ప్రతీకాత్మక చిత్రం
రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో వందల కోట్ల రూపాయల విలువైన ఈనాం, వక్ఫ్, దేవాదాయ శాఖ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. రాజకీయ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, పలుకుబడి ఉన్నవారు దొంగ సర్వే నంబర్లతో నకిలీ పత్రాలు సృష్టించి దర్జాగా ఆక్రమిస్తున్నారు. ఇదేవిధంగా నగరం నడిబొడ్డున ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న విలువైన భూములపై భూ రాబందులు స్వైరవిహారం చేస్తున్నాయి. నకిలీ దస్తావేజులతో కోట్లాది రూపాయల విలువైన భూములను హస్తగతం చేసుకున్నాయి. దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందిస్తున్న దాఖలాలు కానరావడంలేదు.
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం రూరల్ మండలం పిడింగొయ్యి పంచాయతీ పరిధిలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఆవ భూములు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చదరపు గజం ధర ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ ఉంది. ఇక్కడే వెంకటేశ్వర హోల్‌సేల్ మార్కెట్ కూడా ఉంది. దీంతో ఈ ప్రాంతంలో భూమి బంగారంతో సమానం. దీంతో కొంతమంది బడాబాబుల కన్ను ఈ భూములపై పడింది. అంతే.. సర్వే నంబర్ 327గా ఉన్న ఈ భూములకు అనుబంధంగా 612, 613, 614, 617, 618 సర్వే నంబర్లతో నకిలీ దస్తావేజులు సృష్టించి ఈ భూములను ఆక్రమించారు. వీరిలో ఓ మాజీ శాసనసభ్యుడు, నగరంలోని ప్రముఖ ఎముకల డాక్టర్, రాజకీయ నేతలు, కాంట్రాక్టర్లు, ఇతర ‘పెద్దలు’ ఉన్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 87.87 ఎకరాల భూములున్నాయి. వీటి విలువ వందల కోట్లు ఉంటుంది. వీటిల్లో అత్యధిక భాగం ఆక్రమణలకు గురైనట్టు తెలుస్తోంది.
వెంకటేశ్వర జనరల్ మార్కెట్ వెనక ఆక్రమణలో ఉన్న భూములు
ఆ భూముల కథ ఇదీ..
బ్రిటిషు వారి హయాంలో సర్వే నంబర్ 327, 330, 332, 465తో పాటు ఇంకా అనేక సర్వే నంబర్లలోని భూములను దేవాదాయ, ఈనాం కింద పలువురికి కేటాయించారు. ఈ సర్వే నంబర్లలో దాదాపు 22 ఎకరాలను షాహీ ఈనాం కింద ప్రథమ ఈనాందారు ఖాజా జహురుల్లా కుమారుడు దబీర్ మహ్మద్ గాలబ్, ఆయన కుమారులకు శాశ్వత వంశపారంపర్యంగా వచ్చింది. 1902 వరకూ రెవెన్యూ పత్రాల్లో వారి పేర్లున్నాయి. గోదావరికి పలుమార్లు వచ్చిన వరదల వల్ల ఆ భూములు మునిగిపోయాయి. బీఎస్ నంబర్లు 315, 316, 317, 318, 319, 332ఏ, 334, 342లలోని టైటిల్ డీడ్ భూములు, బీఎస్ నంబరు 333బి జిరాయితీ డ్రై, 317ఏ కాలువ, 315 కుంట, 333ఎ, బి ఆవ వెరసి.. 87.87 ఎకరాల భూమిలో దుబ్బు పెరిగిపోయింది. దీంతో వాటిని కొలవడానికి వీలులేదని విలేజ్ నంబర్ 66 డైగ్లాడ్(పాత రికార్డు)లో స్పష్టంగా పేర్కొన్నారు. అందుచేత ఈ సర్వే నంబర్లలోని 87.87 ఎకరాల భూమిని సర్వే నంబర్ 327గా నమోదు చేసినట్లు చూపారు. ఇదే ఆక్రమణదారులకు అవకాశంగా మారింది. ఆ భూములకు తప్పుడు రికార్డులు సృష్టించి, రకరకాల డివిజన్లు సృష్టించి, ఆ భూములను యథేచ్ఛగా ఆక్రమించారు.
