
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం మార్చి 4న(ఆదివారం) విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో సాయంత్రం 6గంటలకు కొవ్వొత్తులతో తెలిపే నిరసనలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నాలని మాజీ పార్లమెంట్ సభ్యులు, ఉత్తరాంధ్ర చర్చవేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భరంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన అంశాలు నాలుగేళ్లు గడుస్తున్నఅమలుకు నోచుకోని విషయం మనందరీకి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హక్కులు కానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2014లో రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి ఆచరణలో లేవన్నారు.
మనకు ఇచ్చిన హామీలపై నిర్ధిష్టమైన కార్యచరణతో పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అలా లేనిపక్షంలో ఆంధ్రప్రదేశ్ శాశ్వతంగా నష్టపోతుందని కొణతాల పేర్కొన్నారు. ముఖ్యంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఎక్కవగా నష్టపోతారన్నారు. ఈ తరుణంలో జెండాలు పక్కనపెట్టి, ఏకైక ఎజెండాతో సమిష్టిగా పోరాడని పక్షంలో భావితరాలు మనల్ని క్షమించవు అని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాలు, స్వఛ్చంధ సంస్థలు, విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, రైతు, ఉద్యోగ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కవులు, కళాకారులు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, మేధావులు, న్యాయవాదులందరూ పాల్గొన్నాలని కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు.