
అందుకే కలిసుండాలనేది!
రెండు రాష్ట్రాలన్నందుకు గీతారెడ్డికి సీఎం కౌంటర్
‘‘మా కంపెనీ ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ నా సొంతిల్లు లాంటిది. ఇక్కడే చదివా. ఇక్కడే పెరిగా. ఆబిడ్స్ సంతోష్ థియేటర్లో సినిమాలు చూడటం, వైఎంసీఏలో తిరగటం... అంతా గుర్తొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగా. ఈ రాష్ట్రంతో నాకెంతో అనుబంధం ఉంది..’’ ఇది పెప్సికో ఇండియా సీఈవో శివకుమార్ చేసిన వ్యాఖ్య! చిత్తూరు జిల్లా శ్రీసిటీలో పెప్సికో ప్లాంట్ పెడుతున్న సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ పై వ్యాఖ్యలు చేశారు. సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అవకాశం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి గీతారెడ్డి పాల్గొన్నారు. శివకుమార్ మాట్లాడిన తర్వాత గీతారెడ్డి ప్రసంగిస్తూ.. ఇప్పటికే తెలంగాణలో పెప్సికో యూనిట్ ఉందని, ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ చిత్తూరు జిల్లాలో కావటంతో.. ఒకవేళ రెండు రాష్ట్రాలు ఏర్పడితే రెండుచోట్లా రెండు యూనిట్లు ఉన్నట్లవుతుందని వ్యాఖ్యానించారు. అనంతరం మంత్రి గీతారెడ్డి వ్యాఖ్యలను సున్నితంగానే కౌంటర్ చేస్తూ ముఖ్యమంత్రి తన ప్రసంగం మొదలెట్టారు. ‘‘మేడమ్ చూశారా.. ఎప్పుడో 25 ఏళ్ల కిందట మేనేజ్‌మెంట్ స్టడీస్ కోసం హైదరాబాద్ వచ్చి, ఇక్కడ ఉన్న పెప్సికో ఇండియా సీఈవో శివకుమార్‌కు హైదరాబాద్ అంటే ఎంత మమకారం ఉందో! మరి ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువుకున్న మాకెంత ఉండాలి? అందుకే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, విడిపోకూడదని మేం కోరుతున్నాం’’ అని సీఎం అనగానే గీతారెడ్డి సహా అంతా ఒక్కసారిగా నవ్వేశారు.
యువత రాజకీయాల్లోకి రావాలి: సీఎం
యువత రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ఉత్తమ పాలన అందుతుందని సీఎం పేర్కొన్నారు. ఇండియా టుడే గ్రూపు సంస్థల స్టే ఆఫ్ ది స్టేట్ - బెస్ట్ గవర్నెన్స్ అవార్డు ఢిల్లీలో అందుకున్న సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ, ఇతర విద్యాసంస్థల విద్యార్థులు క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.