
సాక్షి, చిత్తూరు : ఏప్రిల్ 11న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ మేరకు ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 15 వరకు మాత్రమే ఓటు హక్కు పొందేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని వారు ఓటుకోసం నమోదు చేసుకోవాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు. ఈ ఒక్కరోజు పూర్తయితే ఓటు నమోదుకు అవకాశం ఉండదని అధికారులు విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు.
నమోదు కోసం ఫారం–6
2019 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తయిన యువత అందరూ ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం చేయాల్సింద ల్లా ఆన్‌లైన్‌లో ఫారం–6 దరఖాస్తు చేయడమే. ఆన్‌లైన్‌లో www.ceoandhra.nic.in వెబ్‌సైట్‌లో ఫారం–6 దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఒక ఫోటో, ఆధార్‌కార్డు, వయస్సు ధ్రువీకరణపత్రం, నివాస స్థల ధ్రువీకరణపత్రాన్ని అప్‌లోడ్ చేయాలి. ఆ తరువాత విచారణ కోసం సంబంధిత పోలింగ్ కేంద్రం బీఎల్వో ఇంటికి వద్దకే వస్తారు
అప్పుడు వారికి ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఓటరు జాబితాలో పేరు ఉన్నప్పటికీ వివరాలు, చిరునామా తప్పుగా ఉండడం, పేరు తప్పుగా ఉండడం, ఫోటో సరిగా లేకపోవడం లాంటివి ఉన్నాయి. అలాంటి వారు ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందువల్ల ఓటరు జాబితాలో పేర్లకు సంబంధించి ఆక్షేపణ, తొలగించడానికి సంబంధించిన ఫారం–7 దరఖాస్తుల స్వీకరణ నిలిపివేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో ఫారం–7కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు.
సర్వర్ మొరాయింపు
ఓటు హక్కు పొందేందుకు శుక్రవారమే చివరి రోజు కావడంతో ఆన్‌లైన్ సర్వర్ మొరాయిస్తోంది. చివరి రోజు ముగిస్తే ఆ తరువాత వచ్చే దరఖాస్తులను స్వీకరించలేదని, అలా దరఖాస్తు చేసుకునే వారి పేర్లు ఓటర్ల జాబితా నమోదు కావని ఎన్నికల కమిషనర్ ప్రకటించింది. దీంతో ఓటు హక్కు లేని వారు, గతంలో ఉన్నా పలు కారణాలతో బీఎల్వోలు చేసిన తప్పిదాలకు ఓట్లు పొగొట్టుకున్న వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇలాంటి సమయంలో సర్వర్ మొరాయిస్తుండడంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెట్ సెంటర్లు, మీ–సేవ కేంద్రాల్లో ప్రయత్నిస్తుంటే ‘దిస్ సైట్ కెనాట్ బి రీచ్‌డ్’ అని వస్తోంది. ఓటు నమోదుకు ఆన్‌లైన్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు మ్యానువల్‌గా దరఖాస్తులు అందించాలనుకుంటే బీఎల్వోలు అందుబాటులోలేరు.
నూతన ఓటర్లకు 1,11,660 కార్డులు
జిల్లాలో ఇటీవల ఓటు దరఖాస్తు చేసుకున్న వారికి నూతన ఓటరు కార్డులను అందివ్వనున్నా రు. అందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి జిల్లాకు 1,11,660 ఎపిక్ ఓటరు కార్డులు రానున్నాయి. వచ్చే ఓటరు కార్డులను తహసీల్దార్లకు చేర్చి వారి ద్వారా సంబంధిత ఓటర్లకు సరఫరా చేయనున్నారు.
తంబళ్లపల్లె : 5,415
పీలేరు : 4,096
మదనపల్లె : 10,089
పుంగనూరు : 8,791
చంద్రగిరి : 13,980
తిరుపతి : 17,921
శ్రీకాళహస్తి : 8,357
సత్యవేడు : 6,039
నగరి : 6,704
జీడీనెల్లూరు : 5,537
చిత్తూరు : 8,225
పూతలపట్టు : 5,298
పలమనేరు : 7,501
కుప్పం : 3,707