కొల్లేటి తీరంలో నిండు గర్భిణి కన్నీటి ధార
కొల్లేటి తీరంలోని కోమటిలంక వాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆ ఊరికి రోడ్డు మార్గం లేకపోవడమే దీనికి కారణం. ఇక పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లాల్సిన గర్భిణులు పడే ఇబ్బందులు వర్ణనాతీతం. ఆదివారం ఓ మహిళకు అదే పరిస్థితి ఎదురైంది.
కొల్లేటి తీరంలో ఆదివారం ఓ నిండు గర్భిణి ప్రసవ వేదనతో అష్టకష్టాలు పడింది. పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని కోమటిలంకకు చెందిన నిండ్రు మేరీమాత నిండు గర్భిణి. ఆదివారం సాయంత్రం ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆ గ్రామస్తులు ఏ అవసరమున్నా కైకలూరు మండలం ఆటపాకకు రావలసిందే. వారికి రాకపోకలకు ఏకైక మార్గం ఓ చెరువు గట్టు మాత్రమే. సమీపంలో పోల్‌రాజ్ కాల్వ ఉన్నప్పటికి అది గుర్రపుడెక్కతో పూడుకుపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువుగట్టు నడకమార్గం గుంతలమయమైంది.
మరో మార్గంలేక ఆమెను ఆటపాక పక్షుల విహార కేంద్రం చెరువులో నుంచి ఇనుప పడవపై అతి కష్టంమీద ఆటపాక ఒడ్డుకు చేర్చారు. అక్కడినుంచి ఆటోలో కైకలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బిడ్డ అడ్డంతిరిగినట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేయడంతో వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టులో అనూష అనే మహిళకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. సకాలంలో వైద్యం అందక మృతశిశువును బయటకు తీశారు. గ్రామానికి రోడ్డు సౌకర్యంపై పాలకులు ఇప్పటికైనా స్పందించాలి మరి. - కైకలూరు