
ఇది టీడీపీ సర్కారు స్పాన్సర్డ్ స్కీం
‘భూ సమీకరణ’పై మేధావుల విమర్శలు
► ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలతో రైతుల్లో భయాందోళన
► ప్రభుత్వ తీరులో పారదర్శకత లేదు, చట్టబద్ధతా లేదు
► రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీలాంటిదే ఇదీ
► ముందు ముందు అక్కడి గ్రామాలన్నీ ఖాళీ చేయిస్తారు
► రైతులు, కూలీలు, వృత్తిదారుల నోట్లో మట్టికొడతారా?
► ‘సాక్షి’ టీవీ చర్చా కార్యక్రమంలో మేధావుల ఆందోళన
► ఉద్యమానికి సిద్ధమవుతున్నామన్న పలు పార్టీల నేతలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి చేపట్టిన భూ సమీకరణలో ప్రభుత్వం ఏ కపక్షంగా పోతూ, పారదర్శకంగా వ్యవహరించకపోవడంతో రైతుల్లో భయాందోళన నెలకొందని వివిధ వర్గాల మేధావులు అభిప్రాయపడ్డారు. రైతులు, కౌలుదారులు, రైతు కూలీలు, వృత్తిదారులకు ఎలాంటి హామీ ఇవ్వకుండా భూ సమీ కరణకు ఒప్పుకోకపోతే, భూ సేకరణ ద్వారా లా క్కుంటామని చెప్పడం దారుణమన్నారు. రాజధాని కోసం ఎంపిక చేసిన గ్రామాల్లో వ్యక్తమవుతున్న ఆందోళన, భిన్నాభిప్రాయాలపై మంగళవారం రాత్రి ‘సాక్షి’ టీవీ చర్చా కార్యక్రమం నిర్వహించింది. సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ ఈ గోష్టిలో సంధానకర్తలుగా వ్యవహరించి అనేక అంశాలపై నిపుణుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. చర్చలో పాల్గొన్న ప్రముఖుల అభిప్రాయాలు వారి మాటల్లోనే...
ల్యాండ్ పూలింగ్‌కు చట్టబద్ధత లేదు
- సత్యప్రసాద్, సీనియర్ న్యాయవాది
ప్రభుత్వం ప్రస్తుతం చెప్తున్న ల్యాండ్ పూలింగ్ విధానానికి చట్టబద్ధత లేదు. భూములు సేకరించాలంటే ముందుగా నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ తర్వాతే సర్వే చేయాలి. చట్ట ప్రకారం దీన్నే ల్యాండ్ అక్విజేషన్ నోటిఫికేషన్ అంటాం. సెక్షన్ 4 కింద ఇది తొలి దశ. ఇలాంటివేవీ లేకుండా మంత్రివర్గ ఉపసంఘం పేరుతో జరిపే వ్యవహారాలకు చట్టబద్ధత లేదు. గ్రామాలకు ఇబ్బం ది లేదు అంటున్నారు. కానీ రాజధాని నిర్మాణం లో భాగంగా అసెంబ్లీ నిర్మిస్తూ దాని పక్కనే గ్రా మముంటే ముందుముందు ఉండనివ్వరు. అది సాధ్యం కాదు. గ్రామాలన్నీ ఖాళీ చేయిస్తారు.
ఇది సర్కారు స్పాన్సర్డ్ స్కీం
- తెలకపల్లి రవి, ప్రముఖ పాత్రికేయుడు
ప్రస్తుతం తుళ్లూరు, రాయపూడి తదితర గ్రా మాల రైతులను హైదరాబాద్ తీసుకురావడం వంటి పరిస్థితులు చూస్తూంటే.. ఇది సర్కారీ స్పాన్సర్డ్ స్కీం లా అనిపిస్తోంది. అన్ని పనులూ సింగపూర్ కేంద్రంగా నడుస్తున్నట్టున్నాయి. రాజ ధాని నిర్మాణానికి కావాల్సిన భూముల సమీకరణలో ఎవరి భాగస్వామ్యమూ లేదు. ఎవరైనా ఏదైనా అంటే రాజధానిని అడ్డుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఎకరా ఉన్న రైతుకు ఏటా రూ. 25 వేలే ఇస్తామంటున్నారు. నెలకు రెండు వేల రూపాయలతో ఆ కుటుంబం ఎలా బతుకుతుంది? మొత్తం వ్యవహారం చూస్తే టీడీపీ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది.
అందరి నోట్లో మట్టికొడతారా?
- పి.మధు, సీపీఎం ఏపీ శాఖ కార్యదర్శి
రాజధాని నిర్మాణానికి 30,000 ఎకరాలు కావాలని ఎవరు చెప్పారు? అంటే ఈ భూములను నమ్ముకున్న రైతులు, కూలీలు, వృత్తిదారుల నోట్లో మట్టికొడతారా? రైతులను ఒప్పించి భూమికి భూమి ఇవ్వాలని చట్టం చెప్తోంది. వృత్తిదారులు ఉపాధి కోల్పోతే నెలకు రూ. 2,000 చొప్పున 20 ఏళ్లు ఇవ్వాలి. లేదంటే వన్ టైం సెటిల్‌మెంట్ కింద ఉపాధి కూలీలకు రూ. 5 లక్షలు ఇవ్వాలని చట్టం చెప్తోంది. మీరు ఇది చేస్తున్నారా? మళ్లీ పది వామపక్షాలు ఏకమవుతున్నాం. పోరాటానికి సిద్ధమవుతున్నాం.
భూమిపై హక్కు లేకుండా చేస్తున్నారు...
- కృష్ణారావు, సమతా పార్టీ అధ్యక్షుడు
ఉదయం లేచినప్పటినుంచీ సింగపూర్ సింగపూర్ అంటున్నారు. ఆ మాట వింటేనే ఒళ్లంతా అలర్జీ పుడుతోంది. ఒక్క విషయంలో కూడా ప్రభుత్వానికి పారదర్శకత లేదు. రాజధాని ప్రకటన ముందే భూములు, వాటి సమీకరణ తదితర విషయాలపై ప్రకటన చేసి ఉండాల్సింది. రోజుకో ప్రకటనతో రైతుల్లో భయాందోళన పెరుగుతోంది. ఒకవిధంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో భూ యజమానులకు భూములపైన హక్కు లేకుండా చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
ఆ 23 వేల మంది ఎక్కడకు వెళతారు?
- మాణిక్యవరప్రసాద్, మాజీ మంత్రి
రాజధాని భూసమీకరణ చేస్తున్న గ్రామాల్లో 40 వేల మంది వరకూ ఉన్నారు. వారిలో 17 వేల మందికి మాత్రమే భూములున్నాయి. మిగతా 23 వేల మంది కూలీలు, కౌలుదారులు, వృత్తిదారులే. వాళ్లంతా ఎక్కడకు వెళతారు? అయినా రాజధానికి 30 వేల ఎకరాలు కావాలా? ప్రభుత్వ భూముల్లో కట్టుకోమనండి. ఎవరూ కాదనరు. త్వరలోనే రైతుల వద్దకు వెళతాను. వాళ్లతరఫున పోరాటాలు చేసేందుకు వెనుకాడను. ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశాను.
ఒప్పుకుంది టీడీపీ అనుకూలురే...
ఏడాదికి మూడు లేదా నాలుగు పైర్లు పండిం చే రైతులు ఎవరూ భూములిచ్చేందుకు సిద్ధపడలేదు. టీడీపీ అనుకూలురు మాత్రమే ఒప్పుకున్నారు. కొందరు ‘దేశం’ కార్యకర్తలను తీసుకొచ్చి అంతా ఒప్పుకున్నారని చెప్పిస్తున్నారు. ఈ భూములు మా తరతరాల ఆస్తి. ఇచ్చేవాళ్ల దగ్గర తీసుకోండి.. కాదనం. పచ్చటి పైర్లతో వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులతో కళకళలాడే మా గ్రామాలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో నిండిపోయాయి. గతంలోనూ చంద్రబాబు ఏపీని అభివృద్ధి చెయ్యలేదు.
- శ్యామసుందరి, రైతు, అప్పిరాజుపాలెం
భయాందోళనలో రైతులు..
జామ, నిమ్మ, కంద, పసుపు వంటి పంటలు పండిస్తూ హాయిగా బతుకుతున్న మా మనసుల్లో ఏమిటీ కలకలం? ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఏ రైతూ సంతోషంగా లేరు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఆనందంగా ఉన్నారు. భూములు ఇస్తున్న రైతుల వద్ద తీసుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు. మేము మా గ్రామ కమిటీ తరఫున భూములు ఇవ్వకూడదని తీర్మానం చేశాం. ఇదే మా తుది నిర్ణయం కూడా.
- హరీంద్రనాథ్‌చౌదరి, రైతు, రాయపూడి