జహీరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డికి ఢిల్లీలో జరిగిన అవమానాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జహీరాబాద్ బంద్ సంపూర్ణంగా జరిగింది. గురువారం కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో తిరుగుతూ బంద్ నిర్వహించారు. పార్టీ నాయకులు 9వ జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించారు.
భవానీ మందిర్ క్రాస్‌రోడ్డు వద్ద 9వ జాతీయ రహదారిపై టెంట్ వేసుకుని బైఠాయించారు. అంతకుముందు పార్టీ కార్యకర్తలు నిర్వహిస్తుండడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ఆందోళనకారులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద బైఠాయించి వాహనాల రాక పోకలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని రాస్తారోకో విరమింపజేశారు. అనంతరం ఆందోళనకారులంతా బస్టాండ్‌లోకి వెళ్లి బస్సులను అడ్డుకున్నారు. తెరిచి ఉంచిన దుకాణాలను బలవంతంగా మూసివేయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ, మంత్రి గీతారెడ్డి పట్ల ఢిల్లీ పోలీసులు దురుసుగా వ్యవహరించడం తగదన్నారు.
మహిళ అనే విషయాన్ని మర్చి ఆమెను తోసి వేయడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు. మంత్రి గీతారెడ్డికి జరిగిన దాడికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యత వహించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతున్న తరుణంలో సీఎం అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాడన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
రోడ్డెక్కని బస్సులు..మూతపడిన విద్యాసంస్థలు
జాజు టెక్స్‌టైల్ దుకాణం తెరిచి ఉండడంతో ఆగ్రహించిన పార్టీ శ్రేణులు యజమానిపై చేయిచేసుకుని బలవంతంగా మూసి వేయించారు. దీంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. భవానీమందిర్ క్రాస్‌రోడ్డు వద్ద ధర్నా చేస్తున్న ఆందోళన కారులు స్థానిక డిపో బస్సులపై రాళ్లు రువ్వారు. దీంతో ఐదు బస్సుల అద్దాలు పగిలి పోయాయి. ఒక డీసీఎం వ్యాన్ అద్దాలు సైతం దెబ్బతిన్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఆర్టీసీ బస్సులను స్థానిక డిపో అధికారులు నిలిపి వేశారు.
బంద్ సంపూర్ణంగా జరగడంతో పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశాయి. విద్యా సంస్థలు ముందుగానే సెలవు ప్రకటించాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉదయం నుంచే తెరుచుకోలేదు. సినిమా థియేటర్లు మూత పడ్డాయి. మంత్రి గీతారెడ్డికి మద్దతుగా న్యాయవాదులు విధులను బహిష్కరించారు. రంజోల్, సత్వార్, హుగ్గెల్లి గ్రామాల్లో సైతం విద్యా సంస్థలను మూసివేయించి బంద్ నిర్వహించారు. వాహనాల రాక పోకలను అడ్డుకున్నారు. బంద్‌లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింహులు, మున్సిపల్ మాజీ చైర్మన్ మంకాల్ సుభాష్, మాజీ వైస్ చైర్మన్ ఎం.డి.ఖాజా, మహిళా కాంగ్రెస్ తాలూకా అధ్యక్షురాలు షిలా రమేష్, ఆత్మ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ హన్మంత్‌రావు పాటిల్, మాజీ జడ్పీటీసీ పండరినాథ్, కాంగ్రెస్ నాయకులు ఎం.బుచ్చిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, విజయేందర్‌రెడ్డి, చంద్రశేఖర్, సతీష్, జహంగీర్, తాహెరాబేగం తదితరులు పాల్గొన్నారు.
సీఎం చిత్రపటానికి చెప్పులతో సత్కారం
బంద్ సందర్భంగా 9వ జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్ర పటానికి మహిళా నేతలు, కార్యకర్తలు చెప్పులతో సత్కారం చేశారు. ఆయన ఫోటోను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కిరోసిన్ పోసి నిప్పంటించి తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై నేతల మండిపాటు
Published Thu, Feb 6 2014 11:51 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement