పై-లీన్ తుఫాను విరుచుకుపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల్లోని దాదాపు మూడు లక్షల మందికి పైగా ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున భారీ విధ్వంసం జరుగుతుందన్న ప్రచారంతో ప్రజలను తరలించారు. రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే పెనుగాలులు, వర్షం మొదలయ్యాయి. తీవ్ర పెను తుఫాను పై-లీన్ శనివారం సాయంత్రం 6-8 గంటల మధ్యలో తీరాన్ని దాటొచ్చని, ఆ సమయంలో దాని వేగం గంటకు 210-220 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఆ సమయంలో దాదాపు ఆరు గంటల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, ఒడిషా తీరప్రాంతాల్లో శుక్రవారం రాత్రికే ఈదురు గాలులతో దాదాపు 8-10 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఒడిషాలోని గంజాం, ఖుర్దా, పూరీ, జగత్సింగ్పూర్ జిల్లాల్లో పెనుగాఉలుల వీచే ప్రమాదం ఉంది. దీంతో ఒడిషాలో మూడు లక్షల మందిని, ఉత్తర కోస్తాంధ్రలో 64 వేల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. త్రివిధ దళాలతో పాటు.. జాతీయ విపత్తు నివారణ దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు కూడా రక్షణ చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఇప్పటికే ఒడిషాలోని పలు ప్రాంతాల్లో గాలుల వేగం పెరిగిందని ప్రత్యేక సహాయ కమిషనర్ ప్రదీప్ కుమార్ మొహాపాత్ర తెలిపారు. గంజాంలో గాలుల వేగం గంటకు 60-80 కిలోమీటర్లుంది. గంజాం జిల్లాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటుతుందని భావిస్తుండటంతో అక్కడ భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. గంజాం, గజపతి, ఖోర్దా, పూరీ, జగత్సింగ్ పూర్ జిల్లాల్లో ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పూరీ సమీపంలోని ఆస్త్రాంగా ప్రాంతం నుంచి వేటకు వెళ్లిన 18 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు.
పై-లీన్ తుఫాను నేపథ్యం: 3.6 లక్షల మంది తరలింపు
Published Sat, Oct 12 2013 1:35 PM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM
Advertisement
Advertisement