ఖరీఫ్ సీజన్ మొదలైంది. కోటి ఆశలతో రైతన్న సన్నద్ధమవుతున్నాడు. అయినా సవాలక్ష సమస్యలు... తొలకరి పలకరించినా... రాబోయే కాలంలో తలెత్తే వర్షాభావాన్ని తట్టుకోవాలి. విత్తనాలను సకాలంలో సిద్ధం చేసుకోవాలి. అవసరమైన ఎరువును సమకూర్చుకోవాలి. గత రుణాలు మాఫీకాకున్నా... కొత్తగా అప్పులు చేయాలి. ఇవన్నీ కర్షకుని ముందున్న సవాళ్లు. వీటన్నింటినీ తట్టుకుని మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
శ్రీకాకుళం రూరల్: ఖరీఫ్ సీజన్ వస్తుందంటే చాలు రైతన్న కోటి ఆశలతో సన్నద్ధమవుతాడు. జిల్లాలో ఎక్కువమంది రైతులు సాగు చేసేది వరే. గత ఏడాది ఖరీఫ్ ఆశాజనకంగా సాగినా పలుమార్లు కురిసిన అకాల భారీ వర్షాలు, తుఫాన్లు అన్నదాతను నిండా ముంచాయి. అక్టోబర్‌లో హుద్‌హుద్ అన్నదాత వెన్నువిరిచింది. గత ఏడాది అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పంటంతా నీటి పాలైంది. రైతులవద్ద ఒక్క విత్తనం గింజా మిగలలేదు. దీని ప్రభావం ఈ ఏడాది కనిపించే అవకాశం లేకపోలేదు. విత్తన కొరత ఏర్పడకపోదు.
జిల్లాలో 2.45 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేయాల్సి ఉండగా 2.05 లక్షల హెక్టార్లలో వరి, 10 వేల హెక్టార్లల్లో వేరుశనగ, మిగిలిన విస్తీర్ణంలో గోగు, పప్పు దినుసులు తదితర పంటలు సాగు చేస్తున్నారు. గత ఏడాది 2,05,300 హెక్టార్ల విస్తీర్ణంలో వరి పంట సాగయింది. వరి సాధారణ విస్తీర్ణమైన 2.05 లక్షల హెక్టార్లకు సుమారు 1.50 లక్షల క్వింటాళ్ళ వరి విత్తనాలు అవసరమవుతాయి. సాధారణంగా 30 శాతం అంటే సుమారు 60 వేల క్వింటాళ్ళ విత్తనాలను ప్రభుత్వం అందిస్తుంది. గత ఏడాదే విత్తనాల కోసం రైతులు నానా అవస్థలు పడ్డారు. గత ఏడాది సాగైన విస్తీర్ణం ప్రకారం మరో 15వేల క్వింటాళ్ళు విత్తనాలు అదనంగా అవసరం అవుతాయి.
వ్యవసాయ శాఖ అధికారులు గత అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్ కారణంగా రైతులు విత్తనాలు సొంతంగా సమకూర్చుకోలేకపోవడంతో మరో 11,400 క్వింటాళ్లు కావాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించారు. కానీ వారు 53,593 క్వింటాళ్లే పంపిస్తున్నారు. అంటే మొత్తం సాగుకు అవసరమైన విత్తనాల్లో మూడోవంతు మాత్రమే వస్తాయి. ఇక మిగిలిన విత్తనాలకోసం రైతులు తంటాలు పడాల్సిందే. రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేటు కంపెనీలు విత్తనాల ధరలను ఇష్టారాజ్యం పెంచే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. అందులో నకిలీవి వస్తే ఇక తాము తేరుకోలేమని భయపడుతున్నారు.
పెట్టుబడుల భారం
ఖరీఫ్ మొదలైందంటే పెట్టుబడులు సిద్ధం చేసుకోవాల్సిందే. గతంలో బ్యాంకులనుంచి రుణం తీసుకున్నవారు ఎన్నికలసమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు మాఫీ అవుతుందని ఆశపడ్డారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత అదికాస్తా నీరుగారిపోవడంతో కొత్త రుణాలు మంజూరు కాలేదు. ఫలితంగా ఖరీఫ్ మదుపులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగైదేళ్లుగా పంటలు పాడవడం, గతేడాది హుద్‌హుద్ విలయతాండవం రైతుల్ని పీకల్లోతు అప్పుల్లోకి నెట్టింది. రుణమాఫీ ఆశ తీరకపోవడంతో పెట్టుబడులకోసం తంటాలు పడుతున్నారు.
తొలకరి పలకరించినా...
తొలకరి ఆశాజనకంగానే ఉంది. అయితే రాబోయే కాలంలో వర్షాభావ పరిస్థితులు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ పరిస్థితులకు తగ్గట్టుగా ఇప్పటినుంచే రైతన్నలు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందనడంలో సందేహం లేదు.
కోటి ఆశల ఖరీఫ్
Published Sun, Jun 14 2015 1:04 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement