కోదాడ-మునగాల మండలాల సరిహద్దులోని ద్వారకానగర్ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో భారీ కుంభకోణం జరిగింది. రియల్టర్ ఒకే భూమిని డెవలపర్స్‌కు
‘రియల్’ మోసం..!
Published Thu, Oct 10 2013 4:01 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
కోదాడటౌన్, న్యూస్‌లైన్ :కోదాడ-మునగాల మండలాల సరిహద్దులోని ద్వారకానగర్ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో భారీ కుంభకోణం జరిగింది. రియల్టర్ ఒకే భూమిని డెవలపర్స్‌కు ఇళ్ల నిర్మాణానికి ఇచ్చి, అదే భూమిని మరొకరికి సేల్ కమ్ జీపీఏ (విక్రయంతో కూడిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) చేశాడు. దీంతో ఇక్కడ డెవలపర్స్ కట్టిన ఇళ్లను కొన్న వారు లబోదిబోమంటున్నారు. జరిగిన మోసంపై డెవలపర్ మామిడి రామారావు కోర్టులో ఫిర్యాదు చేయడంతో కోర్టు ఆదేశాల మేరకు రియల్టర్ పి. రామాంజనేయులగౌడ్, డెవలపర్‌లో ఒకరైన పందిరి రాజశేఖర్‌పై కేసు నమోదైంది. కోదాడ మండలం కొమరబండ సమీపంలో ద్వారకానగర్ పేరుతో బీబీనగర్‌కు చెందిన రామాంజనేయులుగౌడ్ 30ఎకరాలలో రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేశారు.
దానిలో 24వేల చదరపు గజాలను(120 ప్లాట్లు) కోదాడకు చెందిన రాజశేఖర్, రామారావు, జనార్దన్, రాజవర్ధన్‌రెడ్డిలకు డెవలప్‌మెంట్ కోసం విక్రయ అగ్రిమెంట్ చేశాడు. వీరు దీని కోసం భారీ ఎత్తున డబ్బు చెల్లించారు. ఈ భూమిలో శ్రీ కృష్ణా హోమ్స్ పేరుతో గేటెడ్ కమ్యూనిటీగా డెవలప్ చేస్తూ ఇళ్లను నిర్మిస్తున్నారు. ఈ డెవలప్‌మెం ట్‌లో పై నలుగురితో పాటు రియల్టర్ రామాం జనేయులుగౌడ్ 50 శాతం భాగస్వామిగా ఉన్నాడు. దీంతో డెవలపర్స్ ఇళ్లను నిర్మిస్తున్నామని పలువురు ఉద్యోగులకు, చిరువ్యాపారుల వద్ద డబ్బులు తీసుకొని ప్లాట్లను అమ్మడంతో పాటు వాటిలో ఇళ్లు కూడా కట్టిస్తున్నారు. ఇప్పటికే అక్కడ దాదాపు 30కి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి కావచ్చింది. వీటికి కోదాడకు చెందిన బ్యాంక్ రుణాలూ ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు కథ ఇపుడే మొదలైంది.
డెవలప్‌మెంట్‌కు ఇచ్చిన స్థలం మరొకరికి అమ్మకం
ద్వారకానగర్‌లో శ్రీ కృష్ణా హోమ్స్ పేరుతో గేటెడ్ కమ్యూనిటీగా డెవలప్ చెసేందుకు రియల్టర్ ఇచ్చిన 24వేల గజాలలో(120 ప్లాట్లు) విక్రయ అగ్రిమెంట్‌కు ముందుగానే 4వేల గజాలను (డాక్యుమెంట్ నెంబర్ 5953/2011 ద్వారా) ఒకరికి, అగ్రిమెంట్ తర్వాత మరొకరికి (డాక్యుమెంట్ నెంబర్ 10397/2012 నుండి 10402/12 వరకు), మరో 10వేల గజాలను ఆరుగురు వ్యక్తులకు అమ్మాడు. అయితే, ఈ అమ్మకం వ్యవహారం తెలియని డెవలపర్లు వాటిలో ఇళ్లు నిర్మిస్తున్నారు. అవి వివిధ దశలలో ఉన్నాయి. కొన్నింటిని విక్రయించి కొన్న వారికి ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయమని రియల్టర్‌ను కొంతకాలంగా కోరుతున్నారు. కానీ, రియల్టర్ ఆ భూమిని అప్పటికే ఇతరులకు విక్రయించి ఉండడంతో తన బండారం బయటపడుతుందని వారిని తిప్పుతున్నారు. డెవలపర్‌లలో ఒకరైన పందిరి రాజశేఖర్ ఈ మోసంలో భాగస్వామిగా మారాడని అనుమానం వచ్చిన ఇతర భాగస్వాములు ఈసీలు తీయించారు. దీంతో అప్పటికే ఆ భూమిని ఏడు డాక్యుమెంట్ల ద్వారా అమ్మినట్లు తేలింది. దీంతో డెవలపర్స్‌తో పాటు ప్లాట్లు కొన్న వారు రియల్టర్‌ను నిలదీయగా తనకేమీ తెలియదని అంతా తన అనుచరునిపై నెట్టి తప్పించుకుంటున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
కోర్టును ఆశ్రయించిన బాధితులు
మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన బాధితులు కోదాడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో వారు కోదాడ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు కోర్టు ఆదేశించింది. దీంతో కోదాడ పట్టణ పోలీసులు రియల్టర్ రామాంజనేయులుగౌడ్, అతని అనుచరుడు రాజశేఖర్‌పై కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement