
కొల్లేరుకు పూర్వ వైభవం
కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని కొల్లేరు ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, వైద్య విద్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు.
మంత్రి కామినేని వెల్లడి
కైకలూరు : కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని కొల్లేరు ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, వైద్య విద్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆయన మంత్రి పదవి స్వీకరించిన తర్వాత ఆదివారం మొదటిసారి కైకలూరు విచ్చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఉప్పుటేరు సరిహద్దు నుంచి కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ర్యాలీగా వచ్చిన ఆయన తన స్వగ్రామమైన వరహాపట్నంలో లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని కైకలూరు మార్కెట్‌యార్డులో జరిగిన అభినందన సభలో మాట్లాడారు. తన తల్లి జీవించి ఉంటే ఇప్పుడు తన ఎదుగుదల చూసి ఎంతో సంతోషపడేదని చెప్పారు. కొల్లేరు ప్రాంత సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానన్నారు. ట్రాక్టర్లతో రైతులు సొంత ప్రయోజనాల కోసం తీసుకువెళ్లే మట్టిపై అధికారులు కలగచేసుకోవద్దని సూచించారు.
ఈ విషయం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లానని, ఆయన మైనింగ్ అధికారులతో మాట్లాడారని చెప్పారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ కొల్లేరు సమస్యల పరిష్కారానికి మంత్రి కామినేనితో కలసి కృషి చేస్తామన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడారు.
కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ కొల్లేరు ఆపరేషన్ సమయంలో ధ్వంసం చేసిన 7500 ఎకరాలను తిరిగి పంపిణీ చేసే విధంగా కృషి చేయాలని కోరారు. టీడీపీ రాష్ట్ర నాయకులు చలమలశెట్టి రామానుజయ్య, మార్కెట్‌యార్డు చైర్మన్ సామర్ల శివకృష్ణ, ఏలూరు పార్టీ నాయకులు ఎస్‌ఆర్‌ఎం బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామినేని వెంకట కృష్ణ ప్రసంగించారు. అనంతరం జిల్లా అధికారుల సమాచారంతో కూడిన ‘విజయ భేరి’ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కామినేని, మాగంటిని గజమాలలతో ఘనంగా సత్కరించారు.