాంగ్రెస్ అధిష్టానం సైతం విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకుండా ఆగేదని అందరూ అంగీకరిస్తున్న విషయమే. పైగా అసెంబ్లీ ప్రొరోగ్ కాకుండా ఉన్న నేపథ్యంలో ఎప్పుడైనా సమావేశాలు పెట్టడానికి ముఖ్యమంత్రికి మంచి అవకాశం ఉన్నా జారవిడిచారు.
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల తేదీలను నిర్ణయించే విషయంలోనూ కిరణ్ హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగానే పనిచేశారని అంటున్నారు. శాసనసభ గత సమావేశాలు జూలై 20తో ముగియగా రాజ్యాంగం నిర్దేశించిన మేరకు ఆరు నెలల్లోగా తిరిగి సమావేశాలు జరపాలి. ఆ నిబంధన ఉన్నం దునే డిసెంబర్ 19లోగా తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలి కాబట్టే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుపుతున్నామని సీఎం పార్టీ నేతలకు చెప్పారు. తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని ఆయన భావించి ఉంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టకుండా ఇంతకాలం ఆగేవారే కాదని, నవంబర్‌లోనే సమావేశాలు పూర్తి చేసే అవకాశం ఉందని, అయినప్పటికీ వాటిని నిర్వహించకుండా విభజన బిల్లు వస్తుందన్న సమాచారం మేరకు సుదీర్ఘ కాలం తర్వాత రాష్ట్ర కేబినెట్‌ను సమావేశపరిచి అసెంబ్లీ తేదీలను ఖరారు చేశారని తెలుస్తోంది.