కాకినాడ: తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో పోలీసు రాజ్యం నడుస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై రామచంద్రపురం ఎస్సై నాగరాజు చేసిన దౌర్జన్యమే ఇందుకు నిదర్శనమన్నారు. సోమవారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ మానవ హక్కులను ఉల్లంఘిస్తూ పోలీసులు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. రోడ్డుపక్కన కారు నిలిపిన రాజాను కారులో నుంచి బయటకు లాగి కాలర్ పట్టుకుని ఈడ్చుకు వెళ్తూ స్టేషన్‌లో లాఠీ విరిగేలా కొట్టిన తీరు చూస్తే పోలీసుల వ్యవహార శైలి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందన్నారు.
జిల్లాలో రాజకీయ నేపథ్యం ఉన్న జక్కంపూడి కుటుంబానికి చెందిన రాజాపైనే ఇలా వ్యవహరిస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని కన్నబాబు అన్నారు. ఇలా దౌర్జన్యంగా వ్యవహరించాలని పోలీసులకు ఏమైనా ప్రత్యేక అధికారాలు ఇస్తే చూపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను కేవలం జక్కంపూడి రాజా వ్యవహారంగా కాకుండా ఓ సాధారణ పౌరునికి జరిగిన అంశంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. దౌర్జన్యం చేసిన ఎస్సైపై చర్య తీసుకోవల్సిందిపోయి విధి నిర్వహణలో ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్‌పై రాజా దౌర్జన్యానికి దిగారంటూ తప్పుడు కేసు బనాయిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి చర్యలను తమ పార్టీ చూస్తూ ఊరుకోదని, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించేందుకు వెనుకాడబోదని పేర్కొన్నారు. శృతిమించి ప్రవర్తించిన ఎస్సైపై తక్షణమే సెక్షన్ 307 కింద హత్యానేరం కేసు నమోదు చేసి వెంటనే సస్పెండ్ చేయాలని కన్నబాబు డిమాండ్ చేశారు. హోం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు.
కొద్దిరోజుల క్రితం వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడిగా ఉన్న 65 ఏళ్ల వృద్ధుడిపై రౌడీషీట్ తెరచి ఆత్మహత్యకు కారకులయ్యారన్నారు. జిల్లాలో మానవ హక్కులకు పూర్తిగా విఘాతం కలుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ కేశనేని ఐపీఎస్ అధికారిపై దౌర్జన్యం చేసినా, ఎమ్మెల్యే చింతమనేని, మరో నేత బొండా ఉమ దుందుడుకుగా వ్యవహరించినా పోలీసులకు చీమ కుట్టినట్టు కూడా ఉండడంలేదని, అదే తమ పార్టీ కార్యకర్తలపై మాత్రం అత్యుత్సాహంతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. కరపలో గత ఏడాది కాపు ఉద్యమ నేత ముద్రగడకు మద్దతుగా ర్యాలీకి సిద్ధమయ్యారన్న నెపంతో 21 మందిపై తాజాగా పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కాపులపైనే ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్ మాట్లాడుతూ రాజాపై ఎస్సై నాగరాజు మృగంలా ప్రవర్తించాడని ధ్వజమెత్తారు. కరడుగట్టిన నేరస్తులు, హత్యలు చేసిన వారిపై కూడా పోలీసులు ఇంతదారుణంగా ప్రవర్తించరన్నారు. పోలీసులు ప్రజలతో స్నేహబంధంతో ఉంటా రని ఓ వైపు ఎస్పీ చెబుతుంటే పోలీసులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అనంతబాబు మండి పడ్డారు. అసలు చెయ్యి చేసుకునే అధికారం ఏ చట్టంలో ఉందో వివరించాలని డిమాండ్ చేశారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొందన్నారు. తక్షణమే ఎస్సైని సస్పెండ్ చేయకపోతే జిల్లాలో పోలీసు అధికారులను నిర్బంధించేందుకు వెనుకాడబోమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment