బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్ : గుర్తు తెలియని వ్యక్తులు కోదండరామస్వామి ఆలయంలో చొరబడి నాలుగు గ్రాముల బంగారు బొట్టు బిళ్లలను చోరీ చేసిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఆలయ ప్రహరీ పైనుంచి దుండగులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు. చతుర్భుజ అమ్మవారి ఆలయం లోపలికి వెళ్లేం దుకు ఆలయం వెనక ఉన్న పశువులను కట్టేసిన గడ్డపారను తీసుకువచ్చి తాళం పగలగొట్టారు. లోపల ద్వారం రాకపోయేసరికి నరసింహస్వామి ఆలయంలోకి వెళ్లారు. అక్కడ లోపల గడియ తొలగించేందుకు విఫలయత్నం చేశారు. గర్భగుడిలోకి వెళ్లి నరసింహస్వామి విగ్రహాన్ని అపహరించేందుకు దించినా తీసుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు. దీంతో శ్రీదేవి, భూదేవి, వరదరాజస్వామి ఉత్సవ విగ్రహాలకు నుదుటిపై ఉన్న బంగారు బొట్టు బిళ్లలను చోరీ చేశారు. సమాచారం అందుకున్న నెల్లూరు డీఎస్పీ రాంబాబు, సీఐ సాంబశివరావు, ఎస్సై శ్రీనివాసరావు, పీఎస్సై నరేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం పరిశీలించి ఆధారాలు సేకరించారు.
అన్నీ అనుమానాలే..
నరసింహస్వామి ఆలయంలో జరిగిన చోరీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ పూజారి చెప్పిన మాటలకు పొంతన లేదు. ధనుర్మాసం కావడంతో నరసింహ స్వామి ఆలయంలోని వెండి ఆభరణాలు మూటకట్టి పెట్టామని ఆలయ పూజారి చెబుతున్నారు. అయితే దొంగలే చోరీ చేసేందుకు వెండి ఆభరణాలు మూట కట్టినట్లు తెలుస్తోంది. వెండి ఆభరణాల మూటను తీసుకుని ప్రహరీని దూకడం కష్టమే.
వెనక ఇంట్లో చెప్పు
గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆలయం వెనుక వైపున ఉన్న గుడిసెలోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు ఆ గుడిసెలో ఉన్న కల్లూరు కొండయ్య చెబుతున్నాడు. తాను ఇంటి బయట నిద్రిస్తుండగా తన భార్య అరిచిందన్నారు. ఇంటి తలుపులు నెట్టేందుకు ప్రయత్నించాడని, తాను దోమ తెర తప్పించి బయటకు వచ్చేలోగా పరారయ్యాడన్నారు. అయితే ఆ సమయంలో తన కాలి చెప్పు ఒకటి ఇక్కడే ఉండిపోయిందన్నారు.
డాగ్‌స్క్వాడ్ పరిశీలన
డాగ్‌స్క్వాడ్ ఆలయం చుట్టుపక్కలంతా వెళ్లింది. తొలుత ఆలయం పక్కన ప్రహరీ నుంచి దూకేందుకు అవకాశమున్న ప్రాంతం వద్ద ఆగింది. అనంతరం వెనక వైపునున్న గుడిసె వద్దకు వెళ్లింది. అక్కడి నుంచి ఆలయం పక్కనున్న కోనేరు వద్దకు వెళ్లింది. ఆంజనేయస్వామి ఆలయ పూజారి పరాంకుశం ఇంటితో పాటు పలు ఇళ్లలోకి వెళ్లింది. మళ్లీ గుడిసె వద్దకు చేరుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆ మార్గంలో ఎలా వచ్చాడో సూచించింది. అయితే చెప్పు వాసన పసిగట్టిన డాగ్‌స్క్వాడ్ చెప్పును వదిలేసిన దుండగుడు అక్కడే తిరిగినట్లు సూచించింది. పరారైనట్లు దాఖలాలు లేవు. ఏది ఏమైనా దర్యాప్తులో వాస్తవాలు తేలాల్సి ఉంది.
కోదండరామస్వామి ఆలయంలో చోరీ
Published Mon, Dec 23 2013 3:07 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
Advertisement
Advertisement