రాజుకుంటున్న కృష్ణపట్నం
సాక్షి, హైదరాబాద్: కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం వివాదం మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. కృష్ణపట్నం విద్యుత్‌లో తెలంగాణకు వాటా లేదని, షేర్లు మాత్రమే ఉన్నాయని ఏపీ విద్యుత్ అధికారులు ప్రాజెక్టు పాలక మండలి సమావేశంలో చెప్పడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ వివాదం అంత సులువుగా తేలేలా లేదన్న ఉద్దేశంతో న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. దీనిపై తెలంగాణ విద్యుత్ అధికారులు అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డితో సంప్రదించినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టులో తెలంగాణ జెన్‌కో, రెండు డిస్కమ్‌లకు వాటాలున్న విషయం స్పష్టంగా ఉన్నందున.. కోర్టులో తేల్చుకుంటేనే మంచిదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు సమాచారం. కోర్టులో వ్యాజ్యం వేయడం కోసం అన్ని రకాల పత్రాలను సిద్ధం చేసినట్లు ఓ ఉన్నతాధికారి వివరించారు. అయితే.. దీనికి ప్రతిగా ఏపీ జెన్‌కో కూడా కౌంటర్‌తో సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.
వివాదం కోర్టుకు వెళితే ఇప్పటికిప్పుడు వాణిజ్య ఉత్పత్తి (సీవోడీ) ప్రారంభించాల్సిన అవసరం లేదని, అప్పటివరకు ట్రయల్ రన్ పేరుతో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను తామే వినియోగించుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. జీవో 29 ప్రకారం కోర్టుకెళ్లినా.. 23.84 శాతం విద్యుత్ మాత్రమే తెలంగాణకు ఇవ్వాల్సి వస్తుందని, సగం వాటా వివాదం సమసిపోతుందని భావిస్తున్నారు. లేదా జీవో ప్రకారం తెలంగాణ వాటాలను అమ్ముకోవడం తప్ప మరో మార్గం ఉండదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారని ఆంధ్రా అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏపీయే వివాదాస్పదం చేస్తోంది..
కృష్ణపట్నం వివాదాన్ని కలసి పరిష్కరించుకోవాలనే తాము భావిస్తున్నట్టు తెలంగాణ అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే బోర్డు మీటింగ్‌లో ప్రస్తావించామని... కానీ దానిని తిరస్కరించడాన్ని బట్టి, ఏపీనే వివాదాస్పదం చేస్తోందనే వాదనను కోర్టు దృష్టికి తేవాలని వారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ బోర్డు మీటింగ్‌కు ముందు తెలంగాణ జెన్‌కో అధికారులు న్యాయ నిపుణులతో చర్చించారు. ఆ క్రమంలోనే తొలుత ఏపీ జెన్‌కోకు లేఖ రాశారు. కృష్ణపట్నంలో తమకు రావల్సిన వాటా ఇవ్వాలని, వాణిజ్య ఉత్పత్తి తేదీని ప్రకటించాలని కోరారు. కానీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఈఆర్‌సీ ఆమోదించలేదు కాబట్టి, జీవో 29 ప్రకారం కృష్ణపట్నం తమదేనని ఏపీ అధికారులు వెల్లడించారు. వాటాలున్నాయి కాబట్టి లాభాల్లో మాత్రమే వాటా ఇస్తామన్నారు.
270 మిలియన్ యూనిట్లు నష్టం!
కృష్ణపట్నం విషయంలో తమకు జరుగుతున్న అన్యాయంపై తెలంగాణ జెన్‌కో సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేసింది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ దాదాపు రూ. 100 కోట్ల మేర నష్టపోయినట్టు టీ జెన్‌కో చెబుతోంది. కృష్ణపట్నంలో ఉత్పత్తయిన 500 మిలియన్ యూనిట్లలో 270 మిలియన్ యూనిట్లు తెలంగాణకు ఇవ్వలేదని స్పష్టం చేస్తోంది. అన్నింటిలోనూ వాటాలున్నప్పడు కృష్ణపట్నంలోనూ వాటా ఉంటుందనే అంశాన్ని కోర్టు దృష్టికి తెచ్చేందుకు సిద్ధమైంది.
చూపంతా జీవో 29 పైనే..
కృష్ణపట్నం విద్యుత్ విషయమై ఇరు రాష్ట్రాలకు ఇప్పుడు జీవో 29 కీలకం కాబోతోంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మేలో ఈ జీవోను ఇచ్చారు. అప్పులు, ఆస్తులను పంచే క్రమంలో ఏపీజెన్‌కో పరిధిలోని ఇతర ప్రాజెక్టుల మాదిరిగానే కృష్ణపట్నంలోని మూలధనంలో తెలంగాణకు 23.84 శాతం, మిగతాది ఏపీ జెన్‌కోకు కేటాయించారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి విద్యుదుత్పత్తిలో వాటా అంశంపై స్పష్టత లేదు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఈఆర్‌సీ ఆమోదించలేదని, కాబట్టి ఉత్పత్తి మొత్తం తమకే దక్కుతుందని ఏపీ సర్కారు అంటోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు మొదటి దశలోని 800 మెగావాట్ల ఉత్పత్తిలో ఇన్‌ఫర్మ్ (కమర్షియల్‌గా చెప్పకముందు జరిగే ఉత్పత్తి) విద్యుదుత్పత్తిని ఏపీ జెన్‌కో వాడుకుంటోంది. ప్రాజెక్టులో రోజుకో సాంకేతిక సమస్య వస్తోందని, అందుకే వాణిజ్య ఉత్పత్తి తేదీని వెల్లడించడం లేదని చెబుతోంది.
మరోవైపు... తమకు వాటా ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఏపీ ఇలా చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కేంద్ర విద్యుత్ మండలి నిబంధనల ప్రకారం ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించి ఆరు నెలలు దాటగానే వాణిజ్య విద్యుదుత్పత్తిగా పేర్కొంటారు. ఈ లెక్కన మార్చి 31 నుంచే అది అమల్లోకి రావాలి. కానీ సాంకేతిక కారణాల రీత్యా ప్లాంట్ పీఎల్‌ఎఫ్ పూర్తిస్థాయిలో లేదని ఏపీ జెన్‌కో అంటోంది. ఇలా ఎవరి వాదన వారు వినిపిస్తుండటంతో తెలంగాణ కోర్టును ఆశ్రయించే ఏర్పాట్లలో ఉంది.