12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఢిల్లీ పెద్దల ముందస్తు సమాచారం మేరకే తేదీల ఖరారు
సమావేశాలకు ఒకటిరెండు రోజులు ముందుగానే గవర్నర్‌కు బిల్లు
విభజనను ప్రతిఘటించేలా స్వరం వినిపించాలని సీఎం నిర్ణయం
అధిష్టానం స్కెచ్ ప్రకారమే సీఎం వ్యవహరిస్తున్నారన్న విమర్శలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో రాష్ట్రపతి నుంచి సంబంధిత బిల్లు త్వరలోనే శాసనసభ అభిప్రాయం కోసం పంపించనున్నట్టు సమాచారం. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ పెద్దల ముందస్తు సమాచారం మేరకే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే తేదీలను ఖరారు చేశారని తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో శాసనసభ తొలిరోజునే ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు- 2013’ పై చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ 6 నుంచి పశ్చిమబెంగాల్‌లో పర్యటించ నున్నారు. 8న ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈలోగా రాష్ట్రపతి కార్యాలయానికి తెలంగాణ ముసాయిదా బిల్లు చేరుతుందని, రాష్ట్రపతి దాన్ని పరిశీలించి ఒకటిరెండు రోజుల్లోనే అసెంబ్లీ అభిప్రాయంకోసం రాష్ట్ర గవర్నర్‌కు పంపించనున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ లెక్కన అసెంబ్లీ సమావేశాలకు ఒకటిరెండు రోజులు ముందుగానే ముసాయిదా బిల్లు గవర్నర్‌కు చేరుతుందని తెలుస్తోంది. ఆపై ఆయన అసెంబ్లీ స్పీకర్‌కు, ప్రభుత్వానికి పంపి అభిప్రాయ సేకరణ కోరనున్నారు. ముసాయిదా బిల్లును సభాపక్ష నేతగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డే సభలో ప్రవేశపెట్టే అవకాశముంది. ఆయన కానిపక్షంలో శాసనసభావ్యవహారాల మంత్రి లేదా మరో మంత్రి ద్వారా అయినా స్పీకర్ సభలో ప్రవేశపెట్టించి అసెంబ్లీ అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. బీఏసీలో నిర్ణయించిన మేరకు సభలో పార్టీలవారీగా సమయం కేటాయించి చర్చకు అవకాశమివ్వనున్నారని చెబుతున్నారు. అయితే విభజన బిల్లు కనుక ఏ సభ్యుడు మాట్లాడేందుకు అవకాశం అడిగినా ఇవ్వాల్సి ఉంటుంది. సభలో సాధ్యమైనంత త్వరగా అభిప్రాయ సేకరణ ముగించి తిరిగి రాష్ట్రపతికి పంపాలని కేంద్రం పెద్దలు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితోసహా అసెంబ్లీ వర్గాలకూ స్పష్టమైన సూచనలు అందించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ పెద్దల ఆదేశాలతో సీఎం కిరణ్, సీమాంధ్ర రాష్ట్ర, కేంద్ర మంత్రులు అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చను సాఫీగా ముగించే అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా సీఎం సీమాంధ్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణ, సాకే శైలజానాథ్, టీజీ వెంకటేశ్ తదితరులతో భేటీ అయ్యారు. అసెంబ్లీలో విభజనను తీవ్రంగా ప్రతిఘటించేలా స్వరాలు వినిపిస్తే సమైక్యనినాదంతో ముందుకువెళ్లేందుకు వీలుంటుందన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. సమైక్య నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్నామని చెప్పుకొనేందుకు అసెంబ్లీ సమావేశపు వేదికపైనుంచే తమ పదవులకు రాజీనామా ప్రకటనలు చేయాలన్న అంశంపైనా సీఎంతో సహా సీమాంధ్ర మంత్రులు తీవ్రంగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.
రాజీనామా ప్రకటన ద్వారా ప్రజల్లో నమ్మకం పెంచుకోవచ ్చన్న భావనకు వారు వచ్చినట్లు సమాచారం. ఈ అంశాలపై కేంద్రం పెద్దలతోనూ సీఎం, ఇతర నేతలు చర్చలు సాగించినట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి సీమాంధ్ర కేంద్ర మంత్రులతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఇలా ఉండగా రాష్ట్ర విభజన వ్యవహారంలో ముఖ్యమంత్రి తీరుపై ఇప్పటికే అనేక అనుమానాలు ఉండగా తాజా పరిణామాలతో వాటికి మరింత బలం చేకూరుతోందని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. అధిష్టానం స్కెచ్ ప్రకారమే వ్యవహారాన్ని ఆయన ముందుకు నడిపిస్తున్నారని, బిల్లుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేలా అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేయడమే దీనికి ఉదాహరణ గా చెబుతున్నారు.
అసెంబ్లీ తొలిరోజునే బిల్లు!
Published Fri, Dec 6 2013 2:33 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement