సాక్షి, నెల్లూరు: నేషనల్ హైవే 67గా ప్రకటించిన కృష్ణపట్నం - బళ్లారి రోడు ్డ పనులు ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడంలేదు. అసలు పనుల మంజూరే ప్రశ్నార్థకంగా మారింది. రోడ్డును రోడ్ల భవనాల శాఖ నేషన ల్ హైవేకు అప్పగించడం పూర్తయినా ప్రతిపాదనలు సిద్ధం కాలేదు. ఇవి కేంద్రప్రభుత్వానికి వెళ్లడం, వారు అంగీకరించడమనే తంతు ఇంకా మిగిలే ఉంది.
దీంతో రోడ్డుపనులకు మోక్షం ఎన్నడనేది ప్రశ్నార్థకంగా మారింది. కృష్ణపట్నం - బళ్లారి రోడ్డును నేషనల్ హైవే 67గా మారుస్తున్నట్టు ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత ఆ సంగతి పెద్దగా పట్టించుకోలేదు. జిల్లాలోని కృష్ణపట్నం నుంచి వైఎస్సార్ జిల్లా మీదుగా అనంతపురం జిల్లాలోని తాడిపత్రి వరకూ 400 కిలోమీటర్ల మేర రోడ్డును విస్తరించాలని ఏహెచ్ నిర్ణయించింది. జిల్లా పరిధిలో ఈ రోడ్డు 130 కిలోమీటర్లు, వైఎస్సార్ జిల్లాలో 240 కిలోమీటర్లు, అనంతపురం జిల్లా పరిధిలో 30 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉంది.
ప్రభుత్వ ప్రకటన అనంతరం దాదాపు ఏడాది తర్వాత రోడ్లుభవనాల శాఖ ఈ మార్గాన్ని నేషనల్ హైవేకు ఈ ఏడాది ఆగస్టు 29న అప్పగించింది. అనంతరం ఎన్‌హెచ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం 7 మీటర్ల వెడల్పు ఉన్న ఈ రోడ్డును 10 మీటర్ల మేర విస్తరించాల్సి ఉంది. ఇందులో భాగంగా ఇరువైపులా 3 మీటర్ల మేర రోడ్డును హార్డుషోల్డర్‌గా మార్చనున్నారు. అనంతరం మొత్తంరోడ్డును స్ట్రెంతన్ చేయనున్నారు. ఇందు కోసం ఒక కిలోమీటరుకు సుమారు రెండు కోట్ల మేర ఖర్చు చేయనున్నారు. ఈ లెక్కన రూ.800 కోట్లకు పైనే నిధులు ఖర్చు చేయనున్నారు.
డిసెంబర్ నాటికి ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రప్రభుత్వానికి పంపనున్నట్టు నేషనల్ హైవే ఇంజనీరింగ్ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. అయితే ప్రతిపాదనలు అప్పటికి సిద్ధమయ్యే పరిస్థితి కానరావడంలేదు. రానున్నది ఎన్నికల సీజన్ కావడంతో బహుశా ఎన్నికలకు ముందు రోడ్డుకు నిధులు మంజూరయ్యే అవకాశం లేదన్నది కొందరు అధికారుల అభిప్రాయం. రాబోయే కొత్తప్రభుత్వంలోనే రోడ్డుకు నిధులు మంజూరు కావచ్చన్నది వారి అభిప్రాయం. దీంతో ఇప్పట్లో ఈ నేషనల్ హైవే పనులు పనులు మొదలయ్యేలా లేవు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, కేంద్రమంత్రులు,అధికార పార్టీ ముఖ్యనేతలు స్పందించి తక్షణం నేషనల్ హైవేకు నిధులు మంజూరు చేయించి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
అతీగతి లేదు..
Published Sat, Nov 16 2013 3:53 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement