'ఎన్టీఆర్ పేరు చూసి ప్రజలు ఓట్లు వేశారు'
హైదరాబాద్ : ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును చూసి కాదని ఎన్టీఆర్ పేరును చూసి ఓట్లు వేశారని ఎన్టీఆర్ సతీమణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీ పార్వతి అన్నారు. ఎన్టీఆర్ 91వ జయంతి సందర్భంగా ఆమె బుధవారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్కు నివాళులు అర్పించటం కాదని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం చిత్తశుద్దితో ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ... ప్రజల పక్షాన పోరాడతామని లక్ష్మీపార్వతి తెలిపారు. ప్రజల సంక్షేమానికి తమవంతు సహకారం అందిస్తామని ఆమె అన్నారు. రాష్ట్రం రెండుగా విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలు ఎప్పుడూ కలిసి ఉండాలన్నారు. మోడీ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించాలని లక్ష్మీపార్వతి కోరారు. ఈసారి అయినా ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఇందుకోసం చంద్రబాబు చిత్తశుద్ధితో పోరాడాలని అన్నారు.