సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు వెల్లువెత్తిన నేపథ్యంలో... పరిస్థితి చేయిదాటకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పారా మిలటరీ బలగాలను మోహరించాలని సూచించారు. సీమాంధ్ర ప్రాంతంలో శాంతి భద్రతల పరిస్థితిపై సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి.ప్రసాదరావు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి టీపీ దాస్, ఇంటలిజెన్స్ చీఫ్ ఎం.మహేందర్‌రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హింసాత్మక ఘటనలకు తావులేకుండా చూడాలని డీజీపీ ప్రసాదరావుకు సీఎం స్పష్టం చేశారు. పోలీసులు పూర్తి సంయమనంతో వ్యవహరించాలని.. ఒక్క రబ్బర్ బుల్లెట్ కూడా ఉపయోగించవద్దని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల రక్షణ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద భద్రతను పెంచాలని ఆదేశించారు.
విమానాల ద్వారా బలగాల తరలింపు
సీమాంధ్ర జిల్లాల్లో ఆందోళనలు ఉధృతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి 25 కంపెనీల పారా మిలటరీ బలగాలను రాష్ట్రానికి రప్పిస్తోంది. కోల్‌కతా, బెంగళూరుల నుంచి సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్ బలగాలను విమానాల్లో రప్పిస్తున్నారు. ఆ బలగాలను విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో మోహరించనున్నట్లు డీజీపీ తెలిపారు.
పరిస్థితి చేయిదాటనీయొద్దు : కిరణ్‌కుమార్ రెడ్డి
Published Sat, Oct 5 2013 5:58 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement