కోడెల శివరామ్ నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం..టౌన్ ప్లానింగ్ అధికారులు ఇచ్చిన నోటీసు
సాక్షి, గుంటూరు: అధికారం అండతో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామకృష్ణ, కుమార్తె పూనాటి విజయలక్ష్మి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. శివరామ్ తన షోరూమ్‌లో టీఆర్ లేకుండా బైక్‌ల విక్రయించి ప్రభుత్వానికి రూ.లక్షల్లో టోకరా వేశాడు. తన తండ్రి అక్రమంగా తెచ్చిపెట్టిన అసెంబ్లీ ఫర్నిచర్‌ను షోరూమ్‌లో ఉపయోగించుకున్నాడు. కే–ట్యాక్స్‌లు, ఉద్యోగాల పేరుతో అనేక మంది నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారాలన్నింటిలో ఇప్పటికే శివరామ్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. ఈయనగారి అక్రమాలు నరసరావుపేట, సత్తెనపల్లిలోనే కాకుండా రాష్ట్రం మొత్తం విస్తరించిన విషయం తెలిసిందే.
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని గుంటూరు నగరంలో అక్రమంగా జీ ప్లస్–2 భవంతి నిర్మాణం చేపట్టారు. ఈ భవన నిర్మాణానికి కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. ఈ వ్యవహారంపై ఈ నెల 20న ‘సాక్షి’ దినపత్రికలో ‘యథేచ్ఛగా అక్రమ నిర్మాణం!’ శీర్షికతో కథనం ప్రచురితం అయింది. ఈ నేపథ్యంలో గుంటూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు కోడెల శివరామ్ నిర్మిస్తున్న అక్రమ నిర్మాణంపై చర్యలకు దిగారు.
గుంటూరు నగరంలోని భాగ్యనగర్ కాలనీ ఎనిమిదో లైన్‌కు శివారులోని ఎక్స్‌టెన్షన్ ఏరియాలో సర్వే నెంబర్ 281/ఏ, 296/ఏ లలో 997 గజాలు, 291/ఏ, 296/డీ లలో 1019 గజాల స్థలం కోడెల శివరామ్‌కు ఉంది. ఈ స్థలంలో సుమారు ఎనిమిది నెలల క్రితం శివరామ్ జీ ప్లస్–2 భవనం నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో తన తండ్రి స్పీకర్ కావడంతో భవనం నిర్మాణానికి కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. స్పీకర్ తనయుడి భవంతి కావడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం చూసీచూడనట్టు వదిలేశారు.
నోటీసు జారీ...
అక్రమ కట్టడం వ్యవహారంపై సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో టౌన్ ప్లానింగ్ అధికారుల్లో చలనం వచ్చింది. కోడెల కుమారుడి అక్రమ నిర్మాణానికి నోటీసు జారీ చేశారు. కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనానికి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 452(1), 428, 461(1), ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ చట్టం 2014 115(1)(2), 116(1) కింద అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అక్రమ కట్టడంపై వివరణ ఇవ్వాలని కోరారు.
బీపీఎస్ దరఖాస్తు తిరస్కరణ..
అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని బీపీఎస్‌లో పెట్టి క్రమబద్ధీకరించేందుకు కోడెల శివరామ్ ప్రయత్నించారు. ఏ విధంగా ఆ భవనం బీపీఎస్ కిందకు వస్తుందో సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో బీపీఎస్ దరఖాస్తును టౌన్ ప్లానింగ్ అధికారులు తిరస్కరించారు. కోడెల శివరామ్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కోసం 2018 సెప్టెంబర్ 3వ తేదీ దరఖాస్తు చేసుకున్నారు. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేసేందుకు సర్వే చేయడం కోసం కార్పొరేషన్ రెవెన్యూ విభాగం సిబ్బంది అంతకు ముందు వరకూ ఆ స్థలం వ్యవసాయ భూమి కింద ఉండేది.
కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేయడానికి ఆ స్థలం పరిశీలించేందుకు గత ఏడాది సెప్టెంబర్‌లో వెళ్లగా అక్కడ భవన నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. కోడెల శివరామ్ మాత్రం గత ఏడాది ఆగస్టు నెలకు ముందే భవన నిర్మాణం ప్రారంభం అయిందని ఆగస్టు నెలాఖరికి శ్లాబ్ పూర్తయిందని బీపీఎస్‌కు దరఖాస్తు చేశారు. అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తారనే భయంతో భవనాన్ని క్రమబద్ధీకరించుకోవడం కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు.
టౌన్ ప్లానింగ్‌లోని కొందరు అధికారులు సైతం ఆయనకు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే డీటీసీపీ (డైరెక్టర్ ఆఫ్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లడంతో టౌన్ ప్లానింగ్ అధికారులపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్టు సమాచారం. కోడెల కుమారుడితో అంటకాగి అక్రమ నిర్మాణాన్ని క్రమబద్ధీకరించడం కోసం ఏ టౌన్ ప్లానింగ్ అధికారి ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment