కాపుల సమస్యను సృష్టించింది బాబే
కురసాల కన్నబాబు
సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చుతానని 2014 ఎన్నికల ముందు వాగ్దానం చేసి, మూడేళ్లు గడిచినా అమలు చేయలేక రాష్ట్రంలో అశాంతికి కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. కాపు రిజర్వేషన్ల సమస్య అనేది పోలీసులను ప్రయోగించి పరిష్కరించేది కాదని, ఇది శాంతి భద్రతల సమస్య అంతకంటే కాదని చెప్పారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తూర్పు గోదావరి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వేలాది మంది పోలీసులను అడుగడుగునా మొహరించి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోందని విమర్శించారు.
ముద్రగడ పాదయాత్రలో ఎవరూ పాల్గొన కూడదని, పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం దారుణమన్నారు. మంజునాథ కమిషన్ నివేదిక ఎప్పుడొస్తుందో చెప్పకుండా కాపుల గొంతు నొక్కడం సరికాదన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై ఎవరు ఉద్యమాలు చేపట్టినా వైఎస్సార్‌సీపీ మద్దతిస్తుందని చెప్పారు. కాపుల సమస్యలను పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు పోలీసులను ప్రయోగిస్తున్నారని, కులాల మధ్య గొడవలు సృష్టించే నీచమైన చరిత్ర టీడీపీదేనన్నారు.