టీపై ప్రత్యేక చర్చే! | special debate on telangana bill! | Sakshi
Sakshi News home page

టీపై ప్రత్యేక చర్చే!

Published Sat, Dec 14 2013 1:26 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

special debate on telangana bill!

కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక వైఖరి కావొచ్చు.. సాంకేతిక అంశాలు కావొచ్చు.. కారణాలేవైనా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను శాసనమండలి, శాసనసభ ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో కాకుండా ప్రత్యేక సమావేశాల్లోనే చర్చకు చేపట్టే పరిస్థితులున్నాయి. విభజన బిల్లు అధికారికంగా గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి అందిన నేపథ్యంలో అభిప్రాయం కోసం దాన్ని మండలి, అసెంబ్లీల్లో ఎప్పుడు చర్చకు పెడతారన్న అంశం పార్టీల్లో తీవ్ర ఉత్కంఠ కలిగిస్తుండటం తెలిసిందే. మరోవైపు దీనిపై ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. చర్చ ఎప్పుడన్న దానిపై సోమవారం స్పీకర్ నిర్వహించే సభా వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
 

పస్తుత పరిస్థితులు, విభజన బిల్లు చుట్టూ శుక్రవారం ఆయా పార్టీల్లో జరిగిన పరిణామాలు, ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌కు చెందిన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో ఆ పార్టీ నేతల సమాలోచనల సారాంశాన్ని బట్టి బిల్లుపై చర్చకోసం ప్రత్యేక  సమావేశాలు నిర్వహించడం ఖాయంగా కనబడుతోంది. బిల్లుపై సభ్యులందరి అభిప్రాయంతో పాటు ఉభయ సభల అభిప్రాయాన్ని కూడా పంపించాలని రాష్ట్రపతి నిర్దేశించడంతో పాటు అందుకు 40 రోజుల గడువివ్వడం తెలిసిందే. ఈ కారణంగా కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నట్టు కనబడుతోంది. అంతేగాక వీలైనంత త్వరగా అభిప్రాయ సేకరణ తంతును ముగించే ఉద్దేశంతో బిల్లును కాంగ్రెస్ అధిష్టానం ఆగమేఘాల మీద ప్రత్యేక విమానంలో తరలించినప్పటికీ... కిరణ్ అభ్యర్థన కారణంగా మనసు మార్చుకున్నట్టు పీసీసీ వర్గాల్లో విన్పిస్తోంది. సీమాంధ్రలో తాము కాస్తయినా పరువు కాపాడుకోవాలంటే చర్చ తాము కోరినట్టుగా ప్రత్యేక సమావేశాల్లో, అది కూడా వీలైనంత ఎక్కువ సమయం జరిగేలా చూడాలని కిరణ్ దిగ్విజయ్‌ని కోరారని, ఆయన కూడా అందుకు అంగీకరించారని చెబుతున్నారు.

 
 పస్తుతం రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు, అభిప్రాయం విభజనకు అనుకూలంగా వచ్చేలా మెజారిటీ సభ్యుల మద్దతు కూడగట్టాల్సి ఉండటం, కిరణ్‌తో పాటు సీమాంధ్ర ప్రజాప్రతినిధులను కూడా సంతృప్తి పరచాల్సి ఉండటం వంటివాటిని కూడా పరిగణనలోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఈ కారణాలతో బిల్లుపై చర్చ కోసం మండలి, అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించుకోవడానికి అధిష్టానం వ్యూహాత్మకంగా ఓకే చేసినట్టు సమాచారం. తద్వారా బిల్లుపై అసెంబ్లీ అభిప్రాయ సేకరణ ప్రక్రియను హడావుడిగా, నామమాత్రపు తంతుగా ముగించారన్న అపవాదు కూడా రాకుండా ఉంటుందని ఏఐసీసీ వర్గాలను ఉటంకిస్తూ పీసీసీ ముఖ్య నేత ఒకరు వివరించారు.
 
 బీఏసీకి కిరణ్!: రాష్ట్రపతి నిర్దేశానుసారం చర్చకు ముందు విభజన బిల్లును ఉభయ సభల్లోని ప్రజాప్రతినిధులందరికీ చేరవేయాల్సి ఉంది. బిల్లు ప్రతులను అధికారులు శుక్రవారం మధ్యాహ్నం, అది కూడా సభ సోమవారానికి వాయిదా పడిన తర్వాత సభకు తీసుకొచ్చారు. వాటిని సోమవారం సభ ముందు పెట్టాక సభ్యులందరికీ అందజేస్తారు. అనంతరం స్పీకర్ బీఏసీ సమావేశం నిర్వహించి తదుపరి ఎజెండాను ఖరారు చేయనున్నారు. శాసనసభ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందురోజు నిర్వహించిన బీఏసీ భేటీకి సభా నాయకుడైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరు కాని విషయం తెలిసిందే. సోమవారం నాటి బీఏసీ భేటీలో మాత్రం బిల్లుపై అజెండాను ఖరారు చేయాల్సి ఉన్నందున ఆయన హాజరయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మరో ఐదు రోజుల పాటే కొనసాగుతాయి. విభజనపై ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని భావిస్తారు. ఎందుకంటే వారు వ్యక్తం చేసే అభిప్రాయం చరిత్ర రికార్డుల్లో శాశ్వతంగా ఉండిపోతుంది. అయితే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు 20వ తేదీతో ముగుస్తున్నందున అందరూ అభిప్రాయాలు చెప్పడం ఆలోగా పూర్తవకపోవచ్చన్న అభిప్రాయముంది.
 
 పైగా రాష్ట్రపతి స్వయంగా 40 రోజుల గడువు పెట్టాక ఇంత హడావుడిగా చర్చకు పెట్టాల్సిన అవసరమేమిటన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. తెలంగాణ నేతలు మాత్రం విభజనపై ఇప్పటికే పలు చర్చలు జరిగిన నేపథ్యంలో పార్టీలవారీగా ముఖ్యులకు మాత్రం అభిప్రాయ వెల్లడికి అవకాశం కల్పించి ఈ సమావేశాల్లోనే ఉభయ సభల అభిప్రాయాన్ని తీసుకుని రాష్ట్రపతికి బిల్లును తిరిగి పంపించాలని గట్టిగా పట్టుబడుతున్నారు. సమయం తక్కువని భావిస్తే ఈ సమావేశాలనే పొడిగించాలని కొందరు సూచిస్తున్నారు. రాష్ట్రపతి నిర్దేశానుసారం జనవరి 23 లోగా బిల్లును అభిప్రాయాలతో తిప్పి పంపాల్సి ఉంది. డిసెంబర్ 20తో సమావేశాలు ముగుస్తాయి. 25న వచ్చే క్రిస్మస్, తర్వాత ఆంగ్ల సంవత్సరాది దృష్ట్యా ఆ నడుమ సాధారణంగా సమావేశాలు నిర్వహించరు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలను కూడా డిసెంబర్ చివరి వారంలో క్రిస్మస్‌కు ముందుగానే వాయిదా వేయడం సంప్రదాయంగా వస్తోంది. ఆ దృష్ట్యా ఇక్కడా జనవరి తొలి లేదా మూడో వారంలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే ఆస్కారం ఎక్కువగా కన్పిస్తోంది.
 
 పార్లమెంటులో తక్షణం బిల్లు అసాధ్యమే: మరోవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాలు కూడా డిసెంబర్ 20తోనే వాయిదా పడనున్నందున అందులో కూడా విభజన బిల్లును తక్షణం ప్రవేశపెట్టే అవకాశాలు ఏమాత్రమూ లేవు. వాటిని పొడిగించాలనుకుంటే సమావేశాలను నిరవధికంగా కాకుండా జనవరి తొలి వారానికి వాయిదా వేయవచ్చు. అప్పుడు ఆలోపే అసెంబ్లీ అభిప్రాయం తీసుకుని బిల్లును రాష్ట్రపతికి నివేదించాల్సి ఉంటుంది.
 
 బీఏసీ నిర్ణయమే కీలకం: విభజన బిల్లు రాష్ట్రపతి నుంచి వచ్చిన నేపథ్యంలో స్పీకర్ తప్పనిసరిగా బీఏసీ నిర్వహించి చర్చించాల్సిన అవసరముంది. అసెంబ్లీ కార్యదర్శికి బిల్లు గురువారమే చేరినా సభ్యులకు అందజేయాల్సిన ప్రతులు శుక్రవారం మధ్యాహ్నం తర్వాత చేరడం, అప్పటికే సభ వాయిదా పడటంతో బీఏసీని సోమవారం నిర్వహించనున్నారు. దిగ్విజయ్ కూడా అదే చెప్పారు. ప్రత్యేక భేటీలో చర్చకే బీఏసీలో కిరణ్ మొగ్గవచ్చంటున్నారు. తెలంగాణ మంత్రులు మాత్రం బీఏసీ మర్నాడే, అంటే మంగళవారమే బిల్లును సభలో చర్చకు చేపడతారని చెబుతున్నారు. బీఏసీలో ఆయా పార్టీలు వ్యక్తం చేసే అభ్యంతరాలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయానికి వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కిరణ్‌తో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు పాల్గొనే బీఏసీలో సీమాంధ్ర, తెలంగాణ వారిద్దరూ ఉంటారు గనుక తుది నిర్ణయం ఎలా ఉంటుందన్నది కీలకంగా మారింది.
 
 ఇదే అంశంపై మండలి చైర్మన్ కూడా విడిగా బీఏసీ నిర్వహించి ఎజెండాను ఖరారు చేయాల్సి ఉంది.
 
 చర్చకు కాంగ్రెస్ విప్!: ఉభయ సభల్లో విభజన బిల్లు ఎప్పుడు చర్చకు వస్తుందన్న అంశంపై కూడా సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో దిగ్విజయ్ శుక్రవారం మాట్లాడారు. ప్రత్యేక సమావేశాలకు అభ్యంతరమేమీ లేదని ఆయన సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. దిగ్విజయ్‌ను కలిశాక మంత్రి దానం నాగేందర్ కూడా అదే చెప్పారు. మరోవైపు, కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక సంఘమైన సీడబ్ల్యూసీ తీర్మానం మేరకు విభజన నిర్ణయం జరిగినందున, దానిపై మండలి, అసెంబ్లీల్లో చర్చ సందర్భంగా సభ్యులంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలంటూ విప్ జారీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement