నేడు సభ్యులకు టీ బిల్లు ప్రతులు!
బిల్లు ప్రతులను సీఎస్‌కు ఇచ్చిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి.. గవర్నర్, సీఎం, అసెంబ్లీ కార్యదర్శులకూ అందజేత
సాక్షి, హైదరాబాద్: ఇన్ని రోజులు హస్తినకే పరిమితమైన రాష్ట్ర విభజన అంశం గురువారం సాయంత్రం రాష్ట్రానికి చేరింది. రాష్ట్ర పునర్విభజన ముసాయిదా (తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు) బిల్లు గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. జనవరి 23వ తేదీలోగా దానిపై శాసనమండలి, అసెంబ్లీ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గడవు విధించారు. సభ్యుల వ్యక్తిగత అభిప్రాయంతో పాటు, ఇరు సభల అభిప్రాయాన్ని కూడా వేర్వేరుగా పంపాల్సిందిగా పేర్కొన్నారు. రాష్ట్రపతి నుంచి బిల్లును స్వీకరించిన కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సురేశ్‌కుమార్, ఢిల్లీ నుంచి సరిహద్దు భద్రతాదళం ప్రత్యేక విమానంలో గురువారం హైదరాబాద్ వచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా సచివాలయానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతిని కలిసి ముసాయిదా బిల్లు ప్రతులను ఆయనకు అందజేశారు.
ముసాయిదా బిల్లు ప్రతులను 294 మంది ఎమ్మెల్యేలు, 90 మంది ఎమ్మెల్సీలకు అందజేయాల్సిందిగా కోరారు. ఆ మేరకు సీఎస్ నుంచి హమీ పత్రాన్ని కూడా సురేశ్‌కుమార్ పొందారు. సీఎస్ వద్ద ఈ మొత్తం ప్రక్రియను 20 నిమిషాల్లోనే ఆయన ముగించుకున్నారు. సభ్యులకు అందజేయాల్సిన ముసాయిదా బిల్లుకు చెందిన 400 ప్రతులను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఢిల్లీ నుంచే తీసుకువచ్చారు. సీఎస్‌ను కలిసిన అనంతరం సురేశ్‌కుమార్ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని, అనంతరం రాజభవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కూడా కలిసి బిల్లు ప్రతులను అందజేశారు.
తరవాత అసెంబ్లీ కార్యదర్శి సదారాంను కలిసి బిల్లు ప్రతులను అందజేశారు. బిల్లుకు సంబంధించి రాష్ట్రపతి ఆదేశాలు, హోం శాఖ సూచనల మేరకు సీఎస్ గురువారం రాత్రి పొద్దుపోయేదాకా సచివాలయంలోనే ఉండి ఫైలు రూపొందించారని, రాత్రి పొద్దుపోయాక క్యాంపు కార్యాలయానికి వెళ్లి దాన్ని కిరణ్‌కు అందజేశారని అధికార వర్గాల సమాచారం. కిరణ్ దాన్ని పరిశీలించాక గవర్నర్‌కు పంపుతారు. గవర్నర్ ఆమోదానంతరం ఫైలు తిరిగి సీఎం కార్యాలయానికి చేరుతుంది. అక్కడ నుంచి స్పీకర్‌కు వెళ్లనుంది. ఈ ప్రక్రియుంతా శుక్రవారం ఉదయం పూర్తవనుందని సవూచారం. అనంతరం శుక్రవారం సాయంత్రంలోగా బిల్లు ప్రతులను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ పంపిణీ చేయనున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం అధ్యయునానికి వారికి వారం రోజులు గడువివ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. అనంతరం తిరిగి సభలో చర్చించాల్సిన తేదీలను ఖరారు చేయనున్నారు. గడువులోగా అసెంబ్లీలో, మండలిలో బిల్లుపై చర్చించి సభ్యుల అభిప్రాయాలతో కూడిన నివేదికను రాష్ర్టపతికి పంపాల్సి ఉంటుంది.