సర్వే నెంబర్ 327/11లో 2.2 ఎకరాల భూమి తమవని హెచ్చరిక బోర్డు పెట్టిన ఆక్రమణదారులు
కల్లుగీత సొసైటీ భూముల కబ్జా
సర్వే నంబర్ 327లో సుమారు 16 ఎకరాల వ్యవసాయ భూమిని గతంలో కల్లుగీత కార్మికుల సొసైటీకి కేటాయించారు. వాటిపై దాదాపు 20 కుటుంబాలు ఆధారపడి జీవించేవి. అయితే ఈ భూములను ఓ మాజీ శాసనసభ్యుడు ఆక్రమించాడు. ఆయా భూములను క్రమబద్ధీకరించుకునేందుకు వివిధ కోర్టుల్లో దావాలు వేయగా అవన్నీ సదరు మాజీ శాసనసభ్యుడికి వ్యతిరేకంగా వచ్చాయి. దీంతో సొసైటీ వారు, వారి వారసులు తమకు కేటాయించిన 16 ఎకరాలూ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. కొంతమంది అధికారులు ఆ మాజీ శాసనసభ్యుడికి వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై సొసైటీ సభ్యులు, ఈనాం భూముల వారసుదారులు కలిసి ఉన్నతాధికారులకు, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా అతీగతీ లేదు.
తమకే ఇవ్వాలంటున్న బాధితులు
1902 రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 327లో 8.88 ఎకరాలు దబీర్ ఇమామ్ మొహిద్దీన్, కాశిమ్ సాహెబ్, ఫకీర్ సాహెబ్, మరో ముగ్గురికి కేటాయించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ భూములను సర్వే చేసి తమకు అప్పగిచాలని 1998లో వారి వారసులు జన్మభూమిలో దరఖాస్తు చేసుకున్నారు. అదే సంవత్సరం సెప్టెంబర్ ఏడున ముఖ్యమంత్రికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి, ప్రస్తుత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా దీనిపై సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 2000 సంవత్సరంలో చలనా కూడా తీశారు. వారసుల వద్ద పత్రాలు తీసుకున్న అధికారులు ఆ తర్వాత పట్టించుకోలేదు. 2015లో ‘మీ ఇంటికి – మీ భూమి’లో దరఖాస్తు చేసుకున్నా.. ఇప్పటివరకూ ఎలాంటి పురోగతీ లేదు. ఆక్రమణదారుల నుంచి ఈనాం, దేవాదాయ భూములను కాపాడాలని, తమ భూములను తమకు కేటాయించాలని హక్కుదారులు విజ్జప్తి చేస్తున్నారు.
భూ రికార్డులు గందరగోళం
ఆవలో మొత్తం విస్తీర్ణం 87.87 ఎకరాలు. ఆ భూమిలో నీరు చేరి ఉండడం వల్ల కొలవడానికి వీలు లేకుండా ఉందంటూ రికార్డుల్లో ఉంది. అక్కడ అనేక వివాదాలున్నాయి. సర్వే నంబర్లు సబ్ డివిజన్ అయ్యాయి. సర్వే నంబర్ 327లో 19.20 ఎకరాలు వెబ్‌లాండ్ రికార్డు ప్రకారం ఇళ్లస్థలాలుగా కనిపిస్తోంది. 87.87 ఎకరాలపై పూర్తిస్థాయిలో సర్వే చేస్తేనే కానీ ఎవరి భూమి ఎవరిదో చెప్పలేం. అక్కడ ఒక్కో సర్వే నంబర్‌లోని భూమిపై నాలుగైదు యాజమాన్య హక్కు పత్రాలున్నాయి.
– కె.పోశయ్య, తహసీల్దార్, రాజమహేంద్రవరం రూరల్
Comments
Please login to add a commentAdd a comment