కృష్ణానదిలో ముగ్గురు విద్యార్థినుల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తూ నీటిలో మునిగారా.. లేక ఆత్మహత్య చేసుకున్నారా.. మరేదైనా జరిగిందా.. అనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. శనివారం కళాశాలకు వెళ్లని ముగ్గురు విద్యార్థినులు మధ్యాహ్నం మూడు గంటల వరకు తాడిగడపలోని నాగలక్ష్మి ఇంటి వద్ద ఉన్నట్లు ఆ ప్రాంతవాసులు చెబుతున్నారు. అనంతరం ముగ్గురు కలిసి బయటకు వెళ్లినట్లు పేర్కొంటున్నారు.
సీతానగరం ఎందుకు వెళ్లినట్లు!
మధ్యాహ్నం మూడు గంటల వరకు తాడిగడపలోనే ఉన్న విద్యార్థినులు గుంటూరు జిల్లా సీతానగరం వైపు ఎందుకు వెళ్లారనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. వారు ముగ్గురే వెళ్లారా.. మరెవరైనా ఉన్నారా.. అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతునట్లు తెలిసింది. సాధారణంగా ఆ ప్రాంతానికి తెలిసిన వారు మినహా కొత్తవారు వెళ్లరు. మహిళలు, విద్యార్థినులు అసలు వెళ్లరు. గతంలో ప్రేమజంటలు ఆ ప్రాంతానికి వెళ్లగా ఆకతాయిలు వేధించడం, అమ్మాయిలపై లైంగిక దాడులకు పాల్పడం, డబ్బు దండుకోవడం వంటి ఘటనలు అనేకం జరిగాయి.
ఈ క్రమంలో తాడేపల్లి పోలీసులు ఆ ప్రాంతంలో ప్రేమికులు సంచరించరాదని, ఇసుక తిన్నెల్లోకి వెళ్లరాదని బోర్డులు సైతం ఏర్పాటుచేశారు. ఇటువంటి ప్రదేశానికి ముగ్గురు విద్యార్థినులు ధైర్యంగా ఎలా వెళ్లగలిగారనేది అంతుచిక్కడం లేదు. స్థానికులు సైతం విద్యార్థినులు ఇసుక తిన్నెల్లో తిరిగినట్లు చెబుతున్నారు. కానీ, ఎంతమంది ఉన్నారనేది స్పష్టంగా వివరించలేకపోతున్నారు.
సమాధానం లేని ప్రశ్నలెన్నో..
ఇసుక తిన్నెలపైకి వెళ్లిన విద్యార్థినులు నీటిలోకి ఎందుకు దిగి ఉంటారనే అనుమానం వ్యక్తమవుతోంది. ఒకవేళ కాళ్లు కడుక్కునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ జారిపడ్డారనుకుంటే ఒక్కరైనా ఒడ్డున ఉండి కేకలు వేసే వారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే యనమలకుదురు నుంచి ఇంతదూరం రావాల్సిన అవసరం లేదని, మధ్యలో ఎన్నో ప్రాంతాలు ఉన్నాయని చెబుతున్నారు. సీతానగరం వైపు ఇసుక తిన్నెలపై రౌడీలు, పోకిరీలు ఎక్కువగా సంచరిస్తుంటారని, ఈ ముగ్గురు వారి బారిన ఏమైనా పడ్డారా.. అని కూడా అనుమానిస్తున్నారు. వారిపై లైంగికదాడి చేసి నీటిలోకి తోసేసి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ విషయం పోస్టుమార్టం నివేదికలో తేలాల్సి ఉంది. ముగ్గురు విద్యార్థినులు కలిసి ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన తాడేపల్లి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాలెన్నో...
Published Mon, Aug 11 2014 3:08 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement