లగడపాటి సర్వేకు ఎల్లో కలరింగ్!
లగడపాటి సర్వేకు ఎల్లో కలరింగ్!
Published Sun, May 4 2014 11:12 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM
సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనాన్ని, ప్రజల ఆదరణను తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ వేస్తున్న చవకబారు ఎత్తుగడలు ప్రజల్ని విస్తుపోయేలా చేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప్రజలకు ఉన్న బంధాన్ని తెంచేందుకు చేస్తున్న పలు ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. రాష్ట్ర విభజన అంశంలో రెండు కళ్ల సిద్దాంతంతో సీమాంధ్రలో దాదాపు తుడుచుకుపెట్టుకుపోయిన తెలుగుదేశం అభ్యర్ధులను అరువు తెచ్చుకుని పోటీలో దిగింది. అయినా తెలుగుదేశం పార్టీపై నమ్మకం, విశ్వసనీయత కలుగకపోవడంతో అనేక దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు.
ఇటీవల సినీనటుడు పవన్ కళ్యాణ్ తో చేసిన ప్రయోగం దారుణంగా ఫ్లాప్ అవ్వడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దాంతో ఏం చేయాలో తెలియక 'సర్వే'పాటి రాజగోపాల్ హడావిడిగా రంగంలోకి దించారు. ప్రెస్ మీట్ పేరుతో లగడపాటి సర్వేలను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చెప్పేలా నాటకమాడించారు. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని.. సీమాంధ్రలో తెలుగుదేశం, బీజేపీల కూటమి విజయం సాధిస్తుందని లగడపాటి జోస్యం చెప్పారు. ఎన్నికల నిబంధనలు కారణాల వల్ల పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నానని చివరగా ఓ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.
రాష్ట్ర విభజన కారణంగా రాజకీయాలకు స్వస్తి చెప్పిన లగడపాటి రాజగోపాల్.. ప్రస్తుతం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన తెలుగుదేశం పార్టీకి వంత పాడుతున్నారు. రెండు కళ్ల సిద్దాంతంతో అడ్డగోలు విభజనకు కారణమైన టీడీపీని నిలదీయాల్సి పోయి... కీలక ఎన్నికల తరుణంలో అదేపార్టీకి అనుకూల ప్రచారానికి తెరలేపారు. ఎన్ని ఎత్తుగడలు, అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో ప్రజాతీర్పును ఇలాంటి చవకబారు చేష్టలతో అడ్డుకోలేమన్నది వారికి కూడా తెలియందే కాదు.
అయినా ఏదో విధంగా లబ్ది పొందాలనే ఆశతో 'ఆంధ్రా ఆక్టోపస్' లగడపాటిని కూడా చంద్రబాబు వాడుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. సర్వేలు, పొత్తులు, సినీ గ్లామర్ లాంటి అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయలేదని సగటు ఓటరు అభిప్రాయం. నిర్ణయం ఇప్పటికే జరిగిపోయింది. తీర్పు ఇవ్వడానికి ఓటర్లు మే 7 తేది కోసం వేచి చూస్తున్నారు. ఎన్ని ఎత్తులు వేసినా, లగడపాటి సర్వే ప్రభావం సగటు ఓటరు తీర్పుపై ఉండదనేది త్వరలోనే అర్దమవ్వడం ఖాయం.
Advertisement