సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి , ఏలూరు: భూసేకరణలో అక్రమాలు పెద్ద ఎత్తున జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బుట్టాయగూడెం మండలం దొరమామిడిలో సేకరించిన భూమి విషయంలో అధికార పార్టీ నాయకులు చక్రం తిప్పారని, వీరికి అధికారులు ఊతం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురయ్యే వేలేరుపాడు, కుక్కునూరు మండలాల నిర్వాసితుల కోసం బుట్టాయగూడెం మండలం దొరమామడి గ్రామంలో ప్రభుత్వం భూసేకరణ చేసింది. ఈ భూసేకరణ అధికార పార్టీకి చెందిన నేతలకు కల్పతరువుగా మారింది. తమ పార్టీ వారైతే ఒక రకంగా కానివారికి మరో రకంగా పరిహారం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. తమ వారైతే లేని పంటలు ఉన్నట్లుగా చూపించి అప్పనంగా ప్రభుత్వ సొమ్మును దోచిపెడుతున్నట్టు తెలుస్తోంది. భూ సేకరణలో భూములతో పాటు మొక్కలు, చెట్లు, షెడ్‌లు, బోర్లు ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేసినట్టు సమాచారం. అధికార పార్టీకి చెందిన వారి భూములకు ఏ గ్రేడ్ మొక్కలకు ఇచ్చే రేట్లు ఇవ్వగా, ఇతరులకు నామమాత్రంగా చెల్లింపులు జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవకతవకలు ఎక్కువగా బుట్టాయగూడెం మండలంలోని దొరమామిడి, కోటనాగవరం భూముల్లో జరిగినట్టు సమాచారం.
దొరమామిడి ప్రాంతంలో ఎనిమిది ఎకరాల చెరువు, పోరంబోకు భూమిని కూడా భూ సేకరణలో అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకున్నారు. అదేవిధంగా టేకు, వేప, తాడి, బూరుగ చెట్లతో పాటు లేని జామాయిల్ మొక్కలు కూడా ఉన్నట్లు రాసి సొమ్ములు తమ ఖాతాలో పడేలా చేసుకుని ప్రభుత్వ సొమ్ము దండుకున్నారు. అడవిలోనే అంతగా కనిపించని వెదురు పంటను దొరమామిడిలోని ఒక రైతు పొలంలో 9,250 వెదురు గెడలు ఉన్నట్లు రికార్డుల్లో రాయించి సొమ్ములు తీసుకున్నారు. దొరమామిడి ప్రాంతంలో నిర్వాసితుల కోసం సేకరించిన 774 ఎకరాల భూమి నిర్వాసితులకే కౌలుకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రాంతంలోని కొందరు కౌలు సొమ్ముగా ఇప్పటికే రూ.7.77 లక్షలు చెల్లించారు. అయితే ఇంకో వర్గం గిరిజనులు ఇవి ఎల్టీఆర్ భూములు అంటూ అడ్డం తిరిగారు. ఇవి మొదటి నుంచీ వివాదాస్పద భూములని చెప్పినప్పటికీ అధికార పార్టీకి చెందిన నాయకులే వాటిని అమ్మకాలకు పెట్టారని ఇప్పుడు గిరిజనుల మధ్య కొట్లాటకు ఆ భూములు దారి తీస్తున్నాయని గిరిజన సంఘాలు విమర్శిస్తున్నాయి. భూ సేకరణే లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు నిర్వాసితుల సమస్యలపై సరైన శ్రద్ధ చూపలేదు. ఇప్పటికైనా ఈ భూసేకరణపై పూర్తిస్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయని బాధితులు చెబుతున్నారు.
భారీగా అక్రమాలు జరిగాయి
భూ సేకరణలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీకి చెందిన వారు అందినంత వరకూ దోచుకునే ప్రయత్నం చేశారు. గిరిజనులకు సేకరించిన భూములు కూడా ఎవరికి ఎక్కడ ఇచ్చారో తెలియని పరిస్థితి నెలకొంది. భూములు సేకరించి సొమ్ములు గిరిజనేతర రైతుల ఖాతాలో పడేందుకు అధికారులు సహకరించారు. నిర్వాసిత గిరిజనులను గాలికి వదిలేశారు. దీనిపై ఉద్యమిస్తాం.- ధర్ముల సురేష్, ఏఐకేఎమ్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, దొరమామిడి
తక్కువ డబ్బులు ఇచ్చారు
అధికార పార్టీకి చెందిన వ్యక్తిని కాకపోవడంతో నా పొగాకు బ్యారన్‌కు తక్కువ డబ్బులు ఇచ్చారు. ఎందుకూ పనికిరాని పొగాకు బ్యారన్‌లకు అధిక సొమ్ములు వచ్చాయి. నా పొలంలో దొండ సాగు చేస్తే దానికి పరిహారం ఇవ్వకపోగా అధికారుల చుట్టూ తిరిగేటట్లు చేస్తున్నారు. నాకు న్యాయం చేయాలి. –మద్దిపాటి సూరిబాబు, రైతు, దొరమామిడి