ఇచ్చాం.. తీసుకుంటాం
అనకాపల్లి డివిజన్‌లో కొండపోరంబోకు భూములను అటవీ శాఖకు బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది. సాగునీటి ప్రాజెక్టుల కోసం అటవీ భూములను సేకరించడంతో ఆ స్థానంలో కొండపోరంబోకు భూములను తమకు కేటాయించాలని అటవీశాఖ ప్రభుత్వాన్ని కోరింది. భౌగోళిక సమతూకంలో భాగంగా అటవీశాఖ భూ నిష్పత్తుల మేరకు కోల్పోయిన భూముల స్థానంలో కొండ పోరంబోకు భూములను సేకరించేందుకు అధికార యంత్రాంగం పనిలో పడింది. ఈ విషయంలో స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
- 1590 ఎకరాల కొండపోరంబోకు అటవీశాఖకు బదిలీ!
- చింతలపూడి ఎత్తిపోతల పథకంలో కోల్పోయిన భూమికి ప్రత్యామ్నాయంగా..
- అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అనకాపల్లి వాసులు
అనకాపల్లి మండలంలోని 1,590 ఎకరాల కొండపోరంబోకు భూమిని అటవీ శాఖకు బదలాయించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అనకాపల్లి మండలంలోని వల్లూరు, కోడూరు, కుంచంగి, కూండ్రం, మారేడుపూడి, గొలగాం, మామిడిపాలెం ప్రాంతాల్లో ఇండ స్ట్రియల్ పార్కుల కోసం స్థలాలు సేకరించే పనిలో అధికారులున్నారు.
తాజాగా అటవీశాఖ అనకాపల్లి పరిధిలోని భూములను సంపాదించకోనుంది. కొండపోరంబోకు భూములు ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో అటవీశాఖకు అప్పగించడం మేలు జరుగుతుందని సామాజికవేత్తలు, పర్యావరణ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కసారి అటవీశాఖకు భూములు బదలాయిస్తే .. సంబంధిత చట్టాల మేరకు భూములకు రక్షణ కలుగుతుందని, దీనికి తోడు వన్య ప్రాణులకు రక్షణ కలుగుతుందని వారంటున్నారు.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రకరకాల నిర్మాణాల పేరిట కొండ పై భాగం ఆక్రమించుకోవడం, అధికారుల సహకారంతో వాటిని క్రమబద్ధీకరించుకోవడంతో కొండ పోరంబోకు భూముల విస్తీర్ణం భారీగానే పడిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా అనకాపల్లి భూములను అటవీశాఖ అధీనంలోకి తెచ్చుకునేందుకు రంగం సిద్ధం కాగా, రెవెన్యూ అధికారులు ఈ తతంగాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు.
ఎందుకంటే...
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకానికి 2008లో వేలాది హెక్టార్ల అటవీశాఖ భూమిని నీటిపారుదల శాఖ సేకరించింది. ప్రభుత్వ ఆధీనంలోని భూములకు నష్టపరిహారం ఇచ్చినప్పటికీ అటవీశాఖకు మాత్రం ఈ భూమికి బదులు మరొక భూమి ఇవ్వాలని అప్పట్లోనే నిర్ణయించారు. ఈ దశలోనే పలు ప్రాంతాలలో అందుబాటులో ఉన్న కొండపోరంబోకు భూములను అటవీశాఖకు అప్పగించేందుకు నిర్ణయించారు.
ఏయే భూములు అటవీశాఖ పరిధిలోకి...
అనకాపల్లి మండలంలోని వల్లూరు రెవెన్యూ పరిధిలో సర్వే 159లో 440 ఎకరాలు, కొప్పాక రెవెన్యూ పరిధిలోని సర్వే నం. 41లో 250, గోపాలపురం రెవెన్యూ పరిధిలో సర్వే నం. 111లో 50 , మారేడుపూడి సర్వే నం. 357 పరిధిలో 150, గొలగాం సర్వే 283 పరిధిలో 100, తుమ్మపాల సర్వే నం. 360 పరిధిలో 500, జగన్నాథపురం సర్వే నం. 50 పరిధిలో 100 ఎకరాలతో కలిపి 1590 ఎకరాలను అటవీశాఖకు అప్పగించనున్నారు.
స్థానికుల్లో కలవరం...
క్వారీలు, కొద్దిపాటి వ్యవసాయ మినహాయిస్తే వెనుకబడిన అనకాపల్లి మండలంలోని భూములపై ప్రభుత్వం దృష్టి సారించడం పట్ల స్థానికులలో కలవరం మొదలైంది. ఇప్పటికే 2 వేల ఎకరాలకు పైగా ఉన్న భూమిని ఇండస్ట్రియల్ పార్కులకు కేటాయించగా, మరో 1590 ఎకరాల భూమిని అటవీశాఖకు అప్పగిస్తే భవిష్యత్‌లో అనకాపల్లి ప్రాంత ప్రజలకు ఇంటి అవసరాలకు, సాగు అవసరాల కోసం పట్టాలు ఎలా మంజూరు చేస్తారని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లిని వాణిజ్యకేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేస్తున్నారో లేక ప్రత్యేకమైన వ్యూహంతో భూములను సేకరిస్తున్నారో తెలియడం లేదని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా 1590 ఎకరాల కొండపోరంబోకు అటవీ శాఖకు బదలాయింపు కావడం ప్రజల్లో చర్చనీయాంశమైంది.