సాక్షి, హైదరాబాద్: టీటీడీ, విద్యుత్, విద్య, వైద్యం తదితర అత్యవసర సేవలకు విఘాతం కలిగించవద్దని సమ్మె చేస్తున్న సీమాంధ్ర ప్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవల ఆవశ్యకతను ఉద్యోగ సంఘాలకు వివరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, టీటీడీ ఈవో, చిత్తూరు జిల్లా కలెక్టర్, విద్యుత్ అధికారులను ఆయన ఆదేశించారు. సమ్మె పరిస్థితిపై ముఖ్యమంత్రి బుధవారం సమీక్షించారని పేర్కొంటూ సీఎంవో పత్రికా ప్రకటన విడుదల చేసింది. రాయలసీమ, ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల పరిస్థితి గురించి కూడా ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సహాయ పునరావాస చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా సీఎం కిరణ్ 13న తన 54వ పుట్టినరోజును జరుపుకునేందుకు తిరుపతి వెళ్లనున్నట్లు సమాచారం.