హైదరాబాద్ జోలికొస్తే... ఊరుకోం: కోదండరాం
హైదరాబాద్/నల్లగొండ, న్యూస్‌లైన్: తెలంగాణలో అంతర్భాగమైన హైదరాబాద్ జోలికి వస్తే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. సోమవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద టీఎస్, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ పరిరక్షణ సభ జరిగింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ‘తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్థుల పాత్ర’ అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సభల్లో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణను పరిరక్షించుకునేందుకు అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 29లోపు పార్లమెంటులో బిల్లు పెట్టకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని వనరులను దోచుకున్న సీమాంధ్రపెట్టుబడిదారులే హైదరాబాద్‌పై వివాదాలను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్టీసీని ప్రభుత్వపరం చేస్తే తెలంగాణకే నష్టం: ఆర్టీసీని ప్రభుత్వపరం చేస్తే తెలంగాణకే నష్టమని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సీమాంధ్రలో ప్రైవేటు బస్సులను అధిక సంఖ్యలో నడపడంతో పాటు, ప్రస్తుత సమ్మె నష్టాన్ని కప్పి పుచ్చుకునేందుకే సంస్థను ప్రభుత్వపరం చేయాలనుకుంటోందని ఆరోపించారు.
తద్వారా సీమాంధ్ర ప్రాంత నష్టాలను ఈ ప్రాంతం భరించాల్సి ఉంటుందని, ఇక్కడి లాభాలను సీమాంధ్రులు గడిస్తారని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీని ఎలా అభివృద్ధి చేసుకోవాలో తమకు తెలుసన్నారు. హైదరాబాద్ నిజాం పాలకుల నుంచే అభివృద్ధి చెందుతూ వచ్చిందని వివరించారు. రాజ్యాంగపరంగా ఉండేందుకు హక్కులు ఉంటాయని, హైదరాబాద్ తమదని సీమాంధ్రులంటే ఒప్పుకోబోమన్నారు. ఢిల్లీలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు సమైక్య రాగం వినిపిస్తున్నారని తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిన ఆవశ్యకతపై చెప్పకుండా సీమాంధ్రకు నష్టం జరుగుతుందని మాత్రమే పేర్కొనడం భావ్యం కాదన్నారు. బాధ్యతాయుతమైన వ్యక్తిగా.. ఇరు పక్షాల సమస్యలను పెద్దల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. డీజీపీ మానసికస్థితి బాగాలేదు: అక్రమ ఆస్తులపై సీబీఐ ప్రశ్నించనుందన్న విషయం తెలిసినప్పటి నుంచి డీజీపీ దినేష్‌రెడ్డి మానసిక స్థితి సరిగా లేదని తెలిపారు. తెలంగాణ జర్నలిస్తులపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని, అదే సీమాంధ్రలో పోలీసులు దగ్గరుండి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు.
ఆత్మబలిదానం చేసుకోవద్దు: ‘తెలంగాణ రాష్ట్రం కచ్చితంగా వస్తుంది.. ఐక్యంగా కొట్లాడి సాధించుకుందాం.. దీంట్లో ఎవరికీ అనుమానం అవసరం లేదు.. దయచేసి ఎవ రూ ఆత్మబలిదానాలకు పాల్పడవద్దని’ కోదండరాం కోరారు. తెలంగాణ కోసం ఆత్మహత్యకు యత్నించిన మమతను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అనుసరిస్తున్న విధానాలతోనే తెలంగాణ వస్తుందో రాదో అనే అనుమానం ప్రజలకు కలుగుతుందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి వెళ్లి, తెలంగాణ తెస్తామనే భరోసాను ప్రజల్లో కలిగించాలని కోరారు. టీఎస్, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ పరిరక్షణ సభలో మాజీ ఎంపీ రవీంద్రనాయక్, ఉద్యోగ సంఘాల నాయకులు దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, నాయకులు బెల్లయ్యనాయక్, రసమయి బాలకిషన్, అద్దంకి దయాకర్, సంజీవనాయక్ తదితరులు హాజరయ్యారు.