హరిత వనంలో అగ్ని కణం!
అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ పల్లెలో ఉన్నట్టుండి కలకలం రేగింది. మొదట అధికారులు.. ఆ తర్వాత పోలీసుల దండు మోహరించడంతో ప్రశాంతత చెదిరిపోయింది.నివురుగప్పిన నిప్పులా ఉన్న భూ వివాదం మళ్లీ రాజుకుంది. పంట కోతకు అధికారుల యత్నాలు.. రైతుల ప్రతిఘటన.. పోలీసుల అడ్డగింపు.. ఇద్దరి ఆత్మహత్యాయత్నం వంటి ఘటనలతో లింగాలవలస ఉద్రిక్తంగా మారింది. చివరికి ఉన్నతాధికారుల జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగింది.
లింగాలవలస (టెక్కలి) :వివాదంలో ఉన్న భూమిలో బీసీ రైతులు సాగు చేసిన వరి పంటను కోయించి, స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించడం టెక్కలి మండలం లింగాలవలసను దశాబ్దాలుగా నలుగుతున్న భూ వివాదాన్ని మరోసారి రాజేసింది. ఈ గ్రామానికి చెందిన దళిత, బీసీ(కాళింగ) రైతుల మధ్య 13.96 ఎకరాల భూముల విషయంలో దశాబ్దాలుగా వివాదాలు సాగుతున్నాయి. గొడవలు కూడా జరిగాయి. కోర్టు కేసులూ ఉన్నాయి. కాగా ఈ ఏడాది ఖరీఫ్ సీజనులో ఈ భూముల్లోని 3.20 ఎకరాల్లో బీసీ రైతులు వరి సాగు చేశారు. అది ప్రస్తుతం కోతకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఆ పంటను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం ఉదయం గ్రామానికి చేరుకొని కూలీలను పెట్టి పంట కోయించడానికి ప్రయత్నించారు. దీన్ని బీసీ రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. రేయింబళ్లు తాము కష్టపడి సాగు చేసిన పంటను ఎలా తీసుకుపోతారంటూ ఆ వర్గానికి చెందిన మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని అధికారులు నిలదీశారు.
దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెవెన్యూ అధికారులు పరిస్థితిని కాశీబుగ్గ డీఎస్పీ ఎం.దేవప్రసాద్‌కు వివరించారు. దాంతో ఆయన ఆధ్వర్యంలో టెక్కలి ఇన్‌చార్జి సీఐ, కాశీబుగ్గ సీఐ ఎం.వి.వి.రమణమూర్తి, కొండాలతోపాటు సుమారు 150 మంది పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. రైతులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. దాంతో రైతులు మరింత రెచ్చిపోయారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య వాగ్వాదం, తోపులాటలు చోటు చేసున్నాయి. అన్యాయంగా తమ పంటను దోచుకుపోతున్నారంటూ బీసీ రైతులు ఆరోపించారు. రాజకీయ కక్షతో టీడీపీవారే ఇటువంటి చర్యలకు అధికారులను పురిగొల్పుతున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో సంపతిరావు చిరంజీవులు, సంపతిరావు కాంతమ్మలు తమ వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. దీన్ని గమనించిన పోలీసులు వారిని అడ్డుకొని డబ్బాలు లాక్కున్నారు.
గ్రామంలో పరిస్థితి తెలుసుకున్న టెక్కలి ఆర్డీవో ఎం.వెంకటేశ్వరరావు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చారు. రైతులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయితే వివాదం హైకోర్టులో పెండింగులో ఉందని, అటువంటప్పుడు అధికారులు పంటను ఎలా కోస్తారని రైతులు ఆర్డీవోను ప్రశ్నించారు. అప్పులు సాగు చేసిన పంటను తమకు అందించాలని, ఆ తర్వాత ఆ భూముల్లోకి ఇరువర్గాలు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని కోరారు. వారి వాదన విన్న ఆర్డీవో మాట్లాడుతూ కోర్టు కేసు పెండింగులో ఉన్న సమయంలో దళితులు, బీసీ రైతుల మధ్య గొడవలు తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ సిబ్బంది పర్యవేక్షణలో పంట కోయిస్తున్నామని వివరించారు.
కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటే వారికి వారి వాదనలు విన్న తరువాత ఆర్డీఓ మాట్లాడుతూ ఈ భూమి వివాదంలో దళితులకు, బీసీ వర్గీయులకు మద్య ఎటువంటి గొడవలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను అధికార యంత్రాంగం పర్యవేక్షణలో పంటను కోస్తున్నామని, తర్వాత కోర్టు తీర్పు ఎవరికీ అనుకూలంగా ఉంటే వారికి పంటను అందజేస్తామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు కోసిన పంటను తమ ఆధీనంలో ఉంచుతామని చెప్పారు. దీంతో రైతులు శాంతించారు. అనంతరం టెక్కలి తహశీల్దార్ ఆర్.అప్పలరాజు పర్యవేక్షణలో పంటను కోసి తరలించారు. అయితే ఈ విషయంలో తమకు అన్యాయం జరిగితే సహించేది లేదని బీసీ రైతులు అధికారులను హెచ్చరించారు.
ఇదీ నేపథ్యం
గతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పర్లాకిమిడి రాజులు లింగాలవలస గ్రామంలో పేదలైన బీసీలు, దళితులకు 13.96 ఎకరాల భూమి ఇచ్చారు. అప్పటి నుంచి వారు ఆ భూములను సాగు చేసుకుంటున్నారు. 1976లో ప్రభుత్వం తమకు పట్టాలు కూడా ఇచ్చిందని ఇరువర్గాలవారు చెబుతున్నారు. 1986లో అప్పటి పాతపట్నం తహశీల్దార్ సొలుగు ఆదినారాయణ కొత్త పట్టాలు ఇస్తామని చెప్పి, ఆ పట్టాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే తిరిగి పట్టాలు ఇవ్వలేదు. అప్పటినుంచి దళితులు, బీసీల మధ్య భూ వివాదాలు మొదలయ్యాయి. కోర్టు లో కేసు కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 3.20 ఎకరాల్లో బీసీ రైతులు పంట సాగు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు లక్ష్మీపేట ఘటన ఇక్కడ పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో పంటను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడం ప్రస్తుత ఉద్రిక్తతలకు దారితీసింది.