లక్ష్యం చేరని భూ సమీకరణ | lands | Sakshi
Sakshi News home page

లక్ష్యం చేరని భూ సమీకరణ

Published Sun, Feb 15 2015 2:01 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

lands

సాక్షి ప్రతినిధి, గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూ సమీకరణ ప్రక్రియ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జరగలేదు. జిల్లాలోని రాజధాని గ్రామాల్లో భూ సమీకరణకు శనివారంతో గడువు ముగిసింది. 30  వేల ఎకరాలు సమీకరణ లక్ష్యం కాగా గడువు తేదీ నాటికి   అధికారులు కేవలం 21,627 ఎకరాలు మాత్రమే సమీకరించగలిగారు. ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి ప్రతిపాదించిన మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలో భూ సమీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమమే సాగింది. రైతులంతా భూ సమీకరణను వ్యతిరేకిస్తూ అభ్యంతర పత్రాలు ఇచ్చారు. వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు రాజధాని గ్రామాల్లో పర్యటించి భూ సమీకరణకు చట్టబద్ధత లేదని, రైతులు బయపడాల్సిన పనిలేదని అవగాహన కలిగించడంతో ఈ మండలాల రైతులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిలిచారు. ఈ ప్రాంతంలోని భూముల ధరలు అధికంగా ఉండటమే కాకుండా ఇక్కడ సాలీనా మూడు పంటలు పండే జరీబు భూములు అధికంగా ఉన్నాయి. దీనితో వీరంతా ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీకి ఆశపడకుండా భూ సమీకరణకు వ్యతిరేకంగా నిలిచారు.  శనివారం నాటికి 21,627 ఎకరాలను సమీకరించింది.
 
 వీటితోపాటు రాజధాని గ్రామాల్లో అసైన్డ్, దేవాలయాల భూములు మరో 30 వేల ఎకరాల వరకు ఉన్నాయి. మొత్తం 50 వేల ఎకరాల్లో ముందుగా రాజధాని నిర్మాణం చేపట్టాలని ఈ మండలాల రైతులు కోరుతున్నారు. రాజధానిని తాము వ్యతిరేకించడం లేదని, ఇప్పటి వరకు సేకరించిన భూముల్లో రాజధాని నిర్మాణం చేపట్టి తమ ప్రాంతాలను మినహాయించాలని వీరంతా కోరుతున్నారు. ఈ రెండు మండలాల్లో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ రైతుల పక్షాన నిలిచింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రైతుల పక్షాన నిలిచి ఉద్యమాన్ని నడపడంతో భూ సమీకరణ ముందుకు సాగలేదు. ఇక్కడ సమీకరించిన 3,746 ఎకరాల్లో ఎక్కువుగా అసైన్డ్ భూములు, వివాద భూములే అధికంగా ఉన్నాయి. మిగిలిన వాటిలో ఎక్కువ మంది వ్యవసాయాన్ని వ్యాపకంగా చేపట్టకుండా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం స్థిరపడిన వారున్నారు.
 
  వీరంతా వివాదాలకు పోకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ప్యాకేజీ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మండలాల రైతులు భూ సేకరణ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే ఏ విధంగా స్పందించాలనే అంశంపై   తర ్జనభర్జన పడుతున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ నెలాఖరు వరకు గడుపు పొడగింపు ఉంటుందని ప్రకటించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. దీనితో జిల్లా అధికారులు, రాజధాని గ్రామాల్లోని రైతులు ప్రభుత్వ నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నారు. సోమవారం భూ సమీకరణ కార్యాలయాలు పనిచేస్తాయో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. దీనిపై మంత్రులు పి.నారాయణ, పుల్లారావు, తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్‌లు స్పష్టంగా సమాధానం ఇవ్వలేకపోయారు. సోమవారంలోపు ముఖ్యమంత్రి చంద్రబాబు భూ సమీకరణ గడుపు పొడగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
 
 తుళ్ళూరు రైతులు అనుకూలం..
 ఇక తుళ్ళూరు మండలంలో మొదటి నుంచి రాజధాని నిర్మాణానికి అనుకూలంగా వ్యవహరించిన రైతులు వెంటనే రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కావాలని కోరుకుంటున్నారు. అక్కడ పనులు వేగంగా జరిగితే ప్రభుత్వం ఇచ్చే భూమిని మంచి రేటు వస్తుందని, దానిని అమ్ముకోవచ్చని లేకుంటే అక్కడే నిర్మాణాలు చేపట్టుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు. భూ సమీకరణకు అంగీకార పత్రాలు ఇచ్చిన రైతుల భూమిలో సాగును నిషేధించడంతో వీరంతా కొంత నిరుత్సాహానికి గురయ్యారు. వచ్చే సీజను వరకైనా సాగుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తుళ్ళూరు మండలంలో 24,685 ఎకరాలు సమీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి రైతులు మొదటి నుంచి భూ సమీకరణకు సానుకూలంగా ఉండటంతో గడువు తేదీ నాటికి 17,684 ఎకరాలకు అంగీకార పత్రాలు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement