కిట్స్ విద్యార్థుల ప్రతిభ
లీటరు పెట్రోలుతో 32కిలోమీటర్లు నడిచే కారు తయారీ
పెద్దాపురం: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు లీటరు పెట్రోలుకు 32 కిలోమీటర్ల దూరం నడిచే చిన్న కారును ఆదివారం ఆవిష్కరించారు. కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న పి.సతీష్, జోసఫ్‌రెడ్డి, సోమేశ్వరరావు, మణికంఠ, కె.సురేష్ దీన్ని రూపొందించారు. ఐదుగురు విద్యార్థులు రూ.40 వేల ఖర్చుతో రెండు నెలలు శ్రమించి ఈ కారును తయారు చేశారు.
ఐదడుగుల పొడవు, రెండున్నర అడుగుల వెడల్పు ఉన్న ఈ కారులో గంటకు 50 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించవచ్చని విద్యార్థులు తెలిపారు. దీని తయారీకి 110 సీసీ హోండా యాక్టివ్ ఇంజన్, సన్నీ స్కూటర్ చక్రాలు, మారుతీ కారు స్టీరింగ్ ఇతర సామగ్రి ఉపయోగించామని, కారులో ఇద్దరు ప్రయాణించవచ్చని చెప్పారు.