పరిశ్రమల స్థాపన, ఇతర అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించిన భూములపై ఇష్టారాజ్యంగా తనఖా రుణాలు ఇవ్వకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థలను నియంత్రించేలా భూకేటాయింపుల విధానంలో కొత్త నిబంధన చేర్చాలని రాష్ట్ర భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) ఐ.వై.ఆర్.కృష్ణారావు ప్రతిపాదించారు. ‘పరిశ్రమల ఏర్పాటు కోసమంటూ ప్రజాప్రయోజనాల పేరిట తక్కువ ధరతో ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్న సంస్థలు/వ్యక్తులు ఆ భూములను బహిరంగ మార్కెట్‌లో ఉన్న విలువ ప్రాతిపదికన తనఖాపెట్టి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఇతర అవసరాల కోసం వినియోగించుకుంటున్నాయి.
కొన్ని సంస్థలైతే తర్వాత బ్యాంకులకు డబ్బు చెల్లించటంలేదు. దీంతో బ్యాంకులు/ఆర్థిక సంస్థలు ఆభూములను వేలం వేసి అప్పులు జమ వేసుకుంటున్నాయి. దీనివల్ల ప్రజాప్రయోజనం నెరవేరకపోగా ప్రభుత్వం భూమిని పోగొట్టుకుంటోంది. ఏదైనా సంస్థకు లేదా వ్యక్తికి ప్రభుత్వం ఎంత ధరకు భూమిని కేటాయిస్తుందో గరిష్టంగా అంత మొత్తానికే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణం ఇవ్వాలనే నిబంధన ద్వారా ఈ మోసాలను నియంత్రించవచ్చు.
ప్రభుత్వం కేటాయించిన భూమి విలువను మాత్రం ప్రభుత్వానికి చెల్లించిన ధరనే గరిష్టంగా ప్రాజెక్టు రిపోర్టులో చూపించాలనే కొత్త నిబంధనను భూకేటాయింపుల పాలసీలో చేర్చాలి’ అని ఆంధ్రప్రదేశ్ భూమి నిర్వహణ అథారిటీ (ఏపీఎల్‌ఎంఏ) చైర్మన్ హోదాలో కృష్ణారావు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. ఈ అంశంపై ‘సాక్షి’ సంప్రదించగా.. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, భూ కేటాయింపుల లక్ష్యం నెరవేరాలంటే ఈ కొత్త నిబంధన చేర్చాల్సిన అవసరం ఉందని, అందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిన విషయం వాస్తవమేనని సీసీఎల్‌ఏ చెప్పారు.