భూముల్ని లాక్కున్నారు.. బికారుల్ని చేశారు | Land Acquisition for polavaram project | Sakshi
Sakshi News home page

భూముల్ని లాక్కున్నారు.. బికారుల్ని చేశారు

Published Sat, Dec 27 2014 2:55 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

Land Acquisition for polavaram project

‘పోలవరం’ కోసం మీ భూముల్ని త్యాగం చేయండి. బదులుగా భూమికి భూమి ఇస్తాం. మీ బతుకుల్లో సౌభాగ్యం నింపుతాం’ అన్న అధికారులు చివరికి గిరిజన రైతుల్ని బికారులుగా మిగిల్చారు. ఎకరం, రెండెకరాలు ఉన్న బక్క రైతుల నుంచి భూమిని  ప్రాజెక్టు పవర్‌హౌస్ కోసం లాగేసుకున్నాక.. నిబంధనల ప్రకారం భూమికి భూమి ఇవ్వలేదు. చేతిలో చిల్లిగవ్వ లేక, బువ్వకు గతి లేక నిర్వాసిత రైతులు కూలి పనుల కోసం.. ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వస్తోంది.
 
అంగులూరు గిరిజన రైతుల గోడు
‘పోలవరం’ కోసం భూసేకరణ
నెరవేరని ‘భూమికి భూమి’ హామీ
ఇచ్చిన సొమ్మంతా ఇంటి నిర్మాణానికే
బతుకుతెరువుకు కూలికి వెళుతున్న నిర్వాసితులు
నాలుగేళ్లుగా నరకం...
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే దేవీపట్నం మండలం అంగులూరులో గిరిజనులను ఖాళీ చేయించారు. సుమారు 50 కుటుంబాలకు ఇళ్లు వాకిలి లేకుండా చేశారు. వారి భూములను స్వాధీనం చేసుకుని, పవర్‌హౌస్ నిర్మాణానికి ప్రతిపాదించారు. ఆ భూముల్లో పెద్ద పెద్ద గోతులు కూడా తవ్వేశారు. ప్రాజెక్టు నిర్మాణ నిబంధనల ప్రకారం భూములు కోల్పోయిన రైతులకు భూమికి భూమి ఇవ్వాలి. ఆ భూమిలో సేద్యానికి అనువుగా అన్ని వసతులు కల్పించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది. కానీ అంగులూరు గిరిజన రైతుల పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారని గిరిజన సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాన్ని ఖాళీ చేసి భూమికి, సాగుకు దూరమై నాలుగేళ్లుపైనే అవుతున్నా ఇప్పటికీ రంపచోడవరం ఐటీడీఏ అధికారులు భూమికి భూమి ఇవ్వలేదు. ప్రాజెక్టు నిర్మాణం ఇంకా జరగనందున ఆ భూముల్లో సాగుచేసుకుందామంటే ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. నిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస కాలనీకి తరలివెళ్లిన గిరిజన రైతులు ఆ భూముల్లో సాగుకు సిద్ధమవగా  అధికారులు అడ్డుకున్నారు. భూముల్లో సాగుచేయకుండా ముందుచూపుతో భారీ యంత్రాలతో పెద్ద పెద్ద గోతులు తవ్వారు.
 
చేతిలో చిల్లిగవ్వ లేదు..
అధికారులు అంగులూరులో పునరావాస కాలనీ నిర్మించి చేతులు దులిపేసుకున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి కుటుంబానికి రూ.50వేలు, టాయిలెట్లకు రూ.3 వేలు, రవాణా చార్జీలుగా రూ.5000,ప్రత్యేక జీవనభృతిగా రూ.56 వేలు, నిర్వాసిత భృతిగా రూ.26,880 అందచేశారు. అయితే రూ.50 వేలతో ఇంటి నిర్మాణం పూర్తి కాక మిగిలిన సొమ్ములనూ అందుకే వెచ్చించాల్సి వచ్చింది.

దీనివల్ల కాలనీకి వెళ్లగలిగారే తప్ప పొట్ట గడవడానికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. ఉన్న భూములు కోల్పోయి, సర్కార్ ఇవ్వాల్సిన భూమి ఇవ్వకపోవడంతో సాగుకు దూరమై కూలి పనులకు వెళుతున్నామని గిరిజన రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. బతుకు కష్టమైపోతోందని వచ్చే పోయే అధికారులందరికీ మొరబెట్టుకుంటున్నారు. భూమిలో పంట సాగు చేయనందుకు నష్టపరిహారం ఇస్తామన్నా అది లేదని, కాలనీ దగ్గర కాకుండా ఎక్కడో భూమి చూపితే ఎలా సాగు చేసుకుంటామని వాపోతున్నారు. కాలనీకి సమీపంలో 20 ఎకరాల భూమి ఉందని, దానికి మరో 30 ఎకరాలు భూమిని కొనుగోలు చేసి ఇవ్వాలని కోరుతున్నారు.
 
మొరపెట్టుకున్నా ఫలితం సున్నా
ఇటీవల కలెక్టర్ నీతూప్రసాద్, ఐటీడీఏ పీఓ గంధం చంద్రుడు, ఆర్డీఓ శంకర్‌ప్రసాద్ తదితరులు పలు సందర్భాల్లో నిర్వాసితులతో మాట్లాడి వెళ్లినా ఫలితం లేదు. నిర్వాసిత గిరిజన రైతులు గత్యంతరం లేక సీతానగరం, కోరుకొండ మండలాల పరిధిలో పురుషోత్తపట్నం, ముగ్గుళ్ల తదితర ఏటిపట్టు గ్రామాలకు కూలి పనులకు వెళుతున్నారు. ఎకరం సాగు ద్వారా ప్రతి సీజన్‌లో రూ.30 వేలు ఆదాయం వచ్చేదని, నాలుగేళ్లుగా ఆ రాబడి కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సర్కారు గిరిజన రైతుల జీవన ఘోషను చెవిన పెట్టాలి. వారికి నిబంధనల ప్రకారం చేయాల్సిన మేలును చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement