సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దీపం పథకాన్ని తమ్ముళ్లు సొంతం చేసుకుంటున్నారు. నిరుపేదలకు ప్రభుత్వం మంజూరుచేసిన గ్యాస్ కనెక్షన్లను కొందరు టీడీపీ నాయకులు పంచుకుంటున్నారు. ఎన్నికల్లో పనిచేసిన వారికి.., కార్యకర్తలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అర్హులకు అందాల్సిన దీపం కనెక్షన్లను తమ్ముళ్లు దారిమళ్లించడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. ప్రభుత్వం జిల్లాకు దీపం పథకం కింద 26 వేల గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేసింది. వాటిని మండలాల వారీగా కేటాయించారు.
గ్యాస్ కనెక్షన్లు కొనుగోలు చేసుకునే స్తోమత లేనివారిని గుర్తించి వారికి ఇవ్వాలనేది నిబంధన. అందుకు అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు గ్రామసభలు నిర్వహించి అర్హులను గుర్తించాల్సి ఉంది. ఆ మేరకు అధికారులు ఈనెల 20 నుంచి గ్రామసభలు నిర్వహిస్తున్నారు. అయితే అనేకచోట్ల గ్రామసభలు నిర్వహించకనే జన్మభూమి కమిటీలోని టీడీపీ నాయకులు చెప్పిన వారిని ఎంపిక చేస్తున్నారు. దగదర్తి మండలం పరిధిలో టీడీపీ నాయకులు కొందరు కేవలం పార్టీ కార్యకర్తలు, నాయకుల పేర్లు జాబితాలో చేర్పిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మండలానికి 230 గ్యాస్ కనెక్షన్లు మంజూరైతే.. ఎక్కువ శాతం టీడీపీ నేతలు, వారి అనుచరులనే ఎంపిక చేసుకుంటున్నట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వెంకటగిరి, ఉదయగిరి, కోవూరు, సూళ్లూరుపేట, కావలి తదితర నియోజకవర్గాల పరిధిలో లబ్ధిదారుల ఎంపిక అంతా టీడీపీ నేతల ఇష్టారాజ్యంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కనెక్షన్.. కలెక్షన్
లబ్ధిదారుల ఎంపికే లోపభూయిష్టంగా జరుగుతుందనే విమర్శలు వినిపిస్తుంటే.. ఎంపిక చేసిన లబ్ధిదారుల నుంచి కనెక్షన్లకు పెద్దఎత్తున వసూళ్లకు దిగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం దీపం పథకం కింద మంజూరు చేసిన గ్యాస్ కనెక్షన్లను నిరుపేదలు, వికలాంగులు, వితంతువులకు ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. గ్యాస్ తీసుకున్న లబ్ధిదారుడు రూ.450 చెల్లిస్తే రెగ్యులేటర్, వైరు, లైటరు ఇస్తారు. అయితే టీడీపీ నేతలు కొందరు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
వెంకటగిరి పరిధిలో సుమతి, లక్ష్మీదేవి, కుమారి, భారతమ్మ, విజయలక్ష్మి తదితరుల నుంచి టీడీపీ నేతలు కొందరు రూ.1,500 చొప్పున వసూలు చేసుకున్నట్లు తెలిపారు. ఇలా జిల్లావ్యాప్తంగా స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొందరు గ్యాస్ కనెక్షన్ల పేరుతో కలెక్షన్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బడా నాయకులు సైతం బినామీ పేర్లతో గ్యాస్ కనెక్షన్లను సొంతం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారని రెవెన్యూ అధికారి ఒకరు స్పష్టం చేశారు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తామంతా నోరెత్తలేని పరిస్థితి అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలకు కొందరు ఐకేపీ సిబ్బంది పూర్తి సహకారం అందిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టిసారించి నిరుపేదల కోసం మంజూరు చేసిన దీపం పథకాన్ని లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
‘దీపం’ తమ్ముళ్లకే
Published Wed, Feb 25 2015 2:49 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement