ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హోం మంత్రి ఎన్. చినరాజప్ప
రాజమండ్రి : తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే హక్కు ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి చినరాజప్పకు లేదని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుడుపూడి చిట్టబ్బాయి పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కలలో ప్రత్యర్థుల దాడిలో మృతి చెందిన కృష్ణారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లిన సందర్భాన్ని పురస్కరించుకుని చినరాజప్ప చేసిన వ్యాఖ్యలను చిట్టబ్బాయి బుధవారం తీవ్రంగా ఖండించారు.
గొట్టుముక్కలలో జగన్ చెప్పింది అక్షర సత్యమని, టీడీపీ అధికారాన్ని, పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని అరాచకాలు సృష్టిస్తోందని అన్నారు. టీడీపీ అధికారం చేపట్టాక తమ పార్టీ నేతలు, అభిమానులు, సాధారణ ప్రజలు 19 మంది హత్యకు గురయ్యారన్నారు. హత్యారాజకీయాల గురించి మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు లేదన్నారు. టీడీపీ నేతలు ఎన్ని కుతంత్రాలు పన్నినా, హత్యా రాజకీయాలకు పాల్పడ్డా తమ పార్టీ శ్రేణులు భయపడరని పేర్కొన్నారు. వాటన్నింటినీ తిప్పికొడుతూ ప్రజల పక్షాన పోరాడతామన్నారు. ఐదేళ్లు పరిపాలించమని ప్రజలు అధికారం ఇస్తే వారినే భయభ్రాంతులను చేస్తున్నారన్నారు. ప్రజలు ఈ చర్యలను గమనిస్తున్నారని హెచ్చరించారు.