వలసల జ్వరం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు వలసల జ్వరం పట్టుకుంది. ఈ రెండు పార్టీలకు చెందిన ముఖ్యనేతలతోపాటు, కిందిస్థాయి క్యాడర్ చాలావరకు సమావేశాలు, పత్రికా ప్రకటనల రూపంలో తమ వైఖరిని స్పష్టం చేస్తుండటంతో ఇప్పటికే ప్రజల విశ్వాసం కోల్పోయిన టీడీపీ, కాంగ్రెస్‌లు ఎన్నికల ముందు పెరుగుతున్న వలసలతో వణికిపోతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకోవడంతో ఆయన బాటలోనే కాంగ్రెస్‌కు చెందిన పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు జిల్లాలోని పలు మండలాల పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశాలు పెట్టి తమ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటిస్తున్నారు.
కాంగ్రెస్ నుంచి పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు, టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతిలు వైఎస్‌ఆర్‌సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. తాను ధర్మాన బాటలోనే ఉన్నానని జగన్నాయకులు ఇప్పటికే ప్రకటిం చారు. కొర్ల భారతి బహిరంగంగా బయట పడకపోయినా.. త న బంధువులను వైఎస్‌ఆర్‌సీపీలో చేరేందుకు ప్రోత్సహిస్తున్నారు. అమె కూడా చేరే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. గతంలో జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిచిన ఓదార్పు యాత్రలో ఆమె పాల్గొన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్మన్లు అందవరపు వరాహా నరసింహం(వరం), ఎం.వి. పద్మావతి, డీసీసీ అధ్యక్షుడు నర్తు నరేంద్రయాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, పలువురు మాజీ ఎంపీపీలు, మాజీ జడ్‌పీటీసీలు వైఎస్‌ఆర్‌సీపీలో చేరనున్నారు. కొత్తగా గెలుపొందిన సర్పంచ్‌ల్లో 300 మందికి పైగా ధర్మాన వెంట వచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
ఈ మేరకు ధర్మాన అనుచరులు ఒక జాబితా రూపొందిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతల చిట్టా ఇప్పటికే సిద్ధమైంది. దాన్ని ధర్మాన పరిశీలిస్తారని, ఆయన సూచన మేరకు ఇంకా ఎవరైనా చేరే అవకాశముంటే వారితో మాట్లాడిన తర్వాత తుది జాబితా తయారు చేస్తామని ఆయన ముఖ్య అనుచరులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు చెందిన 16 మంది మాజీ కౌన్సిలర్లు ధర్మానతో పాటు వైఎస్‌ఆర్‌సీపీలో చేరేందుకు రెడీగా ఉన్నారు. ఇచ్ఛాపురం నుంచి నర్తు రామారావు ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తన అనుచరులతో సహా పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. మిగిలిన నియోజకవర్గాల నుంచి కూడా భారీ స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు వైఎస్‌ఆర్‌సీపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది.
కాంగ్రెస్ అంత కాకపోయినా టీడీపీ నుంచి సైతం భారీ స్థాయిలో వైఎస్‌ఆర్‌సీపీలోకి వలసలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని టీడీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. చాలా మంది సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, ముఖ్య నాయకులు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఎర్రన్నాయుడు తర్వాత ముందుండి నడిపించే నాయకుడు టీడీపీలో లేరని, ఉన్నవారు రెండు వర్గాలుగా విడిపోవడంతో, వారితో కలిసి ఉండే కంటే పార్టీని వీడి జన బలం ఉన్న వైఎస్‌ఆర్‌సీపీలో చేరడమే మంచిదనే అభిప్రాయంలో పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన చల్లా రవికుమార్ ఇప్పటికే టీడీపీని వీడి, ధర్మాన బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలువురు నాయకులు పార్టీకి దూరంగా ఉన్నారు. నియోజకవర్గంలో ఆ పార్టీ మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయింది. కింజరాపు, కిమిడి వర్గాల ప్రభావం కూడా దీనికి కారణమైంది. సారవకోట మండలానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు వైఎస్‌ఆర్‌సీపీలో చేరనున్నారు. ఇటీవల ఇచ్ఛాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిని మార్చేందుకు రంగం సిద్ధమైందనే ప్రచారం జరిగింది. ఇందులో వాస్తవాలు ఎలా ఉన్నా ఇక్కడ గ్రూపుల వ్యవహారం ఏ స్థాయిలో ఉందనేది స్పష్టమైంది. రెండు వర్గాల వారిని ఒకతాటిపైకి తీసుకు రావాలనే చంద్రబాబు బెడిసి కొట్టింది.
మారిన సమీకరణలు
కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోతున్నాయి. మంత్రుల వద్ద ఒకస్థాయి ఉన్న నాయకులు కనిపించే పరిస్థితులు లేవు. ఇద్దరు కేంద్ర మంత్రులు, ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఉన్నా వారితో పాటు కష్టపడి తిరిగి పార్టీలో పనిచేసేవారు కరువయ్యారు. దీంతో మంత్రులు సైతం పార్టీని బలోపేతం చేసే విషయంలో చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. డీసీసీ అధ్యక్షుడిని మార్చాలని మూడు నెలల నుంచి అనుకుంటున్నా ఇంతవరకు అది సాధ్యం కాలేదు. రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను తుడిచి పెట్టాలని ప్రజలు దాదాపు నిర్ణయించుకోవడంతో నాయకులు ఆ పార్టీలో కొనసాగడానికే భయపడుతున్నారు. ప్రత్యామ్నాయం చూసుకోకపోతే రాజకీయ మనుగడ ఉండదని భావించి, వైఎస్‌ఆర్‌సీపీ వైపు అడుగులు వేస్తున్నారు.