
భూసేకరణ గీసిన చావుగీత
భార్య సంవత్సరీకం చేయలేనన్న బెంగతో పేదరైతు బలవన్మరణం
ఏడు పదుల వృద్ధ్యాప్యం. చేతిలో చిల్లిగవ్వలేదు. కష్టసుఖాల్లో యాభై ఏళ్లు పాలుపంచుకున్న భార్య ఏడాది క్రితమే కాలధర్మం చేసింది. ఆమె సంవత్సరీకం నిర్వహించాలన్నది ఆ పేద రైతు చిన్న ఆశ. ఉన్న పదిసెంట్ల పొలాన్నిను అమ్మకానికి పెట్టారు.
అయితే ఊహించని ఎదురుదెబ్బ. పోర్టు నోటిఫికేషన్‌లో అధికారులు ఆ పది సెంట్లనూ చేర్చారు. రూ.లక్షకు పొలాన్ని కొనేందుకు రూ.10 వేలు అడ్వాన్సుగా ఇచ్చిన రైతులు ఆ మొత్తాన్ని తిరిగి తీసుకున్నారు. భార్య సంవత్సరీకం చేయలేని ఈ బతుకు
ఎందుకు అనుకున్నాడో లేక ఆమె వద్దకే వెళ్లి తన నిస్సహాయతను చెబుతామనుకున్నాడోగానీ ఆ పేద రైతు ఇంటి ముందున్న చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు..
కాకర్లమూడి (పెడన రూరల్) : బందరు పోర్టు భూసేకరణలో తనకున్న కొద్ది పాటి భూమి పొతుందనే బెంగతో పేద రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెడన మండలం కాకర్లమూడి గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన లింగం వెంకటేశ్వరరావు(70)కు పది సెంట్ల పొలం ఉంది. కొద్దిపాటు భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటారు. ఆయన భార్య సీతామహాలక్ష్మి గతేడాది మృతి చెందారు. వారికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఒక కుమారుడు గతంలో చనిపోయారు. పిల్లలందరికీ వివాహాలుకావడంతో వేరువేరుగా జీవిస్తున్నారు. వారిదీ అంతంత మాత్రపు జీవితాలే. భార్య సీతామహాలక్ష్మి చనిపోవడంతో మూడో కుమారుడు శివ ఇంటి వద్ద వెంకటేశ్వరరావు జీవనం సాగిస్తున్నారు.
చేటుచేసిన పోర్టు నోటిఫికేషన్
మచిలీపట్నం పోర్టు కోసం బందరు మండలంలోని పలు గ్రామాలతో పాటు పెడన మండలంలో కాకర్లమూడి గ్రామంలోనూ భూములు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. కాకర్లమూడిలో 1879 మంది రైతులకు చెందిన 864 ఎకరాల పొలాలను సేకరిస్తామని భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. లింగం వెంకటేశ్వరరావుకు చెందిన పది సెంట్లు పొలం కూడా ఆ నోటిఫికేషన్‌లో ఉంది. పది సెంట్లలో అతను ఇన్నాళ్లూ గొంగూర, తోటకూర, పొట్ల, చిక్కుడు సాగుచేసుకుని జీవనం సాగిస్తుం చారు. గత ఏడాది మరణించిన భార్యకు ఈ నెల 30వ తేదీన సంవత్సరీకం చేయాలని నిర్ణయించుకున్న వెంకటేశ్వరరావు ఆ పది సెంట్లు పొలాన్ని అమ్మకానికి పెట్టారు. స్థానిక రైతులు ఆ పొలాన్ని రూ.లక్ష కు కొనుగోలు చేసేందుకు బేరం కుదుర్చుకుని రూ.1ఏవేలు అడ్వాన్సుగా ఇచ్చారు.
పోర్టు భూసేకరణలో ఆ పొలం ఉండటంతో అడ్వాన్సుగా ఇచ్చిన నగదును తిరిగి తీసుకున్నారు. దీంతో తన భార్యకు సంవత్సరీకం కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని పలువురి వద్ద వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధతోనే శుక్రవారం ఉదయం ఐదు గంటలకు ఇంటి ముందున్న వేప చెట్టుకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు స్వాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెడన ఎస్‌ఐ ఎ.గణేష్‌కుమార్, ఏఎస్‌ఐ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టెబుల్ సుబ్రహ్మణ్యం, నాగమల్లేశ్వరరావు, వీరాబాబు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ అధికారి రాజు నుంచిస్టేట్‌మెంట్ నమోదుచేశారు.
కుటుంబాన్ని ఆదుకోవాలి
పోర్టు భూసేకరణలో సన్నకారు రైతుల భూములను ప్రభుత్వం సేకరించడం అన్యాయమని వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాదు పేర్కొన్నారు. వెంకటేశ్వరరావు మృతి విషయం తెలవగానే సంఘటనా స్థలానికి త రలి వెళ్లి మృతుడికి నివాళులర్పించారు. ఆయనతో పాటు పెడన మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు బండారు ఆనందప్రసాదు, పెడన మండల ప్రతిపక్ష నాయకుడు రాజులపాటి అచ్యుతరావు, మండల పార్టీ అధ్యక్షుడు దావు భైరవలింగం, పెడన కౌన్సిలర్ మెట్ల గోపి, కాకర్లమూడి సర్పంచి వాకలరావు, మాజీ సర్పంచి జన్యావుల మారేశ్వరావు, సీపీఎం నాయకులు పంచల రామ నరసింహారావు, సజ్జా మూర్తిరాజు, కొడాలి శర్మ, తదితరులు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చారు.