సాక్షి, గుంటూరు: భూ సమీకరణను వేగవంతం చేయడంలో భాగంగా 27 యూనిట్లకు పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఇతర జిల్లాల నుంచి కేటాయించిన రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది గుంటూరు జిల్లాలో రిపోర్ట్ చేస్తున్నారు. దీంతో వీరిని 27 యూనిట్ల పరిధిలో నియమిస్తున్నారు. ఇప్పటికే తుళ్లూరు మండలంలోని 16 గ్రామాల్లో భూ సమీకరణ కు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఈ మండలంలో పూర్తి స్థాయిలో రెవెన్యూ, సర్వే సిబ్బందిని నియమించగా, మిగిలిన సిబ్బందిని మంగళగిరి, తాడేపల్లి మండలాలకు కేటాయిస్తున్నారు.
ఇప్పటికి ఇతర జిల్లాల నుంచి 11 మంది, గుంటూరు నుంచి ఆరుగురు మొత్తం 17 మంది డిప్యూటీ కలెక్టర్లు, 29 మంది తహశీల్దార్లు, 47 మంది డిప్యూటీ తహశీల్దార్లు, 40 మంది సర్వేయర్లు వచ్చారు. 30 మంది కంప్యూటర్ ఆపరేటర్లను కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు.తాత్కాలికంగా జిల్లాలో ఉన్న సీనియర్ అధికారులను భూ సమీకరణకు వాడుకుంటున్నారు.ఇంకా సీనియర్, జూని యర్ అసిస్టెంట్లను కేటాయించాల్సి వుంది. ఇప్పటికే జిల్లాలో పలువురు తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లను భూ సమీకరణకు వినియోగిస్తున్నారు.
మంగళగిరి మండలంలోని నీరుకొండ, కురగల్లు, తిప్పాయిపాలెంలో భూ సమీకరణ కోసం డిప్యూటీ కలెక్టర్లు ఆయా గ్రామాల పరిధిలో నోటిఫికేషన్లు విడుదల చేశారు. రైతులు 9.3 దరఖాస్తులు తీసుకెళ్లారు. బుధవారం నాటికి 725 మంది రైతులు 2,058.56 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్‌కు సమ్మతించినట్టు గుంటూరు ఆర్డీవో భాస్కరనాయుడు తెలిపారు. తుళ్లూరు మండలంలోని ఉద్దండ్రాయునిపాలెం, రాయపూడి, లింగాయపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో రైతులు అంగీకార పత్రాలు ఇవ్వలేదు.
భూ సమీకరణకు సిబ్బంది కేటాయింపు
Published Thu, Jan 8 2015 5:36 AM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM
Advertisement