మరో 96 గంటలే.. | Last phase of elections to be finish today | Sakshi
Sakshi News home page

మరో 96 గంటలే..

Published Sun, May 19 2019 4:12 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

Last phase of elections to be finish today - Sakshi

సాక్షి, అమరావతి: సుదీర్ఘ నిరీక్షణకు మరో 96 గంటల్లో తెరపడనుంది. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌ 11వ తేదీన జరిగాయి. ఈ నెల 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫలితాలు రావడానికి మిగిలింది ఇక నాలుగు రోజులే. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో(ఈవీఎం) నిక్షిప్తమైన అభ్యర్థుల జాతకం తేలడానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఓటరు దేవుడి ఆగ్రహానికి, అనుగ్రహానికి గురైంది ఎవరో తెలిసిపోనుంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్‌ ఆదివారం జరగనుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఆదివారం సాయంత్రం 6 గంటలకు వెలవడనున్నాయి.

ఈ ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలకు, అసలు ఫలితాలకు మధ్య లంకె కుదిరేనా? అని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పలు టీవీ చానళ్లు, సర్వే ఏజెన్సీలు రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి. రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు, అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరచడం ఖాయమని పలు జాతీయ టీవీ చానళ్లు, సర్వే సంస్థలు వెల్లడించాయి. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడంతోపాటు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించబోతున్నారని ఇప్పటికే జాతీయ పత్రికలు, చానళ్లు విశ్లేషించిన సంగతి తెలిసిందే. 

దేశవ్యాప్తంగా ఆదివారం చివరి దశ పోలింగ్‌ ముగిసే వరకు అంటే సాయంత్రం 6 గంటల దాకా ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల వెల్లడిపై నిషేధం ఉంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను బహిర్గతం చేయడానికి జాతీయ చానళ్లు, సర్వే సంస్థలు ఏర్పాట్లు చేసుకున్నాయి. అసలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలతో కొంత స్పష్టత వస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 

ఓటమి భయంతో చంద్రబాబు గగ్గోలు 
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం తప్పదని సర్వేల్లో తేటతెల్లమైంది. పోలింగ్‌ జరిగిన ఏప్రిల్‌ 11వ తేదీన కూడా అదే వాతావరణం నెలకొంది. పోలింగ్‌ ముగిసిన తరువాత పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాము ఘనవిజయం సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం తన ఓటమిని ఊహించి, ఈవీఎంలపై గగ్గోలు ప్రారంభించారు. పోలింగ్‌ ప్రారంభమైన రెండు గంటల్లోనే రాష్ట్రంలో 30 శాతం మేర ఈవీఎంలు పనిచేయడం లేదని ఆరోపించారు. చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకుని, ఓటు వేసినట్లు వేలికి ఉన్న సిరా గుర్తును మీడియాకు చూపిస్తూ ఫోజులు ఇచ్చారు. సాయంత్రం అయ్యే సరికి తన ఓటు ఎవరికి పడిందో తెలియడం లేదని చెప్పారు. పోలింగ్‌ ముగిసిన తరువాత కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని చంద్రబాబు దుర్భాషలాడారు. పలు ఆరోపణలు చేశారు. ఆ మరుసటి రోజు ఢిల్లీ వెళ్లి, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈవీఎంలు, వీవీప్యాట్లు సరిగ్గా పని చేయలేదంటూ ఫిర్యాదు చేశారు. ఈవీఎంలపై నమ్మకం లేదు, బ్యాలెట్‌తోనే ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రతిరోజూ పాత పాటే పాడారు. ఓటమి భయంతోనే చంద్రబాబు అనవసర రాద్థాంతం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. 

‘చిలక’ జోస్యంపై జనం అనాసక్తి 
సీఎం చంద్రబాబు గూటిలోని చిలక ‘లగడపాటి’ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడించి, బొక్కబోర్లాపడ్డారు. పోలింగ్‌ పూర్తయిన తరువాత సర్వే ఏజెన్సీలు టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని ప్రకటించగా, లగడపాటి మాత్రం మహా కూటమి గెలుపు తథ్యమని తేల్చిచెప్పారు. తీరా ఫలితాలను చూస్తే లగడపాటి చిలక జోస్యం వాస్తవానికి ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. దీంతో లగడపాటి సర్వేలపై ప్రజలు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. చంద్రబాబుకు లాభం చేకూర్చడానికే లగడపాటి దొంగ సర్వేలు నిర్వహిస్తున్నారన్న అభిప్రాయం జనంలో నాటుకుపోయింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement