నరసరావపేట వెస్ట్ : నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామకృష్ణ చేస్తున్న దౌర్జన్యాలు, దుర్మార్గాలన్నీ పోలీసుల సహకారంతోనే జరుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు.
నరసరావుపేట రామిరెడ్డిపేటలో ఆదివారం అర్ధరాత్రి కొందరు దుండగులు గ్రామీణ కేబుల్ టీవీ(జీసీ టీవీ) కేంద్ర కార్యాలయంపై దాడిచేసి విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు, సోలార్‌ప్యానెళ్ళు, డిష్‌లను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటిరాంబాబు, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సోమవారం సాయంత్రం ధ్వంసమైన కార్యాలయాన్ని సందర్శించి కార్యాలయ ఆవరణలో విలేకర్లతో మాట్లాడారు.
ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గత జీవితం పరిశీలిస్తే ఇటువంటి దారుణాలు వారే చేయించారనటంలో ఎటు సందేహాలు లేవని చెప్పారు. స్పీకర్ నియోజకవర్గం కాకపోయినా నరసరావుపేటలో ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేని కాదని పెత్తనం చేస్తున్నారన్నారు. వ్యాపారవర్గాలపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, ఇది స్పీకర్ ప్రోత్సాహంతోనె జరుగుతోందని విమర్శించారు. దీనికి పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పారు.
ముప్పాళ్ళ మండల ఎంపీపీ ఎన్నిక సందర్బంగా మెజార్టీలేకపోయినా ఎంపీటీసీలను అపహరించిన ఘటనలో అసలైనవారిని వదిలేసి చేసిన అనామకులను పట్టుకొని కేసును నీరుగార్చారన్నారు. పోలీసు వ్యవస్థ కోడెల చెప్పినట్లుగా నడుస్తోందన్నారు. పోలీసులు పాత్రధారులు, సూత్రధారులను సైతం అరెస్టుచేసి తమ నిజాయతీని నిరూపించుకోవాలని కోరారు. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహనరెడ్డి దృష్టికి తీసుకెళ్ళి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయిస్తామని చెప్పారు.
రెండు నెలల నుంచి బెదిరిస్తూనే ఉన్నారు : ఎమ్మెల్యే గోపిరెడ్డి
ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జీసీ టీవీ నిర్వాహకుడు కసిరెడ్డి వెంకటకోటిరెడ్డి రెండు నెలల క్రితం తన వద్దకు వచ్చి కె.చానల్ నిర్వాహకుడు కోడెల శివరామకృష్ణ జీసీ టీవీని తనకు ఇవ్వాలని, అడిగాడని, అందుగు బదులుగా రెండు వర్క్‌లు ఇస్తానని చెబుతున్నాడని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుందని బెదిరించినట్టు చెప్పాడన్నారు.
దీనికి ఒప్పుకోని జీసీ టీవీ కార్యాలయంపై శివరామకృష్ణే దాడిచేయించారని ఆరోపించారు. గతంలో ఎంపీటీసీల అపహరణ, విశాఖపట్నంలో తన కుమారుడిని అపహరించటం, రాత్రికి రాత్రి దాడి చేయటం మూడు సంఘటనలు పరిశీలిస్తే ఒకదానికొకటి, ఒకే వ్యక్తి చేయించినట్లుగా ఉందన్నారు. వ్యాపారులను బెదిరిస్తూ వాటన్నింటిన తన గుప్పిట్లోకి తీసుకోవాలనే ఆలోచనతో తొమ్మిది నెలలుగా నియోజకవర్గంలో అరాచక పాలన నడిపిస్తున్నారన్నారు. జరిగిన దారుణాన్ని అసెంబ్లీలో చర్చకు తీసుకొస్తామనీ, దాడి చేసినవారినీ, చేయించినవారినీ పోలీసులు వెంటనే అరెస్టుచేయాలని డిమాండ్ చేశారు.
సూత్రధారులు, పాత్రధారులను అరెస్టు చేయాలి: జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి
జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ జీసీ టీవీపై దాడి పిరికిపందల చర్యగా అభివర్ణించారు. మెజార్టీలేని చోట ఎంపీటీసీలను అపహరించటం, నరసరావుపేటలో ఎన్‌టీఆర్ విగ్రహాన్ని వారే ధ్వంసం చేసుకోవటం, చిలకలూరిపేటలో విలేఖరి హత్య కేసు మూడింటిలోను చేసిన వారిని మాత్రమే అరెస్టుచేసి చేయించిన వారిని వదిలేసి పోలీసులు కేసులను నీరుగార్చారని విమర్శించారు. రాజధాని విషయంలో కూడా రైతుల ఆస్తులను తగుల పెట్టిన కేసులో అనామకులను అరెస్టుచేశారన్నారు. అర్ధరాత్రి పూట ఆస్తులను ధ్వంసం చేయటం అమానుషమని వ్యాఖ్యానించారు.
ఇటువంటి సంఘటనలో సూత్రధారులు, పాత్రధారులను పట్టుకున్నప్పుడే పోలీసులపై నమ్మకం కలుగుతుందని చెప్పారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని, ప్రజలను కూడగట్టి అధికార పార్టీ ఆగడాలను అరికట్టేందుకు పోరాడతామని హెచ్చరించారు. సమావేశంలో ఎన్‌సీవీ అధినేత నల్లపాటిరాము, జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు వారు జీసీ టీవీ నిర్వాహకుడు కసిరెడ్డి వెంకటకోటిరెడ్డి, కొండా వెంకటేశ్వరరెడ్డిలతో మాట్లాడి దాడిజరిగిన తీరును తెలుసుకున్నారు. ధ్వంసమైన సామగ్రిని పరిశీలించారు. నకరికల్లు మాజీ జెడ్పీటీసీ భవనం రాఘవరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్‌రెడ్డి, పట్టణ మహిళా కన్వీనర్ ఎస్.సుజాతాపాల్, కౌన్సిలర్లు షేక్.అబ్దుల్‌సత్తార్, ఎమ్మెల్యే అధికార ప్రతినిధి వల్లెపు నాగేశ్వరరావు తదితర నాయకులు, కౌన్సిలర్లు వారివెంట ఉన్నారు